చేపా..చేపా ఏమైపోయావ్
ABN , First Publish Date - 2022-12-14T00:48:41+05:30 IST
మెగా చేపల ఉత్పత్తి కేంద్రం అటకెక్కింది. కేసీ కెనాల్ నీటి ఆధారంగా బంగారుపేటలో చేపడుతున్న చేప పిల్లల ఉత్పత్తీ తగ్గిపోయింది.
అటకెక్కి మెగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం
శ్రీశైలంలో ఏర్పాటుకు గతంలోనే నిర్ణయం
టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.4.50 కోట్లతో గ్రీనసిగ్నల్
వైసీపీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోని వైనం
బంగారుపేటలోనూ తగ్గిపోయిన ఉత్పత్తి
కాంట్రాక్టర్ల ద్వారా కోస్తాంధ్ర నుంచి దిగుమతి
ఇండెంట్ ప్రకారం సప్లయ్ చేయడం లేదని ఆరోపణలు
ఉపాధిలేక ఇబ్బందిపడుతున్న మత్స్యకారులు
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 13: మెగా చేపల ఉత్పత్తి కేంద్రం అటకెక్కింది. కేసీ కెనాల్ నీటి ఆధారంగా బంగారుపేటలో చేపడుతున్న చేప పిల్లల ఉత్పత్తీ తగ్గిపోయింది. దీంతో రాయలసీమ జిల్లాలకు సప్లయ్ నిలిచిపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నీటి వనరులకు కొదువలేదు. కృష్ణా, తుంగభద్ర, హంద్రీ నదులతోపాటు కుందూ నది కూడా ఉమ్మడి జిల్లాలోనే ప్రవహిస్తోంది. ఈ నీటి వనరులను వినియోగించుకుని మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విధంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అటకెక్కించేలా చేశాయి. ప్రస్తుతం కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని జలాశయాలు, చెరువుల్లో చేప పిల్లల ఉత్పత్తి చేపట్టాలంటే కోస్తా ప్రాంతం నుంచి చేప పిల్లలను తీసుకువచ్చి ఇక్కడ జలాశయాల్లో పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. దీని వల్ల ఎన్నో వ్యయ ప్రయాసలు ఎదురవుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు స్థానికంగానే చేప పిల్లల ఉత్పత్తి చేపట్టడం వల్ల వ్యయప్రయాసలు తప్పిపోతాయని మెగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు వంద ఎకరాల స్థలాన్ని సేకరించడంతోపాటు రూ.4.50 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ అప్పట్లోనే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రతిపాదన అటకెక్కింది.
తగ్గిపోయిన చేపల ఉత్పత్తి
కర్నూలు జిల్లా కేంద్రలోని బంగారుపేటలో కేసీ కెనాల్ నీటి ఆధారంగా చేప పిల్లలను ఉత్పత్తి చేసి రాయలసీమ జిల్లాలకంతటికీ సప్లయ్ చేసేవారు. ఒకప్పుడు సప్లయ్ సమయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన లారీలతో బంగారుపేట ప్రాంతమంతా కిక్కిరిసిపోయి ఉండేది. కాలక్రమంలో కేసీ కెనాల్‌కు నీటి విడుదల తగ్గిపోవడంతో చేపపిల్లల ఉత్పత్తి తగ్గిపోయింది. ఫలితంగా బంగారుపేట చేప పిల్లల కేంద్రం నిరూపయోగమయ్యే స్థితికి చేరుకుంది. వర్షాలు సక్రమంగా కురిసి జలాశయాలు సకాలంలో నిండితే జిల్లా కేంద్రంలోని బంగారుపేట ప్రాంతంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంతోపాటు సుంకేసుల, వెలుగోడు, గాజులదిన్నె తదితర ఎంపిక చేసిన చెరువుల్లో చేప పిల్లలను ఉత్పత్తి చేసి అరకొరగా కర్నూలుతోపాటు రాయలసీమకంతటికీ సప్లయ్ చేస్తున్నారు.
పది కోట్ల చేప పిల్లలకు నాలుగు లక్షలే ఉత్పత్తి..
కర్నూలు జిల్లాలోని జలాశయాలు శ్రీశైలం, వెలుగోడు, అలగనూరు, గోరుకల్లు, అవుకు, సుంకేసుల, గాజులదిన్నెతోపాటు జిల్లాలోని 350 చెరువులు 4.50 కోట్ల చేప పిల్లలు అవసరం. అయితే జిల్లాలో ప్రస్తుతం మత్స్యకార అభివృద్ధి శాఖ ద్వారా 4.5 లక్షల చేప పిల్లలను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. మిగిలిన నాలుగు కోట్ల చేప పిల్లల్ని కాంట్రాక్టర్ల ద్వారా గుంటూరు, క్రిష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి తెప్పించుకుంటున్నారు. మిగిలిన కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు 5.50 కోట్ల చేప పిల్లలు అవసరం.
రాయలసీమకు ఇక్కడి నుంచే సప్లయ్ ఉన్నా..
రాయలసీమ ప్రాంతానికి కర్నూలు నుంచే చేప పిల్లలను సప్లయ్ చేయించేందుకు మెగా చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. గతంతలో ప్రభుత్వం ప్రధాన జలాశయాలు ఉన్న చోటల్లా చేప పిల్లల ఉత్పిత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎందువల్లనో ఏమోగాని శ్రీశైలం జలాశయం వద్ద చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. అప్పట్లో పాలకుల నిర్లక్ష్యం ప్రస్తుతం మత్స్యకారుల జీవనోపాధికి ఆటంకంగా మారింది. తగినంత మొత్తంలో చేపలు లేక మత్స్యకారులు కేవలం నాలుగైదు నెలలే చేపల వేట కొనసాగించి మిగిలిన సమయంలో ఏదో ఒక పని చేసుకుని జీవనోపాధి పొందాల్సిన పరిస్థితి నెలకొంది.
అటకెక్కిన మెగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం:
రాయలసీమ జిల్లాల్లోని మత్స్యకారులకు ఏడాదంతా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మెగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా 4.50 కోట్లతో శ్రీశైలం జలాశయం సమీపంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అప్పటి కలెక్టర్ వీరపాండియన చేపల ఉత్పత్తి కేంద్రానికి అవసరమైన స్థలాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆ తరువాత మెగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం గురించి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఉమ్మడి జిల్లా మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకే:
గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో చెరువులకు ప్రభుత్వమే చేప పిల్లలను కోస్తా ప్రాంతం నుంచి తెప్పించేది. ఆ తరువాత మత్స్యకార సహకార సంఘాలే సొంతంగా ఖర్చు చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో అందులోని సభ్యులే తలా కొంత మొత్తాన్ని పోగు చేసుకుని చేప పిల్లలను కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసేవారు. పెద్ద జలాశయాలైన సుంకేసుల, వెలుగోడు, గోరుకల్లు, అవుకు, గాజులదిన్నె, పందికోన తదితర వాటిల్లో చేప పిల్లలను పెంచేందుకు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు టెండరు ఇచ్చింది. ఈ కాంట్రాక్టర్లు కోస్తా ప్రాంతం నుంచి లారీల్లో చేప పిల్లలను ప్రభుత్వ ఇండెంట్ ప్రకారం తెచ్చి ఉమ్మడి జిల్లాలోని రిజర్వాయర్లలో విడుస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, క్రాంటాక్టర్లు ఇండెంట్ ప్రకారం చేప పిల్లలను సప్లయ్ చేయడం లేదని మత్స్యకార సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలి
- పీజీ వెంకటేశ్వర్లు, టీడీపీ బీసీ సాధికార సమితి నంద్యాల అధ్యక్షుడు :
ఉమ్మడి జిల్లాలో మెగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటైతే మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది ఉండదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం సమీపంలో మెగా సీడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి లభించింది. గతంలో మంత్రిగా పని చేసిన మోపిదేవి వెంకటరమణ కూడా మెగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదనలను ఈ ప్రభుత్వం అటకెక్కించేసింది. దీంతో మత్స్యకారుల జీవనోపాధి లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం మెగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
ఆ ప్రతిపాదన ఏదీ మా వద్ద లేదు - శ్యామల, మత్స్యశాఖ జిల్లా అధికారి, కర్నూలు:
మెగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి సంబంధించి ప్రస్తుతం మా కార్యాలయంలో ఎలాంటి ప్రతిపాదన లేదు. ప్రభుత్వానికి కూడా ఈ అంశానికి సంబంధించి మేము ఎటువంటి ప్రతిపాదన పంపలేదు. జలాశయాల్లో చేప పిల్లలను ప్రభుత్వమే కోస్తా ప్రాంతం నుంచి తెచ్చి వదులుతోంది. ప్రభుత్వ లక్ష్యం మేరకు సంబంధిత కాంట్రాక్టరు చేప పిల్లలను తీసుకు వస్తున్నారు. ఇందులో ఎటువంటి అక్రమాలకు చోటు లేదు. మత్స్యకారుల సహకార సంఘాలకు సంబంధించి ఆయా చెరువుల్లో చేప పిల్లలను వారే సొంత ఖర్చులు భరించి కోస్తా ప్రాంతం నుంచి కొనుగోలు చేసి చెరువుల్లో వదులుతున్నారు.