గుట్టలు గుల్ల...
ABN , First Publish Date - 2022-08-30T04:59:44+05:30 IST
అధికార, ఆర్థిక బలం ఉంటే సహజ వనరుల దోపిడీ ఎంత సులువో పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ రెడ్డివారిపల్లె వద్ద ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణే సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
పాఠశాల పేరుతో మట్టి దోపిడీ
ఆట మైదానం పేరుతో భూమి చదును
పీలేరులో యథేచ్ఛగా గుట్టల తవ్వకాలు
పీలేరు, ఆగస్టు 29: అధికార, ఆర్థిక బలం ఉంటే సహజ వనరుల దోపిడీ ఎంత సులువో పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ రెడ్డివారిపల్లె వద్ద ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణే సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. పాఠశాలకు ఆట మైదానం ఏర్పరుస్తామని పాఠశాల ఉపాధ్యాయులు, పంచాయతీ అధికారులు, రెవెన్యూ సిబ్బందికి తెలిపి పంచాయతీలో తీర్మానం తీసుకుని తమ సొంత భూమి అభివృద్ధి కోసం పాఠశాల ఆవరణలోని గుట్టను చదును చేసి ఆ మట్టితో సొంత భూమిని అభివృద్ధి చేసుకున్నారు. ఆ భూమిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అమ్మకానికి పెట్టారు. పాఠశాలకు మైదానం ఏర్పడిందా అంటే అదీ లేదు. పైపెచ్చు పాఠశాల ప్రహరీకే ప్రమాదం తెచ్చి పెట్టారు. అంతటితో ఆగకుండా తమ భూమి పక్కన ఉన్న ప్రభుత్వ భూమితో పాటు వాగు, వంకను సైతం ఆక్రమించుకుని చదును చేసేశారని గ్రామస్థులు ఇటీవల జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఇదంతా ఎక్కడో మూరుమూల ప్రాంతంలో జరిగిందని అనుకుంటే పొరపాటు. నిత్యం రద్దీగా ఉండే పీలేరు-రాయచోటి రోడ్డుపైనే గత మూడు నెలలుగా ఈ తంతు నడిచింది. ఇప్పటికీ ఆ భూమిలో దాదాపు 500 లోడ్ల మట్టి సిద్ధంగా ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
క్రీడా మైదానం పేరుతో అనుమతులు
పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ రెడ్డివారిపల్లె వద్ద అధికారులు చాలా కాలం క్రితం జడ్పీ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేశారు. పాఠశాలను రెడ్డివారిపల్లె సమీపంలోని దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణం గల గుట్టలో ఏర్పాటు చేసి గుట్ట చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఆ గుట్టకు ఆనుకుని అదే గ్రామానికి చెందిన ఓ విశ్రాంత ఆర్మీ ఉద్యోగికి దాదాపు ఐదు ఎకరాల భూమి ఉంది. గతంలో ఆ భూమిలో జామ, మామిడి తోట పెంపకం చేపట్టారు. ఇటీవల దానిని విక్రయించాలని నిర్ణయించుకోగా రోడ్డు కంటే బాగా లోతులో ఉండటంతో అమ్మకాలు జరగలేదు. దీంతో ఎలాగైనా భూమి ఎత్తు చేయాలని నిర్ణయించుకుని పక్కనే ఉన్న గుట్టపై కన్నేశారు. సాధారణంగా భూఅభివృద్ధి కోసం మట్టిని సేకరించాలంటే రెవెన్యూ, పంచాయతీ, భూగర్భ, గనుల శాఖల అనుమతులు, సెస్ చెల్లింపు తప్పనిసరి. అవి లభించినా పరిమిత స్థాయిలోనే మట్టిని సేకరించాలి. వీటన్నింటి కంటే పాఠశాల ఆవరణలో ఉన్న గుట్టను చదును చేసి క్రీడా మైదానంగా తయారు చేసిస్తామని అటు ఉపాధ్యాయులు, పంచాయతీ పాలకవర్గాన్ని సంప్రదించారు. అధికార పార్టీ నేతలతో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పించారు. పైసా ఖర్చు లేకుండా క్రీడా మైదానం ఏర్పడుతుందన్న ఆశతో ఉపాధ్యాయులు, పంచాయతీ పాలకవర్గం అందుకు అనుకూలంగా తీర్మానం చేసేసింది. దీంతో గత మూడు నెలలుగా ఆ గుట్ట చదును పనులు చేపట్టారు. పాఠశాల ఆవరణతో పాటు పాఠశాల ప్రహరీగోడ ఆనుకుని ఉన్న మట్టిని కూడా లోడేయడంతో కొన్నిచోట్ల ఆ గోడ కూలేందుకు సిద్ధంగా ఉంది. అక్కడి మట్టిలో ఎక్కువగా రాళ్లు వస్తుండడంతో దానిని వదిలివేసి మరో గుట్టను సైతం పాక్షికంగా చదును చేశారు. గుట్టను చదును చేసుకుని స్వంత భూమి అభివృద్ధి చేసుకోవడం తప్ప పాఠశాల గురించి పట్టించుకోకపోవడంతో ఉపాధ్యాయులు, పంచాయతీ పాలకవర్గం వారిని ప్రశ్నించగా సరైన సమాధానం లభించలేదు. అధికార, ఆర్థిక అండదండల కారణంగా చేసేది లేక మిన్నకుండిపోయారు. ఈ విషయమై గతంలో ఓమారు తహసీల్దారు రవిని సంప్రదిస్తే పంచాయతీ ఆమోదం ఉండడంతో తాము గుట్ట చదును పనులను అడ్డుకోలేమని నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఉన్నతాధికారులకు గ్రామస్థుల ఫిర్యాదు
గుట్టను చదును చేసుకోవడమే కాకుండా ఆ భూమి పక్కన ఉన్న ప్రభుత్వ, డీకేటీ భూముల్ని సైతం ఆ వ్యక్తులు ఆక్రమించుకుని అందులోని వాగు, వంకను సైతం చదును చేసేశారని ఇటీవల రెడ్డివారిపల్లెకు చెందిన కొందరు రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ, డీకేటీ భూమల ఆక్రమణను ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, తమ గ్రామాన్ని సందర్శించి తమకు న్యాయం చేయాలని వారు జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియాకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. గ్రామస్థుల ఫిర్యాదు స్వీకరించి తాను గానీ, కలెక్టర్‌గానీ త్వరలో స్వయంగా ఆ భూమిని పరిశీలిస్తామని జేసీ హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. ఉన్నతాధికారులైనా తమ పాఠశాలకు, గ్రామానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
