Jalil Khan: సొంత బాబాయ్‌ని చంపినవారిని కనిపెట్టలేని వ్యక్తి...

ABN , First Publish Date - 2022-10-03T20:00:46+05:30 IST

పచ్చి అబద్దాలాడి, ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని జీరో చేశారని...

Jalil Khan: సొంత బాబాయ్‌ని చంపినవారిని కనిపెట్టలేని వ్యక్తి...

విజయవాడ (Vijayawada): పచ్చి అబద్దాలాడి, ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి (CM Jagan) రాష్ట్రాన్ని జీరో (Zero) చేశారని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ (Jalil Khan) విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మేనిఫెస్టో (YCP Manifesto)లో 95 శాతం హామీలు నెరవేర్చానంటున్న సీఎం జగన్, దానిపై  శ్వేతపత్రం విడుదలచేయగలరా? అని ప్రశ్నించారు. సొంత బాబాయ్ వివేకను హత్య చేసిన వారిని కనిపెట్టలేని వ్యక్తి, ప్రజల్ని ఉద్ధరిస్తారా? అని నిలదీశారు. పథకాలు, అభివృద్ధికి నిధుల సమస్య లేదంటున్న ముఖ్యమంత్రి, ఎవరికీ చెప్పకుండా డబ్బులు ఇడుపులపాయలో దాస్తున్నారా?.. అబద్ధాలతో నెగ్గినవారు 175 స్థానాలు గెలుస్తారా? అన్నారు. గడపగడపకు వెళ్తున్నవారిపై ప్రజలు ఉమ్మేస్తున్నారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, ఆయన కుటుంబానికి రాజకీయ ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పార్టీకే  జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు.


రేషన్ పంపిణీ పేరుతో ఉత్త బియ్యం ఇస్తే ప్రజలు సంతోషంగా పండుగ చేసుకోగలరా? అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు. మూడున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం రూ.7 వేల కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించిందని ఆరోపించారు. టీడీపీ హాయాంలో రూ. 47 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తే, జగన్  వాటిని 40 లక్షలకు తగ్గించారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు బాగోలేదంటున్న ముఖ్యమంత్రి తీరుచూస్తే చెప్పేవాడికి, వినేవాడికి బుద్ధిలేదన్నట్లుందని ఎద్దేవా చేశారు. కోర్టుల ద్వారా జగన్మోహన్ రెడ్డికి పడినన్ని చీవాట్లు దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా పడ్డాయా?.. మంత్రి బొత్స, స్పీకర్ తమ్మినేని ఇన్నేళ్లలో ఉత్తరాంధ్రకు ఏంచేశారు?.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేని వారు, మూడు రాజధానులు నిర్మిస్తారా? అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు.

Updated Date - 2022-10-03T20:00:46+05:30 IST