Tana service programs: రేపటి నుంచి జిల్లాలో తానా సేవా కార్యక్రమాలు

ABN , First Publish Date - 2022-11-30T23:58:55+05:30 IST

జిల్లాలో ఈనెల 2వతేదీ నుంచి తానా(ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన) ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అసోసియేషన ఫౌండేషన ట్రస్టీ పురుషోత్తంచౌదరి గూడె, అగ్రికల్చర్‌ ఫోరం కోఆర్డినేటర్‌ రఘు ఎద్దులపల్లి తెలిపారు. బుధవారం అశోక్‌నగర్‌లోని తానా క్యాంపు కార్యాలయంలో కళ్యాణదుర్గానికి చెందిన బీటెక్‌ చదువుతున్న పేద విద్యార్థి రక్షితకు తానా సభ్యులు రూ.75వేలు విలువ చేసే ల్యాప్‌టాప్‌ అందజేశారు.

Tana service programs: రేపటి నుంచి జిల్లాలో తానా సేవా కార్యక్రమాలు
పేద విద్యార్థినికి ల్యాప్‌టాప్‌ అందజేస్తున్న తానా సభ్యులు

అనంతపురం క్లాక్‌టవర్‌, నవంబరు 30: జిల్లాలో ఈనెల 2వతేదీ నుంచి తానా(ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన) ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ఫౌండేషన ట్రస్టీ పురుషోత్తంచౌదరి గూడె, అగ్రికల్చర్‌ ఫోరం కోఆర్డినేటర్‌ రఘు ఎద్దులపల్లి తెలిపారు. బుధవారం అశోక్‌నగర్‌లోని తానా క్యాంపు కార్యాలయంలో కళ్యాణదుర్గానికి చెందిన బీటెక్‌ చదువుతున్న పేద విద్యార్థి రక్షితకు తానా సభ్యులు రూ.75వేలు విలువ చేసే ల్యాప్‌టాప్‌ అందజేశారు. ఈ సందర్భంగా పురుషోత్తం చౌదరి, రఘు మాట్లాడుతూ పదేళ్లుగా తానా ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు రూ.300కోట్లతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. తానా చైతన్య స్రవంతి ద్వారా ఈనెల 2 నుంచి జనవరి 7వతేదీ వరకు రూ.5కోట్లతో ఉమ్మడి ఏపీలో సేవ కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు.

2వతేదీ ఆవులన్న గ్రామంలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ చేతుల మీదుగా రూ.10లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభిస్తామన్నారు. 3వతేదీన కళ్యాణదుర్గంలో 35మంది పేద విద్యార్థులకు రూ.10వేలుచొప్పున స్కాలర్‌షిప్‌ పంపిణీ చేస్తామని తెలిపారు. 4వతేదీన చాపిరి గ్రామంలో మెగా ఉచిత కంటివైద్య శిభిరం నిర్వహిస్తామని వెల్లడించారు. కులమతాలకు అతీతంగా రైతులు, పేద విద్యార్థులకు సేవచేయడమే లక్ష్యంగా తానా పనిచేస్తోందన్నారు. గతంలో తానా ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా వ్యవసాయ కిట్లు పంపిణీ చేశామని, తిరిగి చేపడతామని తెలిపారు. సేవా కార్యక్రమాలకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కన్వెన్షన్ కన్వీనర్‌ రవి పొట్లూరి, తానా చైతన్యస్రవంతి కోఆర్డినేటర్‌ సునీల్‌పండ్రా హాజరవుతారన్నారు. కార్యక్రమంలో పీవీకేకే ప్రిన్సిపాల్‌ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-01T10:41:09+05:30 IST