భక్తిశ్రద్ధలతో సంపూర్ణ భగవద్గీత పారాయణ
ABN , First Publish Date - 2022-11-14T00:33:16+05:30 IST
మైసూరు అవధూత దత్త పీఠాధిపతి గణపతిసచ్ఛిదానందస్వామి సమక్షంలో ఏకకాలంలో సుమారు 1500మంది భక్తులు నిర్వహించిన భగవద్గీత పారాయణ ఆధ్యాత్మిక భావనతో వెల్లివిరిసింది.
మచిలీపట్నం టౌన్, నవంబరు 13 : మైసూరు అవధూత దత్త పీఠాధిపతి గణపతిసచ్ఛిదానందస్వామి సమక్షంలో ఏకకాలంలో సుమారు 1500మంది భక్తులు నిర్వహించిన భగవద్గీత పారాయణ ఆధ్యాత్మిక భావనతో వెల్లివిరిసింది. హిందూ కళాశాల ప్రాంగణం భగవద్గీత పారాయణతో పులకరించింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పారాయణలో పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న భక్తులు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నుంచి పారాయణలో పాల్గొన్నారు. భగవద్గీత 18 అధ్యాయాల్లోని 701 శ్లోకాలను భక్తులు పారాయణ చేశారు. పారాయణను తిలకించేందుకు వేలాది భక్తులు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చారు.
సామూహిక పారాయణతో కృష్ణ భగవానుని అనుగ్రహం
- గణపతి సచ్చిదానంద స్వామి
సామూహిక భగవద్గీతపారాయణ వల్ల శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ధైర్యాన్ని ప్రసాదించి విజయాన్ని చేకూర్చారు. భగవద్గీత పారాయణ చేసిన వారికి విజయాలు చేకూరి ఆముష్మిక ఫలితాలు లభిస్తాయి. కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ధన్వంతరీ ఆచార్య, కేతవరపు శివకుమార్, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిథులు పాల్గొన్నారు.