శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలపై రాళ్లదాడి
ABN , First Publish Date - 2022-05-01T07:50:00+05:30 IST
వైసీపీ దౌర్జన్యకాండతో శ్రీకాళహస్తి పట్టణం శనివారం అట్టుడికిపోయింది.
ఇద్దరికి గాయాలు.... కారు అద్దాల ధ్వంసం
పాల సరఫరా సంఘం ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే యత్నం
వైసీపీ దౌర్జన్యకాండ
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 30: వైసీపీ దౌర్జన్యకాండతో శ్రీకాళహస్తి పట్టణం శనివారం అట్టుడికిపోయింది. శ్రీకాళహస్తి పాల సరఫరా సంఘం ఎన్నికల సన్నాహాల్లో వున్న టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు జరిపిన దాడిలో ఇద్దరికి గాయాలు కాగా రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.శ్రీకాళహస్తి పాలసరఫరా సంఘం ఎన్నికలకు మూడు రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం నామినేషన్ల స్వీకరణ కావడంతో ఉదయం నుంచే నామినేషన్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.టీడీపీ నుంచి నామినేషన్లు దాఖలవుతాయనే అనుమానంతో పలువురు నేతలను పోలీసులు బైండోవర్ పేరుతో ఎక్కడికక్కడ నిర్బంధించారు.ఎన్నికల నియమావళిలో ముందస్తు బైండోవర్ పేరుతో పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి కేసులు లేనివారిని, బయటప్రాంతాల్లో ఉన్నవారిని సైతం నిర్బంధించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ముందుగా మన్నవరం నుంచి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు పార్టీ నాయకులతో కలిసి శ్రీకాళహస్తికి వస్తుండగా ఈండ్రపల్లె వద్ద రూరల్ ఎస్‌ఐ వెంకటేష్ అడ్డుకున్నారు. మధ్యాహ్నం దాకా అక్కడే నిర్బంధించారు. అనంతరం చెంచయ్యనాయుడు ఇదే మార్గంలో ఏర్పేడు మండలం పల్లంపేట వద్ద వెంకటగిరి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయంలో ఉన్న పలువురు నాయకులను రెండవ పట్టణ పోలీసులు నిర్బంధించారు. దక్షిణకైలాస్ నగర్ కాలనీలో నివాసముంటున్న తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉషను ఇంటి వద్దే నిర్బంధించారు.సొంతపనుల నిమిత్తం శ్రీకాళహస్తి టీడీపీ మండలాధ్యక్షుడు కామే్‌షయాదవ్ తిరుపతికి వెళ్లగా ఫోన్ చేసి అక్కడే ఉండాలంటూ ఆదేశించిన పోలీసులు తిరుపతిలోనే ఆయన్ను నిర్బంధించారు. తొట్టంబేడు మండల పార్టీ అధ్యక్షుడు గాలి మురళీ నాయుడిని కొణతనేరిలోని ఆయన నివాసం వద్దే నిర్బంధించారు.పట్టణ టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌లో నేతలు సమావేశమై ఈ నిర్బంధాలపై చర్చించారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామయుతం కాదన్నారు.అనంతరం రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు,తొట్టంబేడు మండలానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మంగారెడ్డి, బయ్యారెడ్డితో కలిసి కారులో ఇంటికి మధ్యాహ్నం 12గంటలకు బయలుదేరారు.ఆర్టీసీ బస్టాండు వద్ద ఎన్టీఆర్ కూడలిలో శ్రీకాళహస్తీశ్వరాలయ బోర్డు సభ్యుడు బుల్లెట్ జయశ్యామ్ తన అనుచరులతో కలిసి వారిని అడ్డుకున్నారు. నిజానికి గాలి చలపతి నాయుడితో పాటు వెంట ఉన్న ఇద్దరికీ పాల సరఫరా సహకార సంఘంలో ఓటుహక్కు లేదు. కానీ వారు నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళుతున్నారన్న ఉద్దేశంతో వారిపై రాళ్లవర్షం కురిపించారు. కారు లోపలకు అద్దాల పలుకులు, రాళ్లు దూసుకురావడంతో టీడీపీ నాయకులు దిగి పారిపోయే యత్నం చేశారు.వారిని చుట్టుముట్టిన వైసీపీ వర్గీయులు ప్రజలందరూ చూస్తుండగానే రక్తగాయాలయ్యేలా దాడి చేసి పరారయ్యారు.ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ కూడలి వద్ద ఆందోళన చేపట్టాయి. తిరుపతి పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు నరసింహయాదవ్ అక్కడికి చేరుకున్నారు.అనంతరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని డీఎస్పీ విశ్వనాథ్‌కు ఫిర్యాదు చేశారు.దాడి జరిగిన వీడియోలను పోలీసులకు సమర్పించారు. తమకు న్యాయం చేసే వరకు పోరాటం ఆపేది లేదని పోలీ్‌సస్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశాక తిరిగి సాయంత్రం మూడున్నర గంటలకు ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్నారు.మీడియాతో మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఫ్యాక్షన్ రాజకీయాలకు శ్రీకారం చుట్టడం మంచిపద్ధతి కాదంటూ టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ ధ్వజమెత్తారు.శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అరాచక వ్యక్తులను ప్రోత్సహిస్తూ శాంతిభద్రతలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.వైసీపీ తీరు మార్చుకోకపోతే ప్రజలే తరిమి కొడతారని హెచ్చరించారు.సాయంత్రమైనా దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవడంతో పెండ్లిమండపం వద్ద మరోసారి టీడీపీ నేతలు రోడ్డుపై భైఠాయించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోతే నిరసన విరమించేది లేదని భీష్మించారు.సీఐ శ్రీనివాసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా వెళ్లిపోవాలని సూచించడంతో టీడీపీ శ్రేణుల్లో ఆవేదన కట్టలు తెంచుకుంది. నడిరోడ్డుపై తమ నాయకులను చంపబోతే పోలీసులు ఏం చేశారని నిలదీశారు.దీంతో డీఎస్పీ విశ్వనాథ్ అక్కడికి చేరుకుని ధర్నా చేస్తున్న వారితో చర్చలు జరిపారు.ముక్కంటి ఆలయ పాలకమండలి సభ్యుడు బుల్లెట్ జయశ్యామ్, అతడి అనుచరులు కప్పల గణేష్, బుడ్డా కిషోర్, పసల నాగరాజుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎఫ్‌ఐఆర్ కాపీ, అరెస్టు ఫొటోలను టీడీపీ నాయకులకు చూపడంతో ధర్నాను విరమించారు. అనంతరం తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వరరెడ్డికి ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బయలుదేరి వెళ్లారు.
దాడిచేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి
తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 30: శ్రీకాళహస్తిలో అకారణంగా టీడీపీ నాయకులపై మారణాయుధాలతో దాడిచేసిన వైసీపీ కార్యకర్తలను తక్షణం అరెస్ట్ చేయాలని ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని టీడీపీ నాయకులు కోరారు.నరసింహయాదవ్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి టీడీపీ నాయకులు శనివారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశారు.తమ కారును అడ్డగించి, ధ్వంసం చేసి రాళ్లు, రాడ్లు, కత్తులతో తమపై దాడిచేసినట్టు టీడీపీ నాయకులు గాలి చలపతినాయుడు, మంగారెడ్డి, బయ్యారెడ్డి ఎస్పీకి ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు.గాయాలను ఎస్పీకి చూపించారు.అయితే శ్రీకాళహస్తి పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసును బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. న్యాయంగా దాడి ఘటనను పరిశీలించి తగిన సెక్షన్లతో కేసులు నమోదుచేయాలని, తక్షణం నిందితులను అరెస్ట్ చేసి న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దశరథాచారి, సూరా సుధాకర రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు, లీగల్‌సెల్ అధ్యక్షులు బాలకృష్ణమనాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష, నాయకులు మునిరామయ్య, మనోహరాచారి, రుద్రకోటి సదాశివం, హేమంత్‌రాయల్, రాజయ్య, చెంగయ్య, రాంబాబు, సింగంశెట్టి సుబ్బరాయులు, వెంకటే్‌షయాదవ్, శ్రీరామ్ వారి వెంట వున్నారు.