Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్లియరెన్స్‌పై హైకోర్టు తీర్పునిచ్చింది: బొత్స
ABN , First Publish Date - 2022-11-05T17:01:19+05:30 IST
భోగాపురం ఎయిర్‌పోర్ట్ (Bhogapuram Airport) క్లియరెన్స్‌పై హైకోర్టు తీర్పునిచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తెలిపారు.
అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్ట్ (Bhogapuram Airport) క్లియరెన్స్‌పై హైకోర్టు తీర్పునిచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు (High Court) తీర్పుపై కలెక్టర్, అధికారులతో సమీక్ష నిర్వహించామని చెప్పారు. తీర్పులోని అంశాలు ఒకటో, రెండో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రైతులను ఒప్పించి భూములను సేకరిస్తామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. భూసేకరణ నోటిఫికేషన్ (Notification)ను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్ చట్టబద్ధమైనదేనని తేల్చిచెప్పింది. ‘ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం మొత్తం 2700 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో 2200 ఎకరాలను ఎయిర్‌పోర్టు అభివృద్ధికి వినియోగిస్తుండగా, మరో 500 ఎకరాలు అనుబంధ కార్యకలాపాలకోసం ఉపయోగిస్తున్నారు. భూమిని సేకరించినందుకు భూయజమానులకు ఇప్పటికే రూ.678 కోట్లు చెల్లించారు. ఎయిర్‌పోర్టు అభివృద్ధికి మొత్తం 2200 ఎకరాలు అవసరం కాగా, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో 2064 ఎకరాలు ఉంది. 1959 మంది భూయజమానుల్లో 1937మంది భూసేకరణ అవార్డు పాస్ చేసేందుకు ఆమోదం తెలిపారు. వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండగా భూమిని ఇచ్చేందుకు మరికొందరు అంగీకరించారు. కేవలం 37.15 ఎకరాలే ఇంకా సేకరించాల్సి ఉంది. వ్యాజ్యాల్లో జోక్యం చేసుకొనేందుకు న్యాయపరమైన అంశాలేమీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా వ్యాజ్యాలను కొట్టివేస్తున్నాం’ అని హైకోర్టు పేర్కొంది.