ఏపీజీబీ అప్రైజర్లకు కమిషన్లు పెంచాలి
ABN , First Publish Date - 2022-11-04T23:37:14+05:30 IST
జిల్లావ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్న అప్రైజర్లకు కమిషన్లు పెంచాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
కడప (ఎర్రముక్కపల్లె), నవంబరు 4:జిల్లావ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్న అప్రైజర్లకు కమిషన్లు పెంచాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కడప నగరం ఏపీజీబీ రీజనల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో పెరుగుతున్న ధరలకనుగుణంగా కమిషన్లు పెంచాల్సింది పోయి ఎప్పుడో 2007లో నిర్ణయించిన జువెల్ అప్రైజర్ కమిషన్లను తగ్గించడం ఏమిటని ప్రశ్నించారు. బంగారు రుణాలు మంజూరులో అటు ప్రజలకు, ఇటు బ్యాంకు పురోగతికి అప్రైజర్లు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. అప్రైజర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టడంతో బంగారు రుణాల చెల్లింపు నిలిచిపోయాయన్నారు. ఈ మేరకు బ్యాంకు యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించి విధులకు హాజరయ్యే విధంగా చూడాలని కోరారు. అనంతరం ఏపీజీబీ ఆర్‌ఎం శ్రీదేవికి వారు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీజీబీ అప్రైజర్లు జిల్లావ్యాప్తంగా ఉన్న అప్రైజర్లు పాల్గొన్నారు.