పంచాయతీ సొమ్ము పంచేసుకుంటున్నారు

ABN , First Publish Date - 2022-12-16T00:04:40+05:30 IST

పంచాయతీకి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును అక్కడి సిబ్బంది ఎంచక్కా పంచేసుకుంటున్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము ట్రెజరీకి జమ చేయకుండా సొంతానికి వాడేసుకుంటున్నారు.

పంచాయతీ సొమ్ము పంచేసుకుంటున్నారు
కొత్తచెరువు గ్రామ సచివాలయం

కొత్తచెరువు మేజర్‌ పంచాయతీలో

రూ.కోటి స్వాహా

రెండేళ్లుగా సాగుతున్న తంతు

గతంలో పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన వేటు

ఆ తరువాత కూడా ఆగని స్వాహా పర్వం

ఉదాసీనంగా ఉన్నతాధికారులు

తూతూమంత్రంగా విచారణలు

కొత్తచెరువు, (బుక్కపట్నం)డిసెంబరు 15: పంచాయతీకి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును అక్కడి సిబ్బంది ఎంచక్కా పంచేసుకుంటున్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము ట్రెజరీకి జమ చేయకుండా సొంతానికి వాడేసుకుంటున్నారు. ఇది ఒకరోజు, రెండ్రోజులు కాదు. రెండేళ్లుగా ఈ తంతు సాగుతూనే ఉంది. రూ.కోటికిపైగా మింగేశారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. విచారణ చేస్తున్నారు, నివేదిక ఇస్తున్నారు. అక్కడితో వదిలేస్తున్నారు. ఇదివరకే ఓ పంచాయతీ కార్యదర్శి అక్రమాలు తేలడంతో సస్పెండ్‌ చేశారు. ఆ తరువాతైనా అక్రమాలు ఆగాయా అంటే అదీ లేదు. ఆ తరువాత ఆ సీటులోకి వచ్చిన అధికారి కూడా అక్రమాల తంతును కొనసాగించారు. మిగతా సిబ్బంది కూడా ఎవరు వసూలు చేసింది వారు.. వాడేసుకుంటున్నారు. పంచేసుకుంటున్నారు. అధికారులు మళ్లీ విచారణకని బయల్దేరారు. విచారణ చేయడం, నివేదిక ఇవ్వడంతోనే సరిపెడతారేమో? అంతకంటే ఏం చేయలేకపోతున్నట్లున్నారు పాపం. అడ్డుకట్ట వేయడం చేతగావట్లేదేమో? రికవరీ ఊసెత్తడమే వారి వద్ద వేస్టేమో? ఈసారి కూడా తూతూమంత్రంగా విచారణ, ఆ తరువాత దానిని కప్పిపెట్టడమే చేస్తారేమో? అంతకంటే ఏం చేతనయ్యేలా లేదు పాపం.. అధికారులకు..!

ఆగని అక్రమాలు

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన అధికారులు, సిబ్బంది అక్రమార్కులై రూ.కోటి పంచాయతీ సొమ్మును స్వాహా చేశారు. కొత్తచెరువు మేజర్‌ పంచాయతీలో అక్రమాల తంతు కొనసాగుతూనే ఉంది. 2020లో పంచాయతీలో వివిధ పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన రూ.58 లక్షలను ట్రెజరీకి జమచేయకుండా అప్పటి పంచాయతీ కార్యదర్శి సొంత ఖాతాలకు మళ్లించారు. దానిపై విచారణ చేసిన అధికారులు ఆమెను సస్పెండ్‌ చేశారు.

ఆమె స్థానంలో అదే ఏడాది మార్చిలో ఇనచార్జిగా వచ్చిన సీనియర్‌ అసిస్టెంట్‌ జయచంద్ర సైతం పంచాయతీ సొమ్ము రూ.18 లక్షలను ట్రెజరీకి జమ చేయకుండా సొంతానికి వాడుకున్నారు. విచారణ చేసిన అధికారులు సదరు మొత్తాన్ని రికవరీ చేయించడంలో విఫలమయ్యారు. ఆ అవినీతి బాగోతంలో 5 నెలల క్రితం బదిలీపై వెళ్లిన ఈఓఆర్డీ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిపై ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఇక, ఎవరూ ఏమీ చేసుకోలేరని ప్రస్తుతం కిందిస్థాయి సిబ్బందికి బాగా అర్థమైనట్లుంది. ఇంకేముంది, రోజూ వసూలయ్యే సొమ్మును సొంతానికి వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా పంచాయతీలో వివిధ పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాలను పంచాయతీ ఖాతాలకు జమ చేయకుండా అధికారులే పంచుకుని, దిగమింగారు. మంచినీటి కొళాయిల డిపాజిట్లు, ఇంటిపన్నుల రూపేనా, రూ.కోటికిపైగా వసూలు చేసి, వాటిని సొంత అవసరాలకు వాడుకున్నారు. ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, పంచాయతీ సిబ్బంది వివిధ పన్నుల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని వాటాలు వేసుకుని, స్వాహా చేశారన్నది బహిరంగ రహస్యం.

రసీదులు, పుస్తకాలు మాయం

ప్రజల నుంచి వివిధ పన్నుల రూపేనా డబ్బు వసూలు చేసి, అందుకుగాను వారికి రసీదులు అధికారులు ఇచ్చారు. ఆ రసీదు పుస్తకాలు ప్రస్తుతం పంచాయతీ కార్యాలయంలో మాయమయ్యాయి. కాదు, మాయం చేశారు. పన్నులు చెల్లించిన ప్రజలు తమకు ఇచ్చిన రసీదులను చూపిస్తుండగా.. వాటికి సంబంధించిన రసీదు పుస్తకాలు మాత్రం అధికారులు మాయం చేసినట్లు తెలుస్తోంది. అవినీతి బాగోతం బయటపడకుండా ఆ రసీదు పుస్తకాలను మాయం చేసినట్లు తెలుస్తోంది. స్వాహా బాగోతం ఉన్నతాధికారులకు తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

చర్యలు తీసుకుంటాం..

కొత్తచెరువు మేజర్‌ పంచాయతీలో పన్నుల సొమ్ము దారి మళ్లింపు ఆరోపణలపై విచారణ చేయిస్తున్నాం. అక్రమాలు వాస్తవమని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

- విజయ్‌కుమార్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

డీఎల్‌పీఓ విచారణ

కొత్తచెరువు పంచాయతీలో పన్నుల సొమ్ము స్వాహాపై డీఎల్‌పీఓ బాలాజీ గురువారం విచారణ చేపట్టారు. పంచాయతీ కార్యాలయంలో ఆయన రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీలో అక్రమాలపై ఆరోపణల నేపథ్యంలో విచారణ చేస్తున్నామన్నారు. మూడు రోజులపాటు కొనసాగిస్తామన్నారు. నివేదికలను జిల్లా అధికారులకు అందజేస్తామన్నారు.

Updated Date - 2022-12-16T00:04:43+05:30 IST