పట్టాలెక్కిన పనులు

ABN , First Publish Date - 2022-11-28T01:10:15+05:30 IST

నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కొరవడటంతో అర్ధంతరంగా నిలిచిపోయిన పనులు పునఃప్రారంభం కానున్నాయి.

పట్టాలెక్కిన పనులు
నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం పటం

నడికుడి - శ్రీకాళహస్తి పనులు పునః ప్రారంభం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యకుదిరిన ఒప్పందం

గుండ్లకమ్మ నుంచి కనిగిరి వరకు తొలగిన అడ్డంకులు

రూ.431.57 కోట్ల అంచనాతో 80 కిలోమీటర్ల మేర నిర్మాణం

జనవరిలో టెండర్లు ఖరారు.. రెండేళ్లలో పనులు పూర్తికి లక్ష్యం

గుంటూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కొరవడటంతో అర్ధంతరంగా నిలిచిపోయిన పనులు పునఃప్రారంభం కానున్నాయి. ఇటీవలే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగిన అనంతరం ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేందుకు ఒక ఒప్పందానికి వచ్చాయి. భూసేకరణ వరకే రాష్ట్ర ప్రభుత్వం చేసి ఇచ్చేట్లు, ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు అంతా కేంద్ర ప్రభుత్వం సమకూర్చే విధంగా ఒప్పందం జరిగింది. దీంతో గుండక్లమ్మ రైల్వేస్టేషన్‌ నుంచి నిలిచిన పనులను కనిగిరి వరకు సుమారు 80 కిలోమీటర్ల దూరం మేర నూతన రైలుమార్గం నిర్మించేందుకు రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. జనవరిలో టెండర్లు ఖరారు చేసి రెండేళ్ల వ్యవధిలో పనులు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకొన్నది. నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గాన్ని కేంద్ర ప్రభుత్వం 2011-12లో మంజూరు చేసింది. 308.70 కిలోమీటర్ల దూరం రూ.2,288.77 కోట్లతో నిర్మాణం ప్రారంభించింది. టీడీపీ హయాంలో శరవేగంగా భూసేకరణ జరిగింది. దీంతో న్యూపిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు రైలుమార్గం నిర్మాణం జరిగి కమిషనింగ్‌ కూడా అయింది. అయితే ప్రాజెక్టు ఖర్చులో 1/3వ వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండగా వైసీపీ ప్రభుత్వం తన వాటా రూ.1,351 కోట్లు ఇవ్వలేదు. దాంతో గుండ్లకమ్మ నుంచి పనులను అర్ధంతరంగా నిలిపేశారు. ప్రాజెక్టు నిర్ణీత వ్యవధిలో పూర్తి కాక పోవడంతో అంచనా వ్యయం ప్రస్తుతం రూ.3,122.35 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టుని ప్రధానమంత్రి సమీక్ష చేసే ప్రాజెక్టుల్లో చేర్చారు. పలు దఫాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల అనంతరం భూసేకరణ వరకే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ఒప్పందం జరిగింది. దీంతో భూసేకరణ పూర్తి అయిన కనిగిరి వరకు రైలుమార్గం నిర్మించేందుకు రైల్వే శాఖ తాజాగా టెండర్లు పిలిచింది. మొత్తం నాలుగు ప్యాకేజీల్లో రూ.431.57 కోట్లతో ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో బిడ్‌లు ఆహ్వానించింది. 2023 జనవరి మొదటి వారంలో టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది.

Updated Date - 2022-11-28T01:10:21+05:30 IST