బందరు పోర్టుకు పనులు జరిగేనా?
ABN , First Publish Date - 2022-12-22T00:07:23+05:30 IST
బందరు పోర్టు పనుల ప్రారంభంపై ఇంకా అడుగులు తడబడుతూనే ఉన్నాయి. బందరు పోర్టుకు రోడ్డుకం రైలు మార్గాల కనెక్టివిటీకోసం సుమారుగా 286 ఎకరాల భూసేకరణ ముందుకు కదలడం లేదు. భూసేకరణకు రూ.100 కోట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి వస్తుండటంతో దీనిపై ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. మరోపక్క పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని కేంద్ర పర్యావరణ కమిటీ బృందం బుధవారం పరిశీలించడంతో మళ్లీ ఈ అంశం చర్చల్లోకొచ్చింది.
పోర్టు నిర్మాణం చేసే ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర పర్యావరణ కమిటీ
రోడ్‌కం రైలు నిర్మాణానికి భూసేకరణ నోటిఫికేషన్ పెండింగ్
భూసేకరణకు నిధులే అసలు సమస్య
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : బందరు పోర్టు పనుల ప్రారంభంపై ఇంకా అడుగులు తడబడుతూనే ఉన్నాయి. బందరు పోర్టుకు రోడ్డుకం రైలు మార్గాల కనెక్టివిటీకోసం సుమారుగా 286 ఎకరాల భూసేకరణ ముందుకు కదలడం లేదు. భూసేకరణకు రూ.100 కోట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి వస్తుండటంతో దీనిపై ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. మరోపక్క పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని కేంద్ర పర్యావరణ కమిటీ బృందం బుధవారం పరిశీలించడంతో మళ్లీ ఈ అంశం చర్చల్లోకొచ్చింది.
పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
బందరుపోర్టు నిర్మాణం చేయాలంటే పర్యావరణ అనుమతులు తప్పనిసరి. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులో బందరు పోర్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులపై కలెక్టర్ నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఈ నివేదికను ఏపీ మారిటైమ్‌బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం బందరు పోర్టుకు సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించింది. స్పందించిన కేంద్ర ప్రభుత్వం పంపిన ఐదుగురు సభ్యులతో కూడిన బృందం మంగళవారం మచిలీపట్నంకు వచ్చింది. పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతాలను ఈ బృందం సభ్యులు పరిశీలించారు. పోర్టునిర్మాణం జరిగే ప్రాంతం, బందరుపోర్టు నిర్మాణం జరిగితే జిల్లా ప్రజలకు ఒనగూరే ఉపాధి అవకాశాలు తదితర అంశాలను జేసీ అపరాజితాసింగ్, ఆర్డీవో కిషోర్, తహసీల్దార్ సునీల్‌బాబు ఈ బృందానికి వివరించారు. పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు సుముఖంగానే ఈ బృందం సభ్యులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పర్యావరణ అనుమతులు మంజూరైతే పోర్టు పనులు ప్రారంభించడం ఇక లాంఛనమేనని అదికారులు అంటున్నారు. బందరుపోర్టు పనుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.3,994కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇటీవల ప్రభుత్వం పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతంలోని ఐదు గ్రామాల సరిహద్దున ఉన్న 1734.32 ఎకరాల ప్రభుత్వ భూమికి సర్వే నెంబర్లు కేటాయించాలని జాయింట్ కలెక్టర్‌కు సూచిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను గతనెల 24వ తేదీన జారీ చేసింది.
మధ్యవర్తిత్వం ద్వారా తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచన
బందరు పోర్టు పనులను గతంలో నవయుగ సంస్థకు అప్పగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే పోర్టు పనులను సకాలంలో ప్రారంభించలేదని కాంట్రాక్టును రద్దు చేశారు. దీంతో నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. పోర్టు పనుల కాంట్రాక్టు రద్దుపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. దీంతో నవయుగ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈనెల 14వ తేదీన సుప్రీంకోర్టు బందరుపోర్టు టెండర్ల రద్దుపై మధ్యవర్తిత్వం ద్వారా తేల్చుకోవాలని సూచించింది. ఆ దిశగా నవయుగ సంస్థతో చ ర్చలు జరిపేందుకు ప్రభుత్వం తన వంతుగా ప్రయత్నాలు చేస్తూ సానుకూలంగా వ్యవహరిస్తోందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
పోర్టు పనులు మెఘా సంస్థకు..
బందరు పోర్టును ప్రభుత్వమే నిర్మించి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని తానే సమకూర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బందరు పోర్టు పనులకు గ్లోబల్ టెండర్లు పిలిచింది. మెఘా సంస్థ ఈ పనులను రూ.3,988 కోట్లకు దక్కించుకుంది. పర్యావరణ అనుమతులు వస్తే మెఘా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. ఒప్పందం చేసుకున్న 33 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. బందరు పోర్టుకు సంబంధించి గతంలో నవయుగ సంస్థ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయించింది. పోర్టు నిర్మాణానికి అవసరమైన అన్ని హంగులనూ గతంలోనే సమకూర్చింది. ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న మధ్యవర్తిత్వంలో నవయుగ సంస్థ ద్వారా కొంతమేర పోర్టు పనులను సబ్ కాంట్రాక్టుకు ఇచ్చి చేయించే అవకాశాలున్నట్టు సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు పోర్టు నిర్మాణం నిమిత్తం సర్వే చేస్తున్నారు.