Yanamala: అప్పులపై అరగంటకో అబద్ధం.. గంటకో అప్పు..
ABN , First Publish Date - 2022-12-25T14:43:42+05:30 IST
ఏపీ (AP)లో అప్పులపై సీఎం జగన్ (CM Jagan) అరగంటకో అబద్ధం.. గంటకో అప్పు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) విమర్శించారు.
అమరావతి: ఏపీ (AP)లో అప్పులపై సీఎం జగన్ (CM Jagan) అరగంటకో అబద్ధం.. గంటకో అప్పు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ అనేది అత్యంత ప్రధానమైన రంగమని, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అప్పులపై సీఎం (CM), మంత్రులు (Ministers) రోజుకో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ (Cog) సమక్షంలో.. బహిరంగ చర్చకు సీఎం జగన్ సిద్ధమా? అంటూ యనమల సవాల్ చేశారు.
ఇది ప్రతి ఒక్కరి కుటుంబంపై ప్రభావం చూపుతుందని, 25 ఏళ్లపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉన్న అనుభవాన్ని బాధ్యత ఉన్న వ్యక్తిగా చెబుతుంటే పదే పదే తప్పుడు ప్రచారం చేసి రాష్ట్ర భవిష్యత్తును అంథకారం చేసే ప్రయత్నం చేస్తున్నారని యనమల మండిపడ్డారు. రాజ్యంగబద్ధ సంస్థలైన కాగ్ వంటి వాటికి కూడా వాస్తవాలు ఇవ్వకుండా దాచిపెడుతున్నారని, ప్రభుత్వం లెక్కలు, నివేదికలు ఇవ్వడంలేదని కాగ్ చెప్పిన విషయం వాస్తవంకాదా? అని ప్రశ్నించారు. దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) ఈ మూడున్నరేళ్లలో రూ.6 లక్షల 38వేల కోట్లు అప్పు చేసిందని, వీటికి అదనంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వేల కోట్లల్లో ఉంటాయని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.