CBI : టీడీపీ నాయకురాలి ఇంట్లో సీబీఐ సోదాలు
ABN , First Publish Date - 2022-11-05T06:19:24+05:30 IST
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఇంట్లో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఆమె నివాసానికి
సవిత భర్త రైల్వే కాంట్రాక్టరు
రైల్వే ఉద్యోగి ఖాతాలో ఆయన నగదు వేశారని ఆరోపణ
పెనుకొండ, నవంబరు 4: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఇంట్లో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఆమె నివాసానికి ఉదయం 6 గంటలకే బెంగళూరు నుంచి వారు వచ్చారు. ‘మేం సీబీఐ అధికారులం. రైల్వే కాంట్రాక్టు పనుల విషయంలో మీ భర్త వెంకటేశ్వర్లుపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మీ ఇంట్లో సోదాలు చేయడానికి సెర్చ్ వారెంట్‌తో వచ్చాం. మాకు సహకరించండి..’ అని సవితను కోరారు. అయితే తన భర్త ఊళ్లో లేరని.. ఆయన లేని సమయంలో సోదాలు ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. కనీసం మహిళా కానిస్టేబుల్ లేకుండా ఎలా వస్తారని ఆమె నిలదీశారు. ‘మీ భర్త బ్యాంకు ఖాతా నుంచి ఓ అధికారికి నగదు బదిలీ అయింది.. అందుకే సోదాలకు వచ్చాం..’ అని అధికారులు తెలిపారు. అనంతరం సవిత ఇంటి పక్కనే ఉన్న టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్ సమక్షంలో ఎఫ్‌ఐఆర్ కాపీ, సెర్చ్‌వారెంట్‌ను సీబీఐ అధికారులు ఆమెకు చూపించారు.
స్థానిక పోలీసు స్టేషన్ నుంచి మహిళా కానిస్టేబుల్‌ను పిలిపించారు. అనంతరం సవిత ఇంట్లోకి వెళ్లి.. సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని తలుపులు వేయించారు. ఇంటిలో అణువణువు సోదా చేశారు. వెంకటేశ్వర్లుకు సంబంధించిన రైల్వే కాంట్రాక్టు పనుల రికార్డులు, సవితకు చెందిన కొన్ని లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటి జాబితా తయారు చేసి.. సాక్షుల సంతకాలు తీసుకున్నారు. అవసరమైనప్పుడు కోర్టుకు హాజరు కావలసి ఉంటుందని, తమకు సహకరించాలని సవితకు సీబీఐ అధికారులు సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత సోదాలు ముగించి బెంగళూరుకు తిరిగి వెళ్లారు. సుమారు 7 గంటలపాటు తనిఖీలు జరిపారు.