167ఏ.. నాలుగు లేన్లు
ABN , First Publish Date - 2022-10-24T00:12:49+05:30 IST
పల్నాడు, బాపట్ల జిల్లాలను కలిపే పొందుగల - ఓడరేవు రహదారిని ఐదేళ్ల క్రితం 167ఏ జాతీయ రహదారిగా కేంద్రం గుర్తించింది. అయితే ఇంతకాలానికి ఈ 167ఏ రహదారికి మోక్షం లభించింది.
నరసరావుపేట, అక్టోబరు 23: పల్నాడు, బాపట్ల జిల్లాలను కలిపే పొందుగల - ఓడరేవు రహదారిని ఐదేళ్ల క్రితం 167ఏ జాతీయ రహదారిగా కేంద్రం గుర్తించింది. అయితే ఇంతకాలానికి ఈ 167ఏ రహదారికి మోక్షం లభించింది. ఎట్టకేలకు నాలుగు వరుసలుగా రహదారిని విస్తరించేందుకు కేంద్రం పరిపాలన అనుమతి ఇచ్చింది. 107 కిలో మీటర్ల పొడవున ఉన్న రహదారికి సంబంఽ దించిన సర్వేను జాతీయ రహదారుల శాఖ పూర్తి చేసింది. ఇక ఈ రహదారి పనులను ప్రారంభించేందుకు భూ సేకరణ చేయాల్సి ఉంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట, రొంపిచర్ల, నకరికల్లు మండలాల పరిధిలో భూసేకరణ చేయాల్సి ఉంది. భూసేకరణకు జేసీని ప్రత్యేక అధికారిగా నియమించారు. నాలుగు వరుసలుగా రోడ్డు విస్తరణ, చిలకలూరిపేట, నరసరావుపేట పట్టణాలకు బైపాస్ నిర్మాణానికి కలిసి మొత్తం 739.31 ఎకరాల భూమిని సేకరించాలని జాతీయ రహదారి శాఖ గుర్తిం చింది. దీనిలో 706.80 ఎకరాలు ప్రైవేట్ భూమి, 32.51 ఎకరాలు ప్రభుత్వం భూమి ఉన్నట్లు నిర్ధారించారు. ప్రైవేట్ భూమి సేకరణకు సర్వే నెంబర్లు వారీగా రైతుల పేర్లను కూడా నమోదు చేశారు. భూములను గుర్తిం చడంతో పాటు రహదారి నిర్మాణానికి మార్కింగ్ కూడా చేశారు. ఈ రహదారిని నకరికల్లు అడ్డరోడ్డు వరకు విస్తరిస్తారు. ప్రస్తుతం ఉన్న అద్దంకి - నార్కెట్‌పల్లి రహదారికి అనుసందానం చేస్తారు. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట మండలం కంతేటివారి కండ్రిక నుంచి నకరికల్లు అడ్డరోడ్డు వరకే భూసేకరణ జరగనున్నది. ఈ రహదారి నిర్మాణానికి అయ్యే వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తుందని సదరు అధికారులు తెలిపారు.
గ్రామాల వారీగా భూ సేకరణ ఇలా..
చిలకలూరిపేట మండలం కంతేటివారి కండ్రికలో 6.81 ఎకరాల భూమిని రహదారి నిర్మాణానికి సేకరించాల్సి ఉంది. గొట్టిపాడు గ్రామ పరిధిలో 13.62 ఎకరాలు, పసుమర్రు 100.44 ఎకరాలు, చినకండ్రిక 5.33, బొప్పుడి 58.49, పురుషోత్తంపట్నం 16.52, కావూరు 49.15 ఎకరాల భూమి సేకరించాలి. నాదెండ్ల మండలం గోవిందాపురంలో 43.76, గణపవరంలో 5.80, ఇర్లపాడు 14.66, కనపర్రులో 4.91, నరసరావుపేట మండలం కేసానుపల్లి గ్రామ పరిధిలో 85.39, జొన్నలగడ్డ 37.15, నరసరావుపేట 33.55, గుంటగార్లపాడు 39.85, రావిపాడు గ్రామ పరిధిలో 83.22 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. రొంపిచర్ల మం డలం మాచవరం పరిధిలో 11.28, విప్పర్లలో 24.58, నకరి కల్లు మండలం రూపెనగుంట్లలో 43.23, చల్లగుండ్లలో 66.80 ఎకరాల భూసేకరణ చేయాలి. భూ సేకరణ ప్రక్రియను రెవెన్యూ శాఖ చేపట్టనున్నది. సర్వే నెంబర్లు వారీగా రైతులకు భూసేకరణకు సంబంధించిన నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. రైతుల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాల సేకరణ జరగాలి. ఈ ప్రక్రియ రానున్న రెండు నెలల్లో పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
బైపాస్‌తో పెరిగిన భూముల ధరలు
నరసరావుపేట, చిలకలూరిపేట బైపాస్‌ల నిర్మాణా నికి ప్రతిపాదనలు, సర్వే నేపథ్యంలో ఆయా ప్రాంతా ల్లో భూముల ధరలు ఇప్పటికే పెరిగాయి. బైపాస్ పేరుతో క్రయవిక్రయాలు ఊపందుకుంటున్నాయి. అయితే జొన్నలగడ్డ గ్రామానికి చెందిన రైతులు భూ సేకరణకు అభ్యంతరం చెబుతున్నారు. ఈ మేరకు కలె క్టర్, ఎంపీలకు వినతిపత్రాలను కూడా అందజేశారు. ప్రస్తుతం ఉన్న రహదారికి 300 మీటర్ల లోపే బైపాస్ నిర్మించనున్నారని, పాత రహదారినే విస్తరిం చాలని వారు కోరుతున్నారు. బైపాస్ పేరుతో రియ ల్టర్లు ఆ ప్రాంతంలోని భూముల ధరలు పెంచే స్తున్నా రు. కాగా ప్రభుత్వం ఇటీవల భూములు రిజిస్ట్రేషన్ ప్రకా రం మార్కెట్ విలువను పెంచింది. భూసేకరణ జరిగే ప్రాంతంలో ఎకరం ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ రూ.16 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రకారం భూసేకరణ జరిగితే చాలామంది రైతులకు నష్టం ఉండదన్న అంచనా.
===========================================================