పవన్‌, చంద్రబాబు కలయికతో కదులుతున్న బలిజనసైన్యం

ABN , First Publish Date - 2022-10-28T00:42:59+05:30 IST

ఇటీవలి విశాఖ పర్యటన పరిణామాల అనంతరం జరిగిన పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబుల కలయిక తిరుపతి కేంద్రంగా కొత్త రాజకీయ సమీకరణలకు దారివేస్తోంది.

పవన్‌, చంద్రబాబు కలయికతో కదులుతున్న బలిజనసైన్యం

ఇటీవలి విశాఖ పర్యటన పరిణామాల అనంతరం జరిగిన పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబుల కలయిక తిరుపతి కేంద్రంగా కొత్త రాజకీయ సమీకరణలకు దారివేస్తోంది. బలిజ సామాజికవర్గం పునాదిగా జనసేన, టీడీపీ దగ్గరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈనెల 30న జరగనున్న తిరుపతి నియోజకవర్గ పూర్వ పీఆర్పీ మిత్రుల ఆత్మీయ కలయిక ఇందుకు నాంది కాబోతోంది.

తిరుపతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న జనసైనికులు, పాత మిత్రులతో కొత్త స్నేహాలకు తెర తీస్తున్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ కలయికలో ఎన్నికల ప్రస్తావన లేకపోయినా, ప్రభుత్వ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కలిసి పనిచేయాలనే నిర్ణయం తీసుకోవడం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ పరిణామం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల్లో ఊపునిస్తోంది. జిల్లాలో టీడీపీ, జనసేనల నడుమ ఐక్యతకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా రాజకీయంగా చెల్లాచెదురుగా వున్న బలిజ సామాజికవర్గాన్ని ఒక్క తాటిపైకి తెచ్చేందుకు క్షేత్ర స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. బలిజ సామాజికవర్గం బలంగా ఉన్న తిరుపతి ఇందుకు వేదిక అవుతోంది.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున తిరుపతి నుంచీ పోటీ చేసినపుడు సామాజికవర్గం మొత్తం ఒక్కటై ఆయనను గెలిపించింది. ఆ తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచీ తప్పుకోవడంతో సామాజికవర్గం కూడా ముక్కచెక్కలైంది. ఈ వర్గం ప్రస్తుతం టీడీపీలో ఎక్కువగా కొనసాగుతుండగా కొంతమేరకు జనసేనలోనూ, కనిష్టంగా వైసీపీలోనూ కొనసాగుతోంది. ప్రజారాజ్యం పార్టీలో నగర అధ్యక్షుడిగా, నియోజకవర్గ ఇంఛార్జిగా వ్యవహరించి చిరంజీవి తరపున పార్టీని నడిపించిన ఊకా విజయ్‌కుమార్‌ తర్వాత ఆయనతో పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు. చిరంజీవి క్రియాశీలక రాజకీయాల నుంచే తప్పుకోవడంతో టీడీపీలో చేరిపోయారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన టీడీపీని, జనసేన శ్రేణుల్ని ఒక్కటి చేయడానికి యత్నిస్తున్నారు. ఇందుకోసం ముందుగా ప్రజారాజ్యంలో పనిచేసిన శ్రేణులతో ఈనెల 30న పూర్వ ప్రజారాజ్యం పార్టీ మిత్రుల ఆత్మీయ కలయిక పేరిట సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అప్పట్లో పీఆర్పీలో పనిచేసిన వారిలో ఇపుడు వైసీపీలో చురుగ్గా వున్న వారిని మినహాయించి మిగిలిన వారిని వారు ఏ పార్టీలో వున్నా కూడా సమావేశానికి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. వైసీపీలో చురుగ్గా లేని వారినీ, ఆ పార్టీలోనే వుంటూ అసంతృప్తిగా వున్న వారినీ కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. వైసీపీలో చురుగ్గా వున్న పూర్వ పీఆర్పీ శ్రేణుల మీద రెండో దశలో దృష్టిపెట్టాలనే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ, జనసేన నడుమ పొత్తు వుంటుందా లేదా, అభ్యర్థులు ఎవరు అన్నదానితో నిమిత్తం లేకుండా ముందుగా తిరుపతిలో వైసీపీని ఎదుర్కోవడంపైనే దృష్టి సారించనున్నట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి సమావేశం విజయవంతమైతే అదే ఫార్ములాను ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా టీడీపీ, జనసేన పార్టీల్లో అమలు చేసే పరిస్థితి కనిపిస్తోంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలిజ సామాజికవర్గం తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, పీలేరు, తంబళ్ళపల్లె నియోజకవర్గాల్లో గణనీయంగా వుంది. జనసేనకు బలమైన నాయకత్వం లేని కారణంగా పలు సెగ్మెంట్లలో అభిమానులు, సానుభూతిపరులు, మద్దతుదారులు నిద్రాణంగా వున్నారు. మదనపల్లెలో ప్రజాబలమున్న నేత గంగారపు రామదాస్‌ చౌదరి నేతృత్వంలో పార్టీ ప్రభావవంతంగా వుంది. తిరుపతి, జీడీనెల్లూరు, శ్రీకాళహస్తి సెగ్మెంట్లలో కొంత మేరకు కార్యకలాపాలు నడుస్తూ పార్టీ ఉనికిని చాటుతున్నాయి. తాజా పరిణామాలతో జనసేన శ్రేణుల్లోనూ, ఆశావహుల్లోనూ అవకాశాల పట్ల ఆశలు చిగురిస్తున్నాయి. జనసేన, టీడీపీ మైత్రి ఎన్నికలలోనూ కొనసాగితే మాత్రం జిల్లా రాజకీయ సమీకరణలో పెనుమార్పులే ఉంటాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎటువంటి ప్రతి వ్యూహం అవలంబిస్తుందో చూడాల్సి ఉంది.

Updated Date - 2022-10-28T19:10:19+05:30 IST