జామీయ మసీదు కమిటీ అక్రమాలపై విచారణ
ABN , First Publish Date - 2022-11-08T23:33:21+05:30 IST
ప్రొద్దుటూరు గవిని సర్కిల్‌లోని జామీయ మసీదు (పెద్ద మసీదు) కమిటీ అక్రమాలపై మంగళవారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు విచారణ చేపట్టారు.
రికార్డులు, ఆస్తులు తనిఖీ చేసిన వక్ఫ్‌బోర్డు రాష్ట్ర అధికారులు
ప్రొద్దుటూరు అర్బన్, నవంబరు 8 : ప్రొద్దుటూరు గవిని సర్కిల్‌లోని జామీయ మసీదు (పెద్ద మసీదు) కమిటీ అక్రమాలపై మంగళవారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు విచారణ చేపట్టారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డుకు చెందిన జామీయ మసీదు కమిటీ అధ్యక్షుడిగా ముప్పై ఏళ్లుగా బేపారి బషీర్ ఉంటున్నాడు. ఈయన అక్రమాలకు పాల్పడ్డారనే ముస్లిం మత పెద్దల ఫిర్యాదుపై వక్ఫ్ బోర్డు అధికారులు విజయవాడ నుంచి ప్రొద్దుటూరుకు వచ్చారు. వక్ఫ్‌బోర్డు స్టేట్ సెక్రటరీఆదం షఫీ, కడప, అన్నమయ్య జిల్లాల ఇన్‌స్పెక్టర్లు గౌస్, అన్వర్ హుస్సేన్‌లు జామీయ మసీదు ఆస్తులను, రికార్డులను పరిశీలించారు. ముస్లిం సంక్షేమ సం ఘం మసీదు పరిరక్షణ కమిటీ పెద్దలు ఖాజామోద్దీన్ జాకీర్, ఫిరోజ్, మున్వర్ హుస్సేన్, ఇక్బాల్ హుస్సేన్, గౌస్‌బాషలు ఇచ్చిన ఫిర్యాదులను వక్ఫ్ అధికారులు రికార్డు చేశారు. గత కొన్ని నెలలుగా మసీదు కమిటీ అక్రమాలపై వక్ఫ్‌బోర్డు అధికారులకు వీరు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 30న విజయవాడలో మొదటిసారి కలిశారు. రెండవసారి జులై 8న వెళితే బోర్డు అధికారి రాకపోవడంతో వెనుదిరిగి వచ్చారు. సెప్టంబరు 12 ప్రొద్దుటూరు తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ ఆందోళన నేపధ్యంలో వక్ఫ్‌బోర్డు స్టేట్ సెక్రటరీ నేరుగా ప్రొద్దుటూరుకు వచ్చి విచారణ చేపట్టారు. ఈ విచారణ సందర్భంగా మసీదు పరిరక్షణ కమిటీ నేతలు ఖాజామోద్దీన్, జాకీర్, ఫిరోజ్‌లు మాట్లాడుతూ జామీయ మసీదుకు వందకోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయన్నారు. దాదాపు 6.02 ఎకరాల విస్తీర్ణంలో మసీదు ఖబరస్తాన్‌లతో పాటు ఎర్రగుంట్ల రోడ్డుకు 60 షాపు రూములు, రెండు ప్రైవేటు హైస్కూళ్లు, హోల్‌సేల్ పండ్లమండీ మార్కెట్ రూములు, ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాలు వున్నాయన్నారు. వీటన్నింటి నుంచి నెలకు రూ.6 లక్షల నుంచి 7లక్షలు ఆదాయం వుందన్నారు. కేవలం ఫంక్షన్ హాలు నుండే సంవత్సరానికి రూ.60 నుంచి 80 లక్షలు ఆదాయం వస్తుందన్నారు. ఈ ఆస్తులలో కొన్నింటిని అక్రమంగా విక్రయాలు జరిపి సొ మ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ఫంక్షన్ హాలు స్థలాన్ని 2009-2019 వరకు పది సంవత్సరాలకు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అఽధ్యక్షుడు బషీర్ తన కోడలు షరిన్ పేరిట రూ.2.97 లక్షలకు లీజుకు తీసుకున్నాడన్నా రు. పదేళ్ల తరువాత లీజు రద్దయితే కట్టడాలను వదిలేసి వెళ్లాలనే నిబంధనను తుంగలో తొక్కారన్నారు. తిరిగి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కుటుంబసభ్యుల పేర తీసుకోకూడదనే నిబంధనలకు విరుద్ధంగా పేపరు ప్రకటన ఇవ్వకుండా, పబ్లిక్ వేలం నిర్వహించకుండా మళ్లీ తన కోడలు షరిన్ పేరుతో 2019 నుంచి 2022 వరకు లీజుకు తీసుకొని కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఫంక్షన్ హోలులో డెకరేషన్ కాంట్రాక్ట్ నుంచి సంవత్సరానికి రూ.10 లక్షలు అదనంగా దోస్తున్నాడన్నారు. దీనికితోడు 2018లో మున్సిపల్ కమిషనర్ ద్వారా ప్రభుత్వం నుంచి జచ్చఖాన (ప్రసూతి కేంద్రం) కోసం వచ్చిన రూ.15లక్షల నిధులను జచ్చఖానాకు కట్టకుండా మాయం చేసినట్లు ఆరోపించారు. మసీదు ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయంతో వక్ఫ్‌బోర్డు అనుమతి లేకుండా తన కుటుంబ సభ్యులకు చెందిన సెంటు విస్తీరణం వున్న రెండు పాత ఇళ్లను కొనుగోలు చేసి.. అందులో ఒక ఇంటికి రూ.38 లక్ష లు, మరో ఇంటికి రూ.27 లక్షలు నిధులను అక్రమంగా వినియోగించాడన్నారు. మార్కెట్ రేటు ప్రకారం ఆ రెండు ఇల్లులు కొనుగోలు చేసినా దాంట్లో సగం విలువ కూడా చేయవన్నారు. ఈ అక్రమాలన్నింటిపై వక్ఫ్ అధికారులకు స్టేట్‌మెంటు ఇచ్చామన్నారు. ఈ విచారణపై వక్ఫ్ బోర్డు స్టేట్ సెక్రటరీ ఆదం షఫీని వివరణ కోరగా... ఫిర్యాదుదారుల స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేశామన్నారు. మసీదు ఆస్తులన్నింటిని పరిశీలించామని.. ఆదాయ వివరాల కోసం రికార్డులను కమిటీ నుంచి తీసుకొని పరిశీలించాల్సి వుందన్నారు. మొత్తం ఆస్తులను సర్వే చేసి అక్రమాలను వెలికి తీస్తామని తెలిపారు.