క్రీడలకు ప్రోత్సాహమేదీ?

ABN , First Publish Date - 2022-11-06T23:43:37+05:30 IST

జిల్లాలో క్రీడాకారులకు కనీస ప్రోత్సాహం కరువైంది. అధికారులుగాని, ప్రజాప్రతినిధులుగాని వారిని పట్టించుకోవడం లేదు. దీంతో అటు క్రీడాకారులు, కోచలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

క్రీడలకు ప్రోత్సాహమేదీ?

అనంతపురం క్లాక్‌టవర్‌: జిల్లాలో క్రీడాకారులకు కనీస ప్రోత్సాహం కరువైంది. అధికారులుగాని, ప్రజాప్రతినిధులుగాని వారిని పట్టించుకోవడం లేదు. దీంతో అటు క్రీడాకారులు, కోచలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కుస్తీ, సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులు భారత తరఫున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు డీఎ్‌సఏ, కలెక్టర్‌, శాప్‌ అధికారులు స్పందించి ప్రోత్సాహమందించకపోగా, సంబంధిత కోచలకు మెమోలు జారీ చేయడం గమనార్హం.

పైకాకు మంగళం... ఖేల్‌ ఖతం

14ఏళ్ల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో 16ఏళ్లలోపు బాలికలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు రూరల్‌ ఉమెనగేమ్స్‌ ప్రవేశపెట్టారు. రెండేళ్లలోనే ఆ క్రీడలను రద్దు చేశారు. 2006లో పైకా(పంచాయతీ యువ క్రీడా ఔర్‌ ఖేల్‌ అభియాన)ను ప్రారంభించారు. 2010లో పైకా రద్దు చేసి రాజీవ్‌ఖేల్‌ అభియానను ప్రారంభించారు. 2015లో అది కూడా రద్దు చేసి ఖేలో ఇండియా ప్రారంభించారు. నాలుగేళ్లలో ఒక సారి అంటే 2016లో మాత్రమే ఖేలో ఇండియా మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించారు. తర్వాత పట్టించుకోవడం మానేశారు.

శాఖల మధ్య కొరవడిన సమన్వయం

విద్యాశాఖ, క్రీడాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో విద్యార్థులను క్రీడలవైపు మళ్లించడం కష్టంగా మారింది. ప్రతి ఏటా స్కూల్‌గేమ్స్‌ కింద వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, హాకీ, అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బాక్సింగ్‌, వెయిట్‌ లిప్టింగ్‌, కబడ్డీ క్రీడాపోటీలు నిర్వహించేవారు. మండలస్థాయి పోటీలకు రూ.50వేలు, జిల్లా స్థాయి పోటీలకు రూ.5లక్షలు, రాష్ట్రస్థాయి పోటీలకు రూ.10లక్షలు ప్రభుత్వం చెల్లించేది. అయితే గతేడాది ఈ స్కూల్‌గేమ్స్‌ పోటీలు తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకు న్నారు. ఈ ఏడాదిలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు జిల్లా వ్యాప్తంగా 100ప్రాంతాల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ నిధుల లేమితో జాప్యం చేశారు. అయితే ఇప్పటికీ శిబిరాలకు సంబంధించిన క్రీడాసామగ్రి, కోచల గౌరవేతనానికి సంబంధించిన నిధులు మంజూరు చేయలేదు. తమ గౌరవేతనం ఆలస్యమైనా పర్వాలేదు కానీ క్రీడాసామగ్రికి నిధులు ఇవ్వాలని కోచలు కోరారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు.

ఫ్లేఫీల్డ్స్‌ 177లో 11 మాత్రమే పూర్తి

గ్రామీణ క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్లేఫీల్డ్స్‌ను గతేడాది ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18వేలు ప్లేఫీల్డ్స్‌ గతేడాది ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో మొదటి విడతగా 3198 నిర్మాణాలకు అనుమతించింది. వీటిలో జిల్లాకు మొదట 177ప్లేఫీల్డ్స్‌ మంజూరు చేశారు. ఇందులో 11 మాత్రమే పూర్తి చేశారు. మరో 20 పూర్తయినా ఆనలైనలో నమోదు చేయలేదని తెలుస్తోంది. జిల్లాలో 566ప్లేఫీల్డ్స్‌ ఏర్పాటుకు స్థలాలను గుర్తించారు. ఇందులో జిల్లా పరిషత పాఠశాలలు 436, ప్రభుత్వ పాఠశాలలు 19, కేజీబీవీలు 62, మోడల్‌స్కూల్స్‌ 25, రెసిడెన్షియల్‌ పాఠశాలలు 23, ఒక పాలిటెక్నిక్‌ కళాశాల ఉన్నాయి. అయితే మొదటి విడతగా ఉన్నత పాఠశాలలకు ప్రాధాన్యత ఇచ్చారు. జిల్లాలో 1003 గ్రామ పంచాయతీలలో ప్లేఫీల్డ్స్‌ నిర్మించాలనేది లక్ష్యం. అయితే గత మూడేళ్లుగా ప్లేఫీల్డ్స్‌ నిర్మాణం పూర్తిగా నిలిపివేశారు.

ప్రైవేటుపరం కానున్న ఇండోర్‌ స్టేడియం

ప్రభుత్వం, అసోసియేషన్ల ఆధ్వర్యంలో క్రీడాపోటీల నిర్వహణకు అశోక్‌ నగర్‌లోని ఇండోర్‌స్టేడియమే దిక్కు. అయితే ఇండోర్‌స్టేడియం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనుంది. ఇటీవల మొదటి విడతగా ఇండోర్‌ స్టేడియంలో ఉన్న షటిల్‌కోర్టులు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు టెండర్‌ నోటిఫికేషన సైతం జారీ చేశారు. దశల వారిగా జిల్లాలోని ఇండోర్‌స్టేడియాలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో క్రీడాకారులు ఇక నుంచి ప్రభుత్వ స్టేడియాల్లోకి అడుగుపెట్టాలంటే భారీగానే ఫీజుల చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Updated Date - 2022-11-06T23:43:38+05:30 IST