లారీ ఢీకొని ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-11-11T00:11:51+05:30 IST

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామ కెనాల్‌ రోడ్డు వద్ద గురువారం కాలినడకన బలభద్రపురం సాయిబాబా ఆలయానికి వెళ్తున్న ఐదుగురు మహిళలపైకి లారీ వెనుక నుంచి దూసుకుపోయి పక్కనే ఉన్న గోదావరి కాలువలోకి బోల్తాపడింది.

 లారీ ఢీకొని ఇద్దరు మృతి

సామర్లకోట, నవంబరు 10: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామ కెనాల్‌ రోడ్డు వద్ద గురువారం కాలినడకన బలభద్రపురం సాయిబాబా ఆలయానికి వెళ్తున్న ఐదుగురు మహిళలపైకి లారీ వెనుక నుంచి దూసుకుపోయి పక్కనే ఉన్న గోదావరి కాలువలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కఠారి హేమ(35), ఆనందాల విజయలక్ష్మి(10) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో విజయలక్ష్మి తల్లి ఆనందాల లోవ, విశ్వంశెట్టి రమణ, మునుకుర్తి పార్వతిలు తీవ్రంగా గాయపడ్డారు. సామర్లకోట మండలం వేట్లపాలెం జొన్నలదొడ్డి ప్రాంతానికి చెందిన వీరంతా పక్కపక్కన నివాసం ఉంటున్న వేర్వేరు కుటుంబాలకు చెందినవారు. గురువారం సాయీబాబాకు ప్రీతి అయిన రోజు కావడంతో కాలినడకన బలభద్రపురం వెళ్లేందుకు గురువారం ఇంటి నుంచి బయలుదేరారు. పెదబ్రహ్మదేవం గ్రామం రైలు గేట్‌ జంక్షన్‌ సమీపించేసరికి వెనుక నుంచి సామర్లకోట మీదుగా బిక్కవోలు వెళ్తున్న లారీ అతివేగంగా వారిని ఢీకొంది. పక్కనే గల కాలువలోకి దూసుకుపోయి బోల్తా కొట్టింది. డ్రైవర్‌, క్లీనర్‌లు ఇద్దరూ సురక్షితంగా గట్టుకు చేరుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే సామర్లకోట పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులు ముగ్గురినీ చికిత్స నిమిత్తం ముందుగా వేట్లపాలెం తరలించారు. అక్కడ నుంచి చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. దైవదర్శనానికి వెళ్తూ లారీ ఢీకొని ఇద్దరు మహిళలు మృతిచెందడంతో జొన్నలదొడ్డిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ప్రమాదస్థలి వద్దకు చేరుకుని రోదిస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. వేట్లపాలెం మాజీ ఉపసర్పంచ్‌ గోలి వెంకట్రావు, ఉపసర్పంచ్‌ గోలి శ్రీరామ్‌, ఎంపీటీసీ పాలచర్ల రేవతీసతీ్‌షకుమార్‌లు బాధిత కుటుంబాలను ఓదార్చారు.

Updated Date - 2022-11-11T00:11:53+05:30 IST