సాగు 30 శాతమే...!

ABN , First Publish Date - 2022-11-22T23:42:36+05:30 IST

జిల్లాలో రబీ సాగు మందకొడిగా సాగుతోంది. సీజన్‌ ప్రారంభమై నెల దాటినా సాధారణ విస్తీర్ణంలో 30 శాతమే పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1,50,812 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు కేవలం 63,449 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి.

సాగు 30 శాతమే...!
అరకొరగా సాగు చేసిన వరి పైరు

మందకొడిగా రబీ

సాగు లక్ష్యం 1,50,812 హెక్టార్లు

ఇప్పటి వరకు సాగైంది 63,449 హెక్టార్లే

కడప(రూరల్‌), నవంబరు 22: జిల్లాలో రబీ సాగు మందకొడిగా సాగుతోంది. సీజన్‌ ప్రారంభమై నెల దాటినా సాధారణ విస్తీర్ణంలో 30 శాతమే పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1,50,812 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు కేవలం 63,449 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. సాధారణంగా అక్టోబర్‌ 15 నుంచి రబీ పనులు జిల్లాలో ప్రారంభం కావడం పరిపాటి. అయితే డిసెంబర్‌ 15 వరకు రబీ పంటలు విత్తుకునే గడువున్నా నవంబర్‌ 15వ తేదీ లోపు సాగైన పంటలే ఆశించిన దిగుబడులు వస్తాయి. దీన్ని బట్టి చూస్తే పంట దిగుబడులకు అక్టోబర్‌, నవంబర్‌ నెలలే కీలకంగా రైతులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా సాగుకు సానుకూలమైన వర్షాలు కూడా పడుతున్నాయి. అయినప్పటికీ ఎందుకో ఏమోగానీ రబీ సీజన్‌ పారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు లక్ష్యానికి దరిదాపుల్లో పంటలు సాగుకు నోచుకోకపోవడం గమనార్హం.

రబీలో ఇప్పటి వరకు సాగైన పంటల వివరాలు

జిల్లాలో 2022 రబీ సాధారణ సాగు 1,50,812 హెక్టార్లకు గాను నవంబరు 22 నాటికి కేవలం 63,449 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. అంటే ప్రస్తుతానికి 30 శాతమే సాగుకు నోచుకుంది. మిగిలిన 70 శాతం పంటల సాగు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ సమయానికి ఇంత తక్కువ స్థాయిలో గత నాలుగేళ్ల కాలంలో ఇదే ప్రథ మంగా అధికారులు భావిస్తున్నారు. ఆయా పంటల సాగు వివరాలను పరిశీలిస్తే... రబీలో ప్రధానంగా వరి పంట 11,118 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 1271 హెక్టార్లలో మాత్రమే సాగుకు నోచుకుంది. వేరుశనగ 8254 హెక్టార్లకు 878 హెక్టార్లలో, జొన్న 9844 హెక్టార్లకు 1100 హెక్టార్లలో, సజ్జ 2534 హెక్టార్లకు 518 హెక్టార్లలో, మొక్కజొన్న 2037 హెక్టార ్లకు 103 హెక్టార్లు, రాగి 85 హెక్టార్లకు 2 హెక్టార్లలో, కొర్ర 348 హెక్టార్లకు 8 హెక్టార్లలో, వరిగ 25 హెక్టార్లకు 0 హెక్టార్లలో, చిరుధాన్యాలు 467 హెక్టార్లకు 0 హెక్టార్లలో సాగయ్యాయి. అలాగే శనగ 96,814 హెక్టార్లకు 51,513 హెక్టార్లలో, కంది 113 హెక్టార్లకు 13 హెక్టార్లలో, పెసర 2931 హెక్టార్లకు 436 హెక్టార్లలో, మినుము 6370 హెక్టార్లకు 7009 హెక్టార్లలో, ఉలవ 283 హెక్టార్లకు 1 హెక్టారులోను, అలసంద 32 హెక్టార్లకు గాను 0 హెక్టార్లలోను సాగయ్యాయి. నువ్వులు 3714 హెక్టార్లకు 245 హెక్టార్లలో, పొద్దుతిరుగుడు 3908 హెక్టార్లకు 69 హెక్టార్లలో, ఆముదం 37 హెక్టార్లకు 140 హెక్టార్లలో, కుసుమ 277 హెక్టార్లకు 115 హెక్టార్లలో, పత్తి 2026 హెక్టార్లకు 19 హెక్టార్లలో, పొగాకు 40 హెక్టార్లకు గాను 12 హెక్టార్లలో మాత్రమే సాగుకు నోచుకున్నాయి.

సాగు లక్ష్యాన్ని సాధిస్తాం

- జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు

రబీ సాగు లక్ష్యాన్ని సాధించే దిశగా చర్యలు చేపడుతున్నాం. రబీలోని ఆయా పంటలను డిసెంబర్‌ 15 వరకు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ దిశగా రైతుల్లో అవగాహన కల్పించి పంటలు సాగు చేయడానికి చర్యలు చేపడుతున్నాం. ఈ రబీలో 150812 హెక్టార్లలో పంట సాగు లక్ష్యం కాగా ఇప్పటివరకు 63449 హెక్టార్లలో పలు రకాల పంటలు సాగయ్యాయి. మిగిలిన లక్ష్యాన్ని కూడా సాధిస్తాం.

Updated Date - 2022-11-22T23:42:37+05:30 IST