అంపశయ్యపై సహకార సొసైటీలు
ABN , First Publish Date - 2022-11-14T00:11:08+05:30 IST
అవి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు. మండల స్థాయిలో సింగిల్‌విండోలుగా పిలిచే ఈ సొసైటీలు రైతులకు ఆపద్భాంవుల్లాంటివి. వ్యవసాయంలో రైతులకు దీర్ఘ, స్వల్పకాలిక రుణాలిస్తూ నిత్యం ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండేవి. ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం రైతుల నుంచి వాటికే సహకారం లేకపోవడంతో అంపశయ్యపై ఉన్నాయి.
నష్టాల బాటలో సింగిల్‌విండోలు
జిల్లాలో ఒకటి మినహా అన్నీ అదే దారే
రికవరీ లేక..వసూళ్లు కాక.. వేతనాలకూ అప్పులే
మదనపల్లె, నవంబరు 13: అవి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు. మండల స్థాయిలో సింగిల్‌విండోలుగా పిలిచే ఈ సొసైటీలు రైతులకు ఆపద్భాంవుల్లాంటివి. వ్యవసాయంలో రైతులకు దీర్ఘ, స్వల్పకాలిక రుణాలిస్తూ నిత్యం ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండేవి. ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం రైతుల నుంచి వాటికే సహకారం లేకపోవడంతో అంపశయ్యపై ఉన్నాయి. నష్టాల బాటలో పయనిస్తూ, అదృశ్యానికి అడుగు దూరంలో ఉంటున్నాయి. సొసైటీల నుంచి రైతులు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడం, అసలు పక్కన పెడితే కనీసం వడ్డీ కూడా చెల్లించకపోవడంతో బకాయిలు తడిసి మోపెడయ్యాయి. రైతుల నుంచి వసూలయ్యే అరకొర రుణ వసూళ్లను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)కు చెల్లిస్తే, ఆ మొత్తాన్ని అసలుకు కాకుండా వడ్డీకి జమ చేయడం, వడ్డీ కూడా రెట్టింపుగా నమోదు చేస్తుండటంతో సింగిల్‌విండోలో తీసుకున్న రుణం అలాగే ఉండిపోగా, వడ్డీ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ క్రమంలో సొసైటీలలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి నెలవారీ చెల్లించే వేతనాలు కూడా చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వాటికి కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, విండోల మనుగడే ప్రశ్నార్థంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
జిల్లాలోని ఉమ్మడి మదనపల్లె డివిజన్‌లో 15 సింగిల్‌విండోలు, రాయచోటి 10, రాజంపేటలో 16 సింగిల్‌విండోలు కలిపి మొత్తం 41 ఉన్నాయి. వీటిలో రాయచోటి, రాజంపేటలోని 25 సింగిల్‌విండోలు పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోగా, రాజంపేట పరిధిలోని ఒక సింగిల్‌విండో మాత్రం లాభాల బాటలో పయనిస్తోంది. అలాగే మదనపల్లె డివిజన్‌లోని 15 విండోలలో బి.కొత్తకోట, పీటీఎం, కురబలకోట, వాల్మీకిపురం, గుర్రంకొండ, పీలేరు, కలకడ, కలికిరి నష్టాలు అనే మాట లేకుండా కొంత లాభాల బాటలోనే ఉన్నాయి. ఉద్యోగులకు జీతాలకు ఇబ్బంది లేకుండా పయనం సాగిస్తున్నాయి. ఇక మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, ములకలచెరువు మండలం సోంపల్లె, తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు, కె.వి.పల్లె సింగిల్‌విండోలు నష్టాల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో నిమ్మనపల్లె, కె.వి.పల్లె విండోలు సుమారు రూ.4 కోట్ల మేర అప్పుల్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
కొండెక్కిన రికవరీలు
సింగిల్‌విండోలు రైతులకు రుణాలు ఇవ్వడమే కానీ ఏళ్ల తరబడి రికవరీలు లేవు. అసలు పక్కన పెడితే కనీసం సకాలంలో సక్రమంగా వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. రుణాలు ఇచ్చిన జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ), సహకార కేంద్ర బ్యాంకుబ్రాంచీలు కూడా రికవరీపై శ్రద్ధ చూపడం లేదని చెబుతున్నారు. దీంతో లాభాలు లేకపోగా, ఏడాదికేడాది నష్టాలు కూడా అదే స్థాయులో పెరుగుతున్నాయి. చివరకు విండోలోని కార్యదర్శి, అసిస్టెంట్ కూడా రికవరీ ఛాయలకు వెళ్లడం లేదు. ఫలితంగా సొసైటీ నష్టాలబాట పట్టించడానికి కారణమని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. జిల్లా స్థాయిలో డీసీసీబీ పరిధిలో రికవరీకి ప్రత్యేక విభాగమే ఉంది. అక్కడ కూడా తగినంత మంది ఉద్యోగులు, సిబ్బంది లేకపోవడం, ఉన్న కొందరు కూడా కార్యాలయానికే పరిమితం కావడంతో రికవరీలు కొండెక్కాయని సహకార ఉద్యోగులు వాపోతున్నారు. ఇక డీసీసీబీ బ్రాంచీల్లో కూడా ఇందుకు సరిపడా సిబ్బంది లేరు. ఉన్న కొంతమంది కూడా తమ పరిధిలో ఇచ్చిన లావాదేవీలను పర్యవేక్షించడానికి పరిమితం కావడంతో రుణ వసూళ్ల ఊసే ఎత్తడం లేదు. తమ పరిధిలోని రుణాల రికవరీకే సమయం లేదని, ఇక సింగిల్‌విండోల ద్వారా ఇచ్చిన రుణాల వసూళ్లు తామెక్కడ చేసేదని వారు నిట్టూరుస్తున్నారు. నష్టాల్లో లేని, జీతభత్యాలు సంపాదించుకుంటున్న విండోలలో సీఈవోలు అడపాదడపా గ్రామాలకు వెళ్లి రైతుల నుంచి కనీసం వడ్డీ అయినా వసూలు చేస్తున్నారు. ఫలితంగానే వారి జీతభత్యాలకు భయం లేకుండా కాలం గడుపుతున్నారు. ఆ చాయలకే వెళ్లని విండోలే కొన్ని పూర్తిగా నష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. రుణాలు సక్రమంగా చెల్లించని, మొండి బకాయిదారులపై ఆర్బిట్రేషన్ పిటీషన్, ఎగ్జిక్యూటీవ్ పిటీషన్ (ఈపీ) నమోదు చేయకపోవడం కూడా రుణ వసూళ్లలో వెనుకబడినట్లు సహకార శాఖ అధికారులు చెబుతున్నారు.
విండోలను కుదించినా ప్రయోజనమేదీ?
గతంలో మండలానికి నాలుగైదు ఉన్న సింగిల్‌విండోలను కుదిస్తూ 2005లో వైద్యనాఽధన్ కమిటీ సిఫార్సుల మేరకు మండలానికే ఒకటికే పరిమితం చేశారు. మిగిలిన వాటిని అందులో విలీనం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నష్టాల్లో ఉన్నవి ఇప్పటికీ అదే బాటలో పయనిస్తుండగా, 30 శాతం రికవరీ ఉన్న విండోలు పూర్తి స్థాయిలో లాభాలు లేకపోయినా ఉద్యోగుల జీతభత్యాలకు ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయి. ఆప్కాబ్ ఇచ్చే రుణాన్ని డీసీసీబీ, అక్కడి నుంచి డీసీసీబీ బ్రాంచీలు, వాటి నుంచి సింగిల్‌విండోల ద్వారా చివరకు రైతుకు చేరుతోంది. ప్రతి స్థాయిలో మూడు శాతం కమీషన్‌తో రైతుకు అందుతోంది. తిరిగి అరకొర చెల్లింపుల్లో భాగంగా అది వడ్డీకే సరిపోతోంది. కొన్ని విండోల నుంచి అసలు కింద డీసీసీబీకి జమ చేసినా, అక్కడ ఎక్కువ మొత్తంలో వడ్డీ నమోదు చేస్తూ, రైతులు చెల్లించిన అసలును వడ్డీ కిందనే జమ కడుతున్నారు. దీంతో అసలును పక్కన పెడితే వడ్డీ కూడా పూర్తి స్థాయిలో తీరకపోవడంతో మళ్లీ మొదటికొస్తోంది. ఇక పూర్తిగా చెల్లించని రైతుల అప్పులు ఏటికేడు పేరుకుపోతూ, విండోలు నష్టాలు మోస్తూ, అంపశయ్యపై ఉంటున్నాయి.
వేతనాల రికవరీ బాధ్యత కమిటీదే
రైతుల నుంచి అసలు వసూళ్లను పక్కన పెడితే, నెలనెలా తమ జీతభత్యాలకు సరిపడా వడ్డీలు కూడా వసూలు చేయడం లేదు. కనీసం 30 శాతం రుణాలు వసూలు చేస్తే, లాభాలు లేకపోయినా కనీసం నష్టాలను అధిగమించి కనీసం నెలనెలా జీతాలకు ఇబ్బంది లేకుండా చూడవచ్చని ఆ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. లాభాలు లేనప్పుడు, విండోలు నష్టాల్లో నడుస్తున్నప్పుడు ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాలు తీసుకునే అవకాశం లేదు. కానీ ప్రతిచోటా సింగిల్‌విండో సీఈవో నుంచి సిబ్బంది వరకూ లాభ, నష్టాలతో పనిలేకుండా నెలనెలా వేతనాలు తీసుకుంటున్నారు. రుణ వసూళ్లకు వీరు రైతులకు వద్దకు వెళ్లకపోయినా, అన్నదమ్ముళ్లు భూముల భాగ పరిష్కారంలోను, భూముల క్రయ, విక్రయాల్లో భాగంగా తాకట్టును విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా వచ్చిన సొమ్ములను విండోలు తమ సాధారణ పరిపాలన వ్యవహారాలకు వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సహకార శాఖ ఉన్నతాధికారులు, ఆడిట్ అధికారులు ఉద్యోగులు తీసుకుంటున్న వేతనాలను రికవరీ బాధ్యతను అఫిషియల్ కమిటీపై అడ్డంగా రాస్తున్నారు. సొసైటీ నష్టాల్లో ఉన్నా..ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు ఎలా చెల్లిస్తారని, వారి నుంచి రికవరీ బాధ్యత మీదేనన్నది అందులోని సారాంశం. ఇదిలా ఉండగా, పూర్తి స్థాయిలో వసూళ్లు లేకపోయినా.. సీజన్ వారీగా రైతుల నుంచి వడ్డీ చెల్లించి పంట రుణాలు రెన్యువల్ చేయిస్తే, ఆ మొత్తాన్ని కేంద్రం నాలుగు శాతం, ప్రభుత్వం మూడు శాతం తిరిగి చెల్లిస్తుంది. ఈ విషయంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సి వుంది.
రికవరీ లేకనే నష్టాలు
-పి.చంద్రశేఖర్‌రెడ్డి, సహకార శాఖ, జిల్లా ఆడిట్ అధికారి
సింగిల్‌విండోలలో రైతులు తీసుకున్న స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు రికవరీ లేకపోవడంతో అప్పులు పెరుగుతున్నాయి. సకాలంలో రుణాలను రెన్యువల్ చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఏడు శాతం వడ్డీ వెనక్కి వస్తుంది. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి. ప్రతి సంవత్సరం విండోలలో ఆడిట్ చేస్తున్నాం. కొన్ని లాభాల్లో ఉండగా మరికొన్ని నష్టాల బాటలో నడుస్తున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు అఫిషియల్ కమిటీ పర్యవేక్షిస్తూ ఉంటుంది.