Gorantla: రెక్కల కష్టం చంద్రబాబుది... రిబ్బన్ కటింగ్ జగన్ రెడ్డిదా?..
ABN , First Publish Date - 2022-09-06T20:39:36+05:30 IST
సంగం బ్యారేజీలో రెక్కల కష్టం చంద్రబాబుదని... రిబ్బన్ కటింగ్ జగన్ రెడ్డిదా? అని ఎమ్మెల్యే గోరంట్ల ప్రశ్నించారు.
అమరావతి (Amaravathi): సంగం బ్యారేజీలో రెక్కల కష్టం చంద్రబాబుదని... రిబ్బన్ కటింగ్ జగన్ రెడ్డిదా? అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Choudhary) ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జలవనరుల శాఖ నిద్రపోతోందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఆగిపోయాయని ఆరోపించారు. 82.86 శాతం చంద్రబాబు (Chandrababu) పూర్తి చేస్తే.. 18శాతం సీఎం జగన్ (CM Jagan) పూర్తి చేయలేక పోయారని ఎద్దేవా చేశారు. మూడేళ్ళుగా 18 శాతం పనులు పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలకు గ్రామాలు నీటమునిగినా.. లక్షలాది మంది నిరాశ్రయులైనా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. 2021 జనవరికి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని 2019లో జగన్ ఆర్భాటంగా చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు పనులు ఆగిపోయేలా చేశారని దుయ్యబట్టారు. 20 శాతం పనులు పూర్తి చేసివుంటే జయలలిత నగర్, ఇస్లాంపేట, బుజ్జమ్మడొంక, కొత్తయ్య ఎస్టేట్ చౌదరి కాలనీలు మునిగేవికావన్నారు. పులిచింతల ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారని, పోలవరాన్ని గుదిబండగా మార్చి, నిర్వాసితులను గంగలో కలుపుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.