రేషన్‌ డెలివర్రీ..!

ABN , First Publish Date - 2022-10-24T01:25:04+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఇంటింటికీ రేషన్‌ విధానం వీరికి కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ప్రభుత్వం చెప్పినట్లు ఇంటింటికీ బియ్యం సరఫరా చేయకపోగా వీధి చివరన వాహనం పెట్టి లబ్ధిదారులను గంటలపాటు నిలబెట్టడం, లబ్ధిదారులకు అదనపు సమస్యగా మారింది. గతంలో సమీపంలో ఉన్న రేషన్‌షాపునకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్లి బియ్యం తెచ్చుకునే వీలుండేది. ఇప్పుడు రేషన్‌ సరఫరా వాహనం ఎప్పుడు వస్తుందా అని ఒకటో తేదీ నుంచి ఎదురుచూడాల్సి వస్తోంది.

రేషన్‌ డెలివర్రీ..!

రేషన్‌బియ్యం పంపిణీలో తప్పని తిప్పలు

మొబైల్‌ డిస్పెన్సివ్‌ యూనిట్‌ విధానంతో అవస్థలు

అరకొర సరుకులతో లబ్ధిదారులకు టోకరా

నామమాత్రపు పంపిణీతో సగం మందికి డుమ్మా

సమయానికి లేరంటూ చౌకబియ్యం ఎగవేత

అక్రమాలకు పాల్పడుతున్న వాహనదారులు, వలంటీర్లు

ఈనెల రేషన్‌ సరఫరా చేసేందుకు సామర్లకోటలో నిమ్మతోట సమీపాన గల విమల్‌ లే అవుట్‌ కాలనీవాసులకు వాహనాన్ని అరకిలోమీటరు దూరంలో నిలిపి లబ్ధిదారులకు ఫోన్లు చేసి వాహనం ఉన్నచోటుకే రమ్మని వాహనదారుడు సమాచారమిచ్చాడు. కొందరు కార్డుదారులు వాహనం వద్దకు అంతదూరం వెళ్లలేకపోయారు. వెళ్లినవారికీ పూర్తిస్థాయిలో అందరికీ బియ్యం ఇవ్వలేదు. తెచ్చిన బియ్యం అయిపోయాయి. మళ్లీ వస్తాయి అంటూ వాహనదారుడు వెళ్లిపోయాడు. తిరిగి ఆ వాహనం రాలేదు. లబ్ధిదారులకు బియ్యం రాలేదు. ఇది సామర్లకోట పట్టణంలోని ఒక డిపో పరిధిలో జరిగిన సంఘటన.

సామర్లకోట మండలం వేట్లపాలెం భేతాళస్వామి గుడిప్రాంతానికి రేషన్‌ వాహనం వచ్చింది. బయోమెట్రిక్‌ పడని కొందరి వృద్ధుల వేలిముద్రలు సరిచూశారు. బయోమెట్రిక్‌ ఈ-పోస్‌కు అనుసంధానం కావడం లేదన్నారు. వలంటీర్‌ సైతం వాహనదారుడు చెప్పిందే చెప్పి వృద్ధురాలిని వెనుక్కు పంపారు. ఇలా 18నెలలుగా చెబుతూ రేషన్‌ బియ్యం స్వాహాకు పాల్పడుతున్నారు. ఆ వృద్ధురాలికి నెలకు వచ్చే ఐదు కిలోల బియ్యాన్ని సైతం వలంటీరు, వాహనదారులు వదల్లేదు అనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఇదే రీతిలో తమ బియ్యాన్ని స్వాహా చేస్తున్నట్టు లబ్ధిదారులనుంచి ఆరోపణలు వస్తున్నాయి. సామర్లకోట మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.

సామర్లకోట, అక్టోబరు 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఇంటింటికీ రేషన్‌ విధానం వీరికి కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ప్రభుత్వం చెప్పినట్లు ఇంటింటికీ బియ్యం సరఫరా చేయకపోగా వీధి చివరన వాహనం పెట్టి లబ్ధిదారులను గంటలపాటు నిలబెట్టడం, లబ్ధిదారులకు అదనపు సమస్యగా మారింది. గతంలో సమీపంలో ఉన్న రేషన్‌షాపునకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్లి బియ్యం తెచ్చుకునే వీలుండేది. ఇప్పుడు రేషన్‌ సరఫరా వాహనం ఎప్పుడు వస్తుందా అని ఒకటో తేదీ నుంచి ఎదురుచూడాల్సి వస్తోంది. వాహనం వచ్చే సమయానికి లేకపోతే రేషన్‌ సరుకులు ఆ నెలలో కోల్పోవాల్సిందే. ఇలా ప్రతినెలా కొన్ని వేల కుటుంబాలు రేషన్‌ సరుకులు కోల్పోతున్నారు. పోనీ రేషన్‌ వదిలేసుకుని పనికి వెళ్దామా అంటే కార్డు రద్దు చేస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది.

బియ్యం మిగుల్చుకునేందుకు అడ్డదార్లు...

పనులకు వెళ్లేవారు ఉండని కారణంగా బియ్యం మిగులుతున్న విషయాన్ని గుర్తించిన మొబైల్‌ వాహనాదారులు దాన్ని ఆదాయమార్గంగా మార్చుకుంటున్నారు. ప్రతినెలా ఫలానా వీధికి, ఫలానా రోజుకు వస్తారన్న గ్యారంటీ లేకుండా ఎప్పుడు వస్తుందో తెలియక పనులకు వెళ్లినవారు రేషన్‌ నష్టపోతున్నారు. దీనికితోడు వాహనంలో తక్కువ సరుకులు తీసుకువచ్చి కొందరికి మాత్రమే సరఫరా చేసి అయిపోయి మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిపోతున్నారు. తిరిగి ఆ వీధికి వెళ్లకుండా తప్పుకుంటున్నారు. ఫలితంగా లబ్ధిదారులు రేషన్‌షాపుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అథెంటికేషన్‌ పేరిట వలంటీర్లు వాహనదారులతో కుమ్ముక్కై లబ్ధిదారులు బియ్యాన్ని పెద్దఎత్తున నెలల తరబడి స్వాహాకు పాల్పడుతున్నారు. ఇటీవల నాలుగు రోజుల క్రితం సామర్లకోట మండలంలో వలంటీరు, వాహనదారుడూ కలిసి 18నెలలుగా లబ్ధిదారుల బియ్యాన్ని స్వాహాకు పాల్పడిన విషయాన్ని ఆంధ్రజ్యోతి ద్వారా వెలుగులోకి తీసుకురావడం, దీనిపై విచారణ చేస్తామన్న అధికారులపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడిలు తీసుకురావడం మూలంగా ఆ బియ్యం స్వాహాకు పాల్పడిన వారిపై నేటికీ చర్యలు తీసుకోకపోగా అక్రమార్కులు మరింత దోచుకునేందుకు నాయకులు, అధికారులు దోహదపడ్డారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. వాహనదారులు, వలంటీర్లు కుమ్ముక్కై ఒకరిపై మరొకరు నెపం చూపి లబ్ధిదారులను పదేపదే తిప్పుతున్నారు. విసిగి వేసారిపోతున్న లబ్ధిదారులు రేషన్‌ను వదులుకుంటున్నారు.

గత విధానమే మేలంటున్న లబ్ధిదారులు

జిల్లాలో 6,43,146 కార్డుదారులు ఉన్నారు. చౌక దుకాణాలనుంచి ఎండీయూ వాహనాల ద్వారా ప్రతినెలా 9,702.92 మెట్రిక్‌ టన్నుల మేర బియ్యం, 700 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు, 400 మెట్రిక్‌ టన్ను పంచదార చొప్పున ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రతినెలా ఒకటో తేదీనుంచి 15 లోపు 15రోజులపాటు రేషన్‌ ఇచ్చే విధానం ఉండడంతో ఎప్పుడు వీలైతే అప్పుడు లబ్ధిదారులు రేషన్‌ షాపునకు వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు. గత ప్రభుత్వం రేషన్‌ పోర్టబులిటీ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పక్క జిల్లాలనుంచి వలస వచ్చిన వారికి కూడా సమీపంలోని రేషన్‌ సరుకులు కోల్పోయే ఇబ్బంది ఉండేది కాదు. దీంతో లబ్ధిదారులు ఈ విధానం పట్ల చాలా సంతృప్తిగా ఉండేవారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి వాహనాలు కొనుగోలు చేసి ప్రవేశపెట్టిన డోర్‌ డెలీవరీ విధానం అక్రమాలకు ఆదాయమార్గంగాను, లబ్ధిదారులకు ప్రాణసంకటంగాను మారింది.ఙ

Updated Date - 2022-10-24T01:26:19+05:30 IST