ఫ్లెక్సీల వివాదం.. సయోధ్య
ABN , First Publish Date - 2022-12-29T01:20:44+05:30 IST
నూతన సంవత్సరం సందర్భంగా నరసరావుపేటలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసే ఫ్లెక్సీల వివాదం ముదిరి పాకాన పడింది.
మూడు రోజులుగా నరసరావుపేటలో రచ్చ
మాజీ మంత్రి కాసుతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి భేటీ
నరసరావుపేట, డిసెంబరు 28: నూతన సంవత్సరం సందర్భంగా నరసరావుపేటలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసే ఫ్లెక్సీల వివాదం ముదిరి పాకాన పడింది. కాసు వర్గానికి చెందిన వైసీసీలోని ముఖ్య నేతలు కృష్ణారెడ్డి ఫొటోలతో ముద్రించిన ఫ్లెక్సీల ఏర్పాటును ఎమ్మెల్యే వర్గం అడ్డుకుండటంతో మూడు రోజులుగా రచ్చ జరుగుతుంది. ఇరు వర్గాల మధ్య రాజీ చేసేందుకు మంగళవారం పార్టీలోని కొందరు నేతలు కాసు గృహానికి వెళ్లి ఆయనతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఫ్లెక్సీల వివాదానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు నేరుగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే బుధవారం రాత్రి మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి గృహానికి వెళ్లి ఆయన భేటీ అయ్యారు. ఇరువురి మధ్య వాడి వేడిగానే చర్చలు జరిగినట్లు పార్టీలోని కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు. ఫ్లెక్సీలను అడ్డుకున్న తీరుపై ఎమ్మెల్యేను కాసు కృష్టారెడ్డి నిలదీశారని సమాచారం. తనను అవమానించేలా వ్యవహరించారని కాసు ఎమ్మెల్యే వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి వర్గం ఏర్పాటు చేసే ఫ్లెక్సీలలో మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఫొటోలు ముద్రించేలా, కాసు వర్గం ఏర్పాటు చేసే ఫ్లెక్సీలలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫొటోలు ముద్రించేలా ఇరువురి నేతల మధ్య జరిగిన చర్చల్లో ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుతుంది. దీంతో ఇరువురి మధ్య చర్చలు సఫలమయ్యాయని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు నియోజకవర్గంలో పునరావృతం కాకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే అంగీకరించనట్లు కాసు వర్గం చెబుతున్నది. మొత్తం మీద వైసీపీలో నెలకొన్న ఫ్లెక్సీల వివాదానికి తెరపడిందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు.