ఊడ్చేశారు
ABN , First Publish Date - 2022-10-21T05:55:11+05:30 IST
పేరుకే గ్రామ ప్రథమ పౌరులం.. గ్రామాల్లో ఏ పనులు చేయలేక పోతున్నాం. కేంద్రం ఆర్థిక సంఘం నిధులిస్తోంది.
పంచాయతీ ఖజానా ఖాళీ
గ్రామ పంచాయతీలకు నిధుల గండం
విద్యుత్ బకాయిల పేరుతో కేంద్ర నిధులు మళ్లింపు
15వ ఆర్థిక సంఘం నిధులూ వదల్లేదు..
విద్యుత్ బకాయిల పేరుతో జరిమానాలు
పాత బకాయిలూ చెల్లించని వైనం
మరోవైపు సచివాలయాల నిర్వహణ భారం పంచాయతీల పైనే..
పనులు చేయలేక దోషులుగా పల్లె ప్రథమ పౌరులు
గుంటూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): పేరుకే గ్రామ ప్రథమ పౌరులం.. గ్రామాల్లో ఏ పనులు చేయలేక పోతున్నాం. కేంద్రం ఆర్థిక సంఘం నిధులిస్తోంది.. వెనువెంటనే ఆ నిధులను విద్యుత్ బకాయిల కింద జమ చేసుకుంటున్నారు. కరెంటు లేకుంటే మంచినీ పథకం పనిచేయదు. వర్షాలకు గ్రామల్లో రోడ్లన్నీ గుంతలుగా మారాయి.. కనీసం వాటిని బాగు చేయిద్దామన్నా డబ్బులు లేవు. గ్రీన్ అంబాజిడర్లకు పది నెలల నుంచి జీతాలివ్వలేదు. అంటువ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకుందామన్నా నిధులు లేవు.. ఇదీ పంచాయతీ సర్పంచ్‌ల ఆవేదన. ఖాజానా ఖాళీగా ఉండడంతో ఏ పనులు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. పంచాయతీ ఖజానా ఖాళీ అయింది. పాత బకాయిలు వాటికి గుదిబండలా మారాయి. తాజాగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశామని కేంద్రం ప్రకటించింది. ఈ డబ్బు ట్రెజరీలో జమకాక ముందే విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించలేదని సర్‌చార్జ్ పేరుతో రాష్ట్రప్రభుత్వం లాగేసింది. దీంతో సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారు. గుంటూరు జిల్లాలో 257, పల్నాడు జిల్లాలో 527, బాపట్లలో 461 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 1,172 మంది సర్పంచ్‌లు ఉన్నారు. మిగిలిన వాటిలో స్పెషలాఫీసర్లు పనిచేస్తున్నారు. ఆయా పంచాయతీల నుంచి పారిశుధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఫినాయిల్, బ్లీచింగ్, సున్నం, స్టేషనరీ పంచాయతీ నిధుల నుంచే కొనుగోలు చేయాలి. కానీ ఖజానా నిండుకోవడంతో ఏ పనీ చేయలేక పోతున్నామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక సంఘం నిధులు జమ..
గతంలో పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో 2021 వరకు కేంద్రం నిధులు విడుదల చేయలేదు. ఎన్నికలు జరిగాక 14వ ఆర్థిక సంఘం తొలివిడత నిధులు, 15వ ఆర్థిక సంఘం తొలి, రెండవ విడత నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో 1,224 పంచాయతీలకు సుమారు రూ.250 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఈ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిల పేరుతో జమచేసుకొంది. పైగా సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో జరిమానా వేసినట్లు డీపీవో కార్యాలయం తెలిపింది. ఉమ్మడి జిల్లాలో విద్యుత్ బకాయిలు, జరిమానా సుమారు రూ.400 కోట్లు ఉన్నట్లు ట్రాన్సకో అధికారులు నోటీసులు పంపుతున్నారు.
గుదిబండలా పాత బకాయిలు..
గ్రామ పంచాయతీలకు పాతబకాయిలు గుదిబండలా మారాయి. సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంగా పోలింగ్‌స్టేషన్ల వద్ద మౌలిక వసతులు కల్పించారు. దీనికి సంబంధించి బిల్లులు ఇంతవరకు రాలేదు. ఉమ్మడి జిల్లాలో ఈ బిల్లులే సుమారు రూ.వందకోట్ల వరకు పెండింగ్‌లో వున్నాయి. వీటితో పాటు ఉద్యోగుల వేతనాలు ఇవ్వలేక సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉపాధి హామీ బిల్లులు ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తోంది. ఇవ్వవద్దంటూ అధికార పార్టీ నేతలు వత్తిడి చేస్తున్నారు. ఇవ్వకపోతే చెక్‌పవర్ రద్దుచేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
భారంగా సచివాలయాల నిర్వహణ
ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన సచివాలయాల నిర్వహణను గ్రామ పంచాయతీలకు అప్పగించింది. సచివాలయాలు, ఆర్‌బీకేల వద్ద్ద మౌలిక వసతులు గ్రామ పంచాయతీలు కల్పించాల్సి వస్తోంది. మరో వైపు సచివాలయాల ఏర్పాటుతో సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతున్నారు.
నిధులు లేకుండా ఎలా?
రోడ్ల మీద వర్షపు నీరు చేరి గుంతలు పడుతున్నాయి. వర్షపునీరు, డ్రైనేజీలను బాగుచేద్దామన్నా డబ్బు లేదు. వీటితోపాటు పంచాయతీలకు రిజిస్ట్రేషన్, మైనింగ్ శాఖల ద్వారా వచ్చే సర్‌చార్జ్ నిధులను కూడా జమచేయటంలేదు. జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో సిబ్బందిని నియమించారు. చెత్తపన్ను వసూలుచేసి జగనన్న స్వచ్ఛ సంకల్పం సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. దీనికంటే ముందే గ్రీన్ అంబాసిడర్ల పేరుతో రిక్షాలు ఏర్పాటుచేసి పారిశుధ్య కార్మికులను నియమించారు. పదినెలల నుంచి వీరికి వేతనాలు ఇవ్వలేదు.
విద్యుత్ బిల్లులు చెల్లించలేదని కరెంట్‌కోత
2018 నుంచి 2021 ఎన్నికలు జరిగే వరకు ప్రభుత్వ అదికారులు స్పెషలాఫీసర్లుగా ఉన్నారు. ఆ సమయంలో విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. ఏడాది క్రితం ఎన్నికయిన సర్పంచ్‌లకు పాతబిల్లులు చెల్లించాలని ట్రాన్స్‌కో అదికారులు నోటీసులిస్తున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా విద్యుత్ కట్ చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో వీధిలైట్లు వెలిగించ లేకపోతున్నారు. విద్యుత్ లేకపోతే ప్రజలు సర్పంచ్‌లను నిందిస్తున్నారు.
రూ.కోటి బకాయిలున్నాయి..
మండల కేంద్రమైన అమర్తలూరు గ్రామ పంచాయతీకి రూ.కోటి బకాయిలున్నాయి. రూ.64 లక్షలు విద్యుత్ బకాయిల పేరుతో ఆర్థికసంఘం నిధులు ప్రభుత్వం జమ చేసుకొంది. గ్రీన్ అంబాసిడర్లకు పదినెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. రోడ్లు, ఇతర పనులు చేసినవారికి బిల్లులు రాలేదు. పాతబకాయిల పేరుతో పంచాయతీకి వచ్చే నిధులను జమ చేసుకోవటంతో ఏ పనులు చేయలేక పోతున్నాం. - డి.రాము, సర్పంచ్, అమర్తలూరు, బాపట్ల జిల్లా
రూ.87 లక్షలు జమచేసుకొన్నారు..
పాతబకాయిల పేరుతో ఆర్థిక సంఘం నిధులు రూ.87 లక్షలు జమచేసుకొన్నారు. ప్రస్తుతం రూ.19 లక్షలు బకాయి ఉన్నట్లు నోటీసులిచ్చారు. స్పెషలాఫీసర్ల పాలనలో ఉన్న బకాయిలను మేము చెల్లించాల్సి వస్తోంది. కరెంటు లేకపోతే మంచినీటి పథకం పనిచేయదు. ప్రజలను ఇబ్బంది పెట్టలేక బకాయిలు చెల్లిస్తున్నాం. ఇదే విధానం కొనసాగితే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసే అవకాశం లేదు. - పి.నాగమణి, సర్పంచ్, మేడికొండూరు, గుంటూరు జిల్లా మా పంచాయతీ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు. కేంద్రం ఇచ్చిన రూ.4 లక్షల ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ బకాయిలకు జమ చేసుకొన్నారు. ఊళ్లో ఏపని చేయాలన్నా డబ్బులేదు. వర్షాకాలంలో అంటువ్యాదులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నా నిధులు లేవు. - డి.సుజాత, సర్పంచ్, ఇరుకుపాలెం, పల్నాడు జిల్లా