రాయదుర్గం కోర్టుకు ఆయుధాల ముఠా

ABN , First Publish Date - 2022-12-28T00:21:28+05:30 IST

అంతర్రాష్ట్ర ఆయుధ అక్రమ విక్రయ ముఠా సభ్యులను సోమవారం రాత్రి రాయదుర్గం కోర్టు మేజిసే్ట్రట్‌ ముందు హాజరుపరచినట్లు రూరల్‌ సీఐ యుగంధర్‌ తెలిపారు.

రాయదుర్గం కోర్టుకు ఆయుధాల ముఠా

రాయదుర్గం, డిసెంబరు 27: అంతర్రాష్ట్ర ఆయుధ అక్రమ విక్రయ ముఠా సభ్యులను సోమవారం రాత్రి రాయదుర్గం కోర్టు మేజిసే్ట్రట్‌ ముందు హాజరుపరచినట్లు రూరల్‌ సీఐ యుగంధర్‌ తెలిపారు. బెంగళూరుకు చెందిన జంషీద్‌, ముబారక్‌, అమీర్‌బాషా, గోవాలోని మారగావ్‌కు చెందిన రియాజ్‌ అబ్దుల్‌, మధ్యప్రదేశలోని గోవనకు చెందిన రాజ్‌పాల్‌ సింగ్‌, నన్ను సుతర్‌ ఆదివాసీ ముఠాగా ఏర్పడి, ఆయుధాలను అక్రమంగా విక్రయించడమే కాకుండా గంజాయి, దొంగనోట్ల చెలామణి చేస్తుండేవారు. వీరిపై గోవా, కర్ణాటక, మధ్యప్రదేశలో పలు కేసులున్నాయి. ఇటీవల డి హిరేహాళ్‌లో దొంగనోట్ల చెలామణీకి సంబంధించి వసంత, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆయుధాల ముఠా సమాచారం తెలిసింది. ఆ మేరకు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలతో ప్రత్యేక బృందం విచారణ చేపట్టగా.. అంతర్రాష్ట్ర ఆయుధాల ముఠా గుట్టు రట్టయింది. నిందితులపై నిఘా ఉంచగా.. ఈనెల 25న బళ్లారి-బెంగళూరు హైవేపై రెండు వాహనాల్లో అక్రమంగా ఆయుధాలు, గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 15 పిస్తోళ్లు, ఒక రివాల్వర్‌, రెండు తపంచా, 29 కిలోల గంజాయి, ఏడు సెల్‌ఫోన్లు, మాగ్జైన్లతో పాటు పేలుడు తూటాలు లాంటివి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను రాయదుర్గం ఫస్ట్‌క్లాస్‌ మేజిసే్ట్రట్‌ ముందు హాజరు పరచగా.. రిమాండ్‌కు ఆదేశించారన్నారు.

Updated Date - 2022-12-28T00:21:29+05:30 IST