తెలుగు లెస్స

ABN , First Publish Date - 2022-12-25T01:00:45+05:30 IST

అది అక్షరాల పాలసంద్రం.. అందులో నుంచి వెలికివచ్చేది విజ్ఞానామృతం.. అది అందరికీ అందాలి.. తెలుగుకు అమరత్వాన్ని ప్రసాదించాలి.. ఇందుకు మనసును మధించి.. పుస్తకాలను శోధించాలి.. ప్రతి ఒక్కరూ విజ్ఞానఘనులై.. అభిమానధనులై అడుగులు వేయాలి.. ఇదీ రెండు రోజుల పాటు విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభల్లోని సారాంశం. సాహితీ సభలు, విదేశీయుల ముచ్చటైన పలుకులు, విమర్శకుల చలోక్తులు, అతిరథ మహారథుల రాకతో రెండో రోజైన శనివారం కూడా మహాసభలు మైమరపించాయి. అక్షరాలు దారాలై, పదాలు మల్లెలై, వాక్యాలు మాలలై ప్రతి ఒక్కరి కంఠాన్ని అలంకరించి ఆనందంగా పంపించాయి.

తెలుగు లెస్స

సాహితీ సౌరభాలతో గుబాళించిన బెజవాడ

విదేశీ ప్రతినిధుల రాకతో మరింత శోభాయమానం

తెలుగు వెలుగుల కోసం ప్రముఖుల దిశానిర్దేశం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : స్వభాషను రక్షించుకునే దిశగా సాగుతూ ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలు దిగ్విజయంగా ముగిశాయి. తెలుగు భాష మనుగడ కోసం మారుతున్న దేశ కాలమాన పరిస్థితుల్లో ‘రచయితల పాత్ర-కర్తవ్యం’ అనే ప్రధాన అంశంపై రెండు రోజుల పాటు ఈ సభలు జరిగాయి. తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాహితీవేత్తలు తరలివచ్చారు. తెలుగు వెలుగులకు ఎల్లలు లేవని, భాషా వికాసానికి తెలుగువారే కానవసరం లేదని ఈ మహాసభలు నిరూపించాయి. ఫ్రాన్స్‌, ఇటలీ, పోలెండ్‌ తదితర దేశాల నుంచి వచ్చినవారు సైతం తెలుగును అనర్గళంగా మాట్లాడటం, పాటలు పాడటం వంటివి ఆవిష్కృతమయ్యాయి. విదేశీయుల ద్వారా తెలుగు ఖండాంతరాలకు వ్యాప్తి చెందుతున్న ఈ దశలో అసలైన తెలుగువారిగా మనమేం చేస్తున్నామన్న మీమాంస అందరిలోనూ కలిగింది. ఎవరికి వారు వేదికలపై తమ వాణిని వినిపించారు. తెలుగు అస్తిత్వాన్ని ఏవిధంగా నిలబెట్టుకోవాలి, భాషా మనుగడ కోసం వచన, రచన పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సూచనలను మహాసభ స్వీకరించింది. రెండు రోజుల మహాసభల్లో మొత్తం 1,500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో తెలుగు రచయితలు, సాహితీవేత్తలు, కవులు, సాహిత్య పరిశోధకులు, తెలుగు కళల విధ్వాంసులు ఉన్నారు. వీరిలో రాష్ర్టేతర ప్రతినిధులు వందమంది వరకూ ఉన్నారు. విదేశీ తెలుగు ప్రతినిధులు కూడా 50 మంది వరకు హాజరయ్యారు.

Updated Date - 2022-12-25T01:00:46+05:30 IST