Varla Ramaiah: చిన్న చిన్న సంఘటనలు జరిగితే మాచర్లలో 144 సెక్షన్ ఎందుకు?..
ABN , First Publish Date - 2022-12-18T13:09:31+05:30 IST
అమరావతి: మాచర్లలో అధికార పార్టీ, ప్రభుత్వ ప్రేరేపిత హింస నడుస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఆరోపించారు.
అమరావతి: మాచర్లలో అధికార పార్టీ, ప్రభుత్వ ప్రేరేపిత హింస నడుస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఆరోపించారు. ఆదివారం ఆయన ఇక్కద మీడియాతో మాట్లాడుతూ మాచర్ల ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేసిన తర్వాత కూడా వైసీపీ (YCP) గూండాలకు మారణాయుధాలు కత్తులు, గొడ్డళ్లు, కర్రలు, పెట్రోలు సీసాలు, ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇంటలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, ఎస్పీ రవిశంకర్ రెడ్డి ప్రోద్బలంతోనే జరిగినట్లుగా భాధితులు వాపోతున్నారని అన్నారు. జరిగినవి చిన్న చిన్న సంఘటనలని ఎస్పీ రవిశంకర్ చెబుతూ.. నేర తీవ్రతను తగ్గించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 5 కార్లు ద్వంసం చేసి, 2 కార్లు తగులబెట్టి, టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టి, టీడీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేసి నిప్పు పెడితే చిన్న చిన్న సంఘటనలుగా ఎస్పీ ప్రేర్కొనడం చూస్తుంటే ఆయనకు ఈ సంఘటనలపై ముందే సమాచారం ఉందా?.. అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
భాధితులైన టీడీపీ నేతలు, కార్యకర్తలపై హత్యయత్నం, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి.. ఈ ఘోరకలికి కారకులైన వైసీపీ శ్రేణులపై చిన్న చిన్న బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం ఎస్పీ పక్షపాత వైఖరికి నిదర్శనమని వర్ల రామయ్య అన్నారు. చిన్న చిన్న సంఘటనలు జరిగితే మాచర్ల పట్టణంలో 144 సెక్షన్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. భాదితులను పరామర్శించడానికి టీడీపీ నాయకులను ఎందుకు మాచర్ల రానివ్వడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా డీజీపీ రాజేంధ్రనాధ్ రెడ్డి మాచర్ల సందర్శించి జరిగిన సంఘటనను సమీక్షించి అసలు నేరస్తులైన వైసీపీ వారిని అరెస్టు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.