Ippatam: ఇప్పటం గ్రామస్తులకు ఏపీ హైకోర్టులో మరోమారు షాక్..

ABN , First Publish Date - 2022-12-14T15:28:57+05:30 IST

ఇప్పటం గ్రామస్తులకు (Ippatam Village) ఏపీ హైకోర్టులో (AP HighCourt) మరోమారు చుక్కెదురైంది. ఇళ్ల కూల్చివేత వ్యవహారంలో అధికారులు షోకాజ్ నోటీసులిచ్చిన విషయాన్ని..

Ippatam: ఇప్పటం గ్రామస్తులకు ఏపీ హైకోర్టులో మరోమారు షాక్..

అమరావతి: ఇప్పటం గ్రామస్తులకు (Ippatam Village) ఏపీ హైకోర్టులో (AP HighCourt) మరోమారు చుక్కెదురైంది. ఇళ్ల కూల్చివేత వ్యవహారంలో అధికారులు షోకాజ్ నోటీసులిచ్చిన విషయాన్ని దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందిన ఇప్పటం గ్రామానికి చెందిన 14 మంది పిటిషనర్లకు ఏపీ హైకోర్టు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ జరిమానాపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషనర్లు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్ల ఇళ్లను కాపాడుకోవాలన్న ఉద్దేశమేనని న్యాయవాది వాదన వినిపించారు. జరిమానా తగ్గించాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు బుధవారం నాడు తిరస్కరించింది.

ఇళ్ల కూల్చివేత వ్యవహారంలో అధికారులు షోకాజ్‌ నోటీసులిచ్చిన విషయాన్ని దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందిన ఇప్పటం గ్రామానికి చెందిన 14 మంది పిటిషనర్లకు హైకోర్టు గత నవంబర్‌లో షాక్‌ ఇచ్చింది. ఖర్చుల కింద ఒక్కో పిటిషనర్‌కు రూ.లక్ష చొప్పున మొత్తం 14 లక్షలు విధించింది. సొమ్మును రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. పిటిషనర్లు వాస్తవాలను దాచిపెట్టి వ్యాజ్యం దాఖలు చేశారని.. స్వచ్ఛమైన మనసుతో కోర్టును ఆశ్రయించలేదని పేర్కొంది. నోటీసులో ఏముందే తెలియదన్న పిటిషనర్ల వాదన నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించింది. వాస్తవాలను దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందడం న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని తెలిపింది. నోటీసులిచ్చిన విషయాన్ని దాచడమే గాక ఇవ్వలేదని అబద్ధం చెప్పారని ఆక్షేపించింది. కోర్టుతో ఆటలాడవద్దని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ఆ సందర్భంలో ఆదేశాలిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలోని రామాలయవీధి రోడ్డు విస్తరణ పేరుతో దశాబ్దాల క్రితం నిర్మించుకున్న తమ ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారని పేర్కొంటూ గ్రామానికి చెందిన బెల్లంకొండ వెంకటనారాయణ, మరో 13 మంది ఈ నెల 4న అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. ఇళ్ల కూల్చివేత నిమిత్తం అధికారులు జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.

ఆ వ్యాజ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మే 21న ఇచ్చిన నోటీసుల ఆధారంగా కూల్చివేతలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి జరిగిన విచారణలో.. పిటిషనర్లకు మే 10నే షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ విషయాన్ని వారు అఫిడవిట్లలో పేర్కొనకుండా మధ్యంతర ఉత్తర్వులు పొందారని తెలిపారు. షోకాజ్‌ నోటీసులు అందుకున్న మాట వాస్తవమేనని పిటిషనర్ల తరఫు న్యాయవాది టి.సాయిసూర్య అంగీకరించారు. ఆ విషయాన్ని అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. షోకాజ్‌ నోటీసులివ్వకుండా అధికారులు ఏకపక్షంగా ఇళ్లు కూల్చివేస్తున్నారని అఫిడవిట్‌ వేయడంతోనే మధ్యంతర ఉత్తర్వులిచ్చామన్నారు. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు కోర్టు ముందు హాజరుకావాలని పిటిషనర్లను ఆదేశించారు. 11 మంది రైతులు న్యాయస్థానం ముందు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో మరో ముగ్గురు రాలేదు.

న్యాయవాది లక్ష్మీనారాయణరెడ్డి పిటిషనర్లకు కోర్టు విచారణ ప్రక్రియను తెలుగులో వివరించారు. ముందుగా మొదటి పిటిషనర్‌ బెల్లంకొండ వెంకటనారాయణను న్యాయమూర్తి వివరణ అడిగారు. మే నెలలో తమకు నోటీసు అందిందని, దానిని తీసుకుని ఎమ్మెల్యేను కలిశామని.. ఆ నోటీసులో ఏముందో తమకు తెలియదని ఆ రైతు తెలిపారు. న్యాయవాది టి.సాయి సూర్య స్పందిస్తూ.. పిటిషనర్లు రైతులని.. వారికి సాధారణ నోటీసుకు, షోకాజ్‌ నోటీసుకు తేడా తెలియదని.. వాస్తవాలను దాచిపెట్టలేదని పేర్కొన్నారు. ఈ వాదనలపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. షోకాజ్‌ నోటీసులు అందిన విషయాన్ని దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందడం వాస్తవాలను తొక్కిపెట్టడం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదన్నారు. ఒక్కొక్కరికీ రూ.లక్ష ఖర్చులు విధిస్తున్నట్లు ప్రకటించారు. పిటిషనర్లు చిన్న రైతులని.. ఖర్చుల కింద విధించిన రూ.లక్ష మొత్తాన్ని తగ్గించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది అభ్యర్థించారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్లపై దయతలిస్తే ఇలాంటి చర్యలను ప్రోత్సహించడమే అవుతుందని.. వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించడానికి అవకాశం ఉన్నా.. ఖర్చులు మాత్రమే విధించి వదిలేశామని స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-14T15:38:24+05:30 IST