AP News: ఏపీ డీజీపీకి వర్ల రామయ్య లేఖ
ABN , First Publish Date - 2022-11-08T11:01:15+05:30 IST
అమరావతి: నందిగామ రోడ్ షోలో చంద్రబాబుపై రాళ్లు వేసిన ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ డీజీపీకి లేఖ రాశారు.
అమరావతి: నందిగామ రోడ్ షోలో చంద్రబాబుపై రాళ్లు వేసిన ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల లోపాన్ని తమ దృష్టికి అనేకమార్లు తీసుకొచ్చామని, ప్రత్యేకించి ప్రతిపక్ష నేతలపై అధికారపార్టీ వైసీపీ చేస్తున్న దాడులపై పలుమార్లు ఫిర్యాదు చేశామన్నారు. భద్రతా లోపాలకు కారణమైన అధికారులు, దాడులకు పాల్పడిన వారిపై గానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
2019 ఆగష్టులో జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రతలో ఉన్న నారా చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమేరాలు ఎగురవేశారని, 2019 నవంబర్‌లో అమరావతి రాజధాని బస్సు యాత్రపై రాళ్లు, కర్రలు రువ్వారని వర్ల రామయ్య పేర్కొన్నారు. 2021 నవంబర్‌లో అధికారపార్టీ ఎమ్మెల్యే చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారన్నారు. తాజాగా నవంబర్ 4న ఎన్టీఆర్ జిల్లా, నందిగామలో పర్యటించిన చంద్రబాబు రోడ్ షోపై రాళ్లు వేశారని, రోడ్ షోకు ముందుగానే అనుమతులు తీసుకున్నప్పటికీ తగినంత భద్రత ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. ఈ ఘటనలో సెక్యూరిటీ చీఫ్ మధుకు గాయాలయ్యాయన్నారు. రూట్ మ్యాప్ పోలీసులకు ముందే ఇచ్చినప్పటికీ రోడ్ షో జరిగే చుట్టు ప్రక్కల ఇళ్లను ఎందుకు తనిఖీ చేయలేదని ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షనేతను ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కోలేక అధికారపార్టీ గూండాలు ఇలా దాడులకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి పక్షనేతకు సరైన భద్రత కల్పించడంలో పోలీసులు పైఫల్యం చెందారని విమర్శించారు. ఈ ఘటనపై పోలీసులు ఐపీసీ 120బి, 332 సెక్షన్ల కింద కేసు నమోదు చేయకుండా 324 కింద కేసు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. విశాఖపట్నంలో అధికారపార్టీ మంత్రులపై జరిగిన సాధారణ దాడిపై మాత్రం ఐపీసీ 307తో అటెమ్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. భద్రతా లోపాలకు కారణమైన డీఎస్పీ, సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేసి.. సరైన సెక్షన్లతో తిరిగి కేసు నమోదు చేసి నిందితులకు శిక్షపడేలా చూడాలని వర్ల రామయ్య ఆ లేఖలో పేర్కొన్నారు.