విప్లవ జ్యోతి.. తరిమెల నాగిరెడ్డి
ABN , First Publish Date - 2022-07-28T04:56:00+05:30 IST
పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుల్లో తరిమెల నాగిరెడ్డి ఒకరు. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, గాంధీజీ ప్రభావం నుంచి మార్క్సిజం వైపు ఆకర్షితులై పీడిత ప్రజలకోసం నిరంతరం తపించిన వ్యక్తి తరిమెల నాగిరెడ్డి.
సమాజంపై చిన్ననాటి నుంచే అవగాహన
ఆ దిశలోనే పోరాటం, పుస్తక రచన
బడుగుల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు...
నేడు తరిమెల నాగిరెడ్డి 46వ వర్ధంతి
అనంతపురం కల్చరల్, జూలై 27: పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుల్లో తరిమెల నాగిరెడ్డి ఒకరు. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, గాంధీజీ ప్రభావం నుంచి మార్క్సిజం వైపు ఆకర్షితులై పీడిత ప్రజలకోసం నిరంతరం తపించిన వ్యక్తి తరిమెల నాగిరెడ్డి. పేదరిక నిర్మూలనకు కమ్యూనిజమే మార్గమని నమ్మి, పురోగమించిన మహోన్నత వ్యక్తి ఆయన. ఉమ్మ డి ఆంధ్రప్రదేశ కమ్యూనిస్టు అగ్రనాయకుల్లో ఆయన ఒకరు. గురువారం ఆయన వర్ధంతి.
విద్యార్థి దశలోనే రచయితగా...
తరిమెల నాగిరెడ్డి అనంతపురం జిల్లా తరిమెల గ్రామం రైతు కుటుంబంలో 1917 ఫిబ్రవరి 11న జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు సుబ్బారెడ్డి, నాగలక్ష్మమ్మ. పాఠశాల రోజుల నుంచే సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లక్షణాలు కనబర్చాడు. ప్రసిద్ధి గాంచిన రిషివ్యాలీ విద్యాలయంలో నీలం సంజీవరెడ్డితో కలిసి విద్యా భ్యాసం చేశారు. ఆ కాలంలోనే దేశకాల పరిస్థితులు తెలిసిన రచయితగా, మానవత్వం పరిమళించిన మనిషిగా పుస్తకాలను రచించారు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో ‘యుద్దం - ఆర్థిక ప్రభా వం’ అన్న పుస్తకం రాసి అందరినీ ఆలోచింపజేశారు. ఈ పుస్తకం రాసినందుకు బ్రిటీష్ ప్రభుత్వం ఆయనకు జైలు శిక్ష విధించింది. తిరుచిరాపల్లి జైలు నుంచి విడుదలవగానే 1941లో భారతీయ రక్షణ చట్టం కింద అరెస్టయ్యాడు. 1946లో ప్రకాశం ఆర్డినెన్సు కింద అరెస్టయ్యి 1947లో విడుదల చేయబడ్డాడు. నాగిరెడ్డి చేసిన రచనల్లో ముఖ్యమైనది మార్ట్‌గేజ్‌డ్(తాకట్టులో భారతదేశం).
రాజకీయ జీవితం
1952లో నాగిరెడ్డి మద్రాసు శాసనసభకు సీపీఐ అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. జైలులో ఉండి కూడా ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, తన బావ అయిన నీలం సంజీవరెడ్డిపై విజయం సాధించి సంచలనం సృష్టించాడు. 1955లో కొత్తగా ఏర్పడిన పుట్లూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీచేసి తరిమెల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1957లో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. తిరిగి 1962లో పుట్లూరు నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ శాసనసభకు సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి తరిమెల రామచంద్రారెడ్డిని ఓడించి ఎన్నికయ్యాడు. 1967లో నియోజకవర్గాల పునర్విభజనలో పుట్లూరు నియోజకవర్గం రద్దు కాగా... సీపీఐ(ఎం) అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి మూడో పర్యాయం శాసనసభకు ఎన్నికయ్యాడు. 1968 మార్చి నెలలో శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1969లో నాగిరెడ్డి సీపీఐ(ఎం) నుంచి విడిపోయి ఆంధ్ర ప్రదేశ కోఆర్డినేషన కమిటీ ఆఫ్ కమ్యూనిస్టు రెవల్యూషనరీ్‌స(ఏపీసీసీఆర్) - ఆంధ్రప్రదేశ కమ్యూనిస్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీని స్థాపించాడు. సీపీఐ(ఎం) కార్యకర్తలను కొత్తపార్టీలోకి ఆకర్షించడంలో సఫలమయ్యాడు. 1976లో తాను మరణించేదాకా ఏపీసీసీఆర్ నాయకుడిగా కొనసాగిన నాగిరెడ్డి ప్రజలకు నిరుపమాన సేవలందించారు.
బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికే అంకితం...
నాగిరెడ్డి మార్క్సిజం జీవన గమ్యంగా తన జీవితాన్ని అణగారిన బడుగు, బలహీనవర్గాల ప్రజ ల అభివృద్ధికే అంకితం చేశారు. ప్రజా ఆప్తబంధువువైన ఆయన 1976 జూలై 28న మరణించారు. భౌతికకాయాన్ని తరిమెలకు తీసుకెళ్తుండగా కల్లూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ప్రజలు తండోపతండాలుగా రావడంతో పోలీసులు వెనక్కు తగ్గారు. పోస్టుమార్టం తర్వాత భౌతికకాయాన్ని బంధువులకు అప్పగించారు.
నీలం సంజీవరెడ్డిని ఓడించి...
అశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఎరుగని నేతగా తరిమెల నాగిరెడ్డి పేరుగాంచారు. జీవితాంతం విలువలు పాటించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈక్రమంలోనే తన సమీప బంధువైన దివంతగ మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని 1952 ఎన్నికల్లో ఓడించారు. ‘వీరులారా మీకు పరి పరి దండాలు’ అంటూ ప్రజానీకం ఆర్తిగా పాడుకునే పాటలకు స్ఫూర్తిగా నిలిచిన నాగిరెడ్డి జీవితమే పఠనీయ గ్రంథమని ఎంతోమంది జాతీయ నాయకులు కొనియాడటం ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. తరిమెల నాగిరెడ్డిది విలక్షణ జీవన విధానం. 1964లో కమ్యూని స్టులు రెండుగా చీలిన తర్వాత దేవులపల్లి వెంకటేశ్వర రావుతో విప్లవకారుల సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని పోరాటాలు చేశారు.
నేడు లలిత కళాపరిషతలో నాగిరెడ్డి వర్ధంతి సభ
తరిమెల నాగిరెడ్డి 46వ వర్ధంతిని సభను గురువారం ఉదయం 10.30 గంటలకు లలితకళా పరిషతలో నిర్వహించనున్నట్లు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పెద్దన్న బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు అన్ని వామపక్షాలను కలుపుకుని కృష్ణకళామందిర్ నుంచి లలితకళాపరిషత వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం పరిషతలో నాగిరెడ్డి వర్ధంతి సభ నిర్వహిస్తామని తెలిపారు. అన్నివర్గాలవారు పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.