ఎమ్మెల్యే.. షాడోతో భ్రష్టు పట్టిన మున్సిపాలిటీ

ABN , First Publish Date - 2022-12-08T00:37:53+05:30 IST

అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అతని షాడో ఎమ్మెల్యే, మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌ మియా వల్ల తాడిపత్రి మున్సిపాలిటీ భ్రష్టుపడుతోందని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి మండిపడ్డారు. నిధులలేమి పేరుతో పారిశుధ్యాన్ని అటకెక్కించారని, సమస్యను పరిష్కరించేందుకు తాను బుధవారం భిక్షాటన చేపడితే.. పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే.. షాడోతో భ్రష్టు పట్టిన మున్సిపాలిటీ

నిధుల కోసం భిక్షాటన చేస్తే అడ్డుకుంటారా..?

పోలీసులపై జేసీ ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

తాడిపత్రి, డిసెంబరు 7: అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అతని షాడో ఎమ్మెల్యే, మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌ మియా వల్ల తాడిపత్రి మున్సిపాలిటీ భ్రష్టుపడుతోందని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి మండిపడ్డారు. నిధులలేమి పేరుతో పారిశుధ్యాన్ని అటకెక్కించారని, సమస్యను పరిష్కరించేందుకు తాను బుధవారం భిక్షాటన చేపడితే.. పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే గాంధీజీ విగ్రహం వద్ద గోచీ కట్టుకుని నిరసన తెలుపుతానని హెచ్చరించారు. పట్టణంలో జేసీపీఆర్‌ భిక్షాటన విషయం తెలుసుకున్న పోలీసులు జేసీ నివాసానికి ఉదయమే భారీగా చేరుకున్నారు. జేసీ నివాసానికి వెళ్లే మార్గంలో బారికేడ్లను అడ్డంగా పెట్టారు. ఈ నేపథ్యంలో గ్రీన తాడిపత్రి, క్లీన తాడిపత్రి నినాదాలు రాసిన బోర్డును మెడలో వేసుకుని, కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్‌ కార్యాలయానికి జేసీపీఆర్‌ వెళ్లారు. అక్కడ నిరుపయోగంగా ఉన్న చెత్త సేకరణ వాహనాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆదేశాలతో మున్సిపల్‌ అధికారులు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం నిధుల సేకరణ కోసం భిక్షాటనకు బయలుదేరిన ఆయనను పట్టణ, రూరల్‌ సీఐలు ఆనంద్‌రావు, చిన్నపెద్దయ్య, ఎస్‌ఐలు, సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసు అధికారుల తీరుపై జేసీపీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ చైర్మనగా తాను పట్టణంలో ఎక్కడైనా తిరుగుతానని అన్నారు. ఎమ్మెల్యే మాటలు విని తనను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. దీంతో పట్టణంలో 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉందని, ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు ఆయనకు తెలిపారు. భిక్షాటనకు అనుమతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఇప్పుడే అనుమతి ఇవ్వాలని జేసీ వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసులు డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన అనుమతి నిరాకరించడంతో పోలీసులు జేసీపీఆర్‌కు నచ్చజెప్పారు. దీంతో వారి నిస్సహాయతను అర్థం చేసుకున్న ఆయన, తాను ఎప్పుడైనా ఒంటరిగా పట్టణంలో భిక్షాటన చేస్తానని, తాత్కాలికంగా వాయిదా వేసుకుంటానని చెప్పి, విరమించారు.

Updated Date - 2022-12-08T00:37:56+05:30 IST