బీసీలకు జగన్ ద్రోహం
ABN , First Publish Date - 2022-12-08T01:35:26+05:30 IST
బలహీనవర్గాలకు జగన్ చేసిన ద్రోహ మేమిటో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు బుధవారం మంగళ గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిరూపించేందుకు సిద్ధం
మంత్రులకు బుద్దా వెంకన్న సవాల్
వన్‌టౌన్, డిసెంబరు 7: బలహీనవర్గాలకు జగన్ చేసిన ద్రోహ మేమిటో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు బుధవారం మంగళ గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభాలో 50 శాతం బీసీలు ఉంటే జగన్ సభలో 50 శాతం పోలీసులు, వలంటీర్లు ఉన్నారన్నారు. జగన్‌పాలనలో బీసీలకు జరిగిన ద్రోహంపై చర్చించేందుకు మంత్రులు సీదిరి అప్పలరాజు, జోగి రమేష్ ఎక్కడికి రమ్మన్నా వస్తానన్నారు. బీసీల హత్యలు, వారి భూముల కబ్జాలు, ఆస్తుల లూఠీలతోనే మూడున్నరేళ్ల పాలన సాగిందని, హఠాత్తుగా బీసీలపై ప్రేమ పుట్టడం ఎన్నికల స్టంట్ అని ఆయన విమర్శించారు.
బీసీల సమాధులపై వైఎస్ కుటుంబం ఎదుగుదల
వైఎస్ కుటుంబం ఎదిగింది బీసీల సమాధులపైనేనని అందరికీ తెలుసని బుద్దా వెంకన్న అన్నారు. వైసీపీ నిర్వహించిన బీసీల సభలో పోలీసులు, వలంటీర్లు, బారికేడ్లు తప్ప బీసీలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. జగన్ ప్రభు త్వాన్ని బీసీలు నిలదీయాల్సిన సమయం వచ్చిందన్నారు. బీసీలు తనకు వెన్నెముక, జున్నుముక్క అంటూ జగన్ కహానీలు చెబుతున్నారన్నారు. మత్స్యకారుల నోట్లో మట్టికొట్టి అప్పలరాజుకు మంత్రి పదవి ఇస్తే సరి పోతుందా? నకిలీ మద్యానికి ప్రజల్ని బలిచేసి జోగి రమేష్‌కు మంత్రి పదవి ఇస్తే గీత కార్మికులకు న్యాయం జరుగుతుందా? అని ఆయన ప్రశ్నించారు. బీసీ మంత్రులపై పెత్తందారులుగా రెడ్లను నియమించినపుడు బీసీ సాధి కారత గుర్తు రాలేదా అన్నారు. యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్లు, టీటీడీ బోర్డు పదవుల్లో బీసీలకు మొండి చేయి చూపించడమేనా చేసిన మేలు అని ప్రశ్నించారు. మత్ప్యకారులకు 90 శాతం సబ్సిడీపై పనిముట్లు, పడవలు ఇస్తే జగన్ డీజిల్ రాయితీ కూడా తీసేశారన్నారు. బీసీ నేతలను జగన్ హత్య చేయిస్తుంటే, విజయసాయిరెడ్డి భూములు లాక్కుంటున్నారన్నారు.
బీసీలంతా జయహో చంద్రబాబు అంటున్నారు
నిధులు లేని కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా, చైర్మన్లుగా ఉన్నవారు తోటి బీసీలకు న్యాయం చేశారని జగన్ చెబితే నమ్మేవారు ఇక్కడ ఎవరూ లేరని బుద్దా వెంకన్న అన్నారు. ‘జగన్ పోవాలి..చంద్రబాబు రావాలి’ అన్న నినాదం బీసీల గొంతులో ప్రతిధ్వనిస్తోందన్నారు. జగన్‌ను నమ్మడం లేదు గనుకే చంద్రబాబునాయుడు సభలకు భారీగా తరలి వస్తున్నారని, జయహో చంద్రబాబు అంటున్నారని వెంకన్న అన్నారు.