ముస్తాబైన చర్చిలు
ABN , First Publish Date - 2022-12-24T23:19:34+05:30 IST
ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు చర్చిలు క్రిస్మస్ వేడుకలకు ముస్తాబయ్యాయి.
ఆత్మకూరు, డిసెంబరు 24 : ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు చర్చిలు క్రిస్మస్ వేడుకలకు ముస్తాబయ్యాయి. అనంతసాగరం, ఏఎస్‌పేట, చేజర్ల, సంగం, మర్రిపాడు, ఆత్మకూరు మండలాల్లో ఉన్న 219 గ్రామాలకు గాను 99 గ్రామాల్లో 149 చర్చిలు ఉన్నాయి. వాటన్నింటిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సంఘకాపరులు పెద్దలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆత్మకూరులోని క్రిస్టియన్‌పేటలో ఉన్న సెంటినరీ తెలుగుబాప్టిస్టు చర్చి, సెంటల్ తెలుగు బాప్టిస్టు చర్చి, సియోస్ ప్రార్ధనమందిరాలు వేడుకలకు ముస్తాబయ్యాయి. క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేసి చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మండలంలోని వెన్నవాడ, కరటంపాడు, వెంకట్రావుపల్లి, బి.చిరువెళ్ల తదితర గ్రామాల్లోని చర్చిల్లో ’ క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవులు సామూహిక ప్రార్థనలు చేసేందుకు తగిన ఏర్ప్డాట్లు పూర్తయ్యాయి.
ఘనంగా ప్రీక్రిస్మస్ వేడుకలు
పట్టణంలోని లెర్నింగ్‌ట్రీ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో శనివారం ప్రీక్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ మేకపాటి శైలజ, ఉపాధ్యాయులు ఏసుక్రీస్తు జననం, ఆయన లోకరక్షకుడిగా మారిన విశేషాలను విద్యార్థులకు వివరించారు.
సంగం : మండలంలోని క్రిస్టియన్లు చర్చిలను రంగులతో సిద్ధం చేశారు. మండలంలోని వంగల్లు, దువ్వూరు, మక్తాపురం, అన్నారెడ్డిపాళెం, తరుణవాయి, మర్రిపాడు, సంగం తదితర గ్రామాల్లోని చర్చిలను ముందుగానే రంగురంగులతో ముస్తాబు చేశారు. అనంతరం విద్యుత్ దీపాలతో అలంకరించారు. అంతేగాక క్రిస్మస్ పండుగకు క్రిస్టియన్లు ఆనవాయితీ ప్రకారం చర్చిల ముందు, ఇళ్ల ముంగిట్లో స్టార్‌లు ఎగురవేశారు.
ఉదయగిరి : మండలంలోని గండిపాళెం, వెంగళరావునగర్, గుడినరవ, వీరారెడ్డిపల్లి, గన్నేపల్లి, కృష్ణంపల్లి, బోడబండ, అయ్యవారిపల్లి, దాసరిపల్లి, అప్పసముద్రం, సర్వరాబాదు, ఉదయగిరిలోని చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇళ్లను అలంకరించి ట్రీలను ఏర్పాటు చేశారు. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు స్వగ్రామాలకు చేరుకున్నారు. బంధుమిత్రులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా చర్చిల్లో ఫాస్టర్లు బైబుల్ సందేశాన్ని ఇవ్వనున్నారు.
కోవూరు, డిసెంబరు24: క్రిస్మస్ వేడుకల సందర్భంగా స్థానిక శారాభిలాక్ చర్చిని ముస్తాబు చేశారు. శతవసంతాలు పూర్తి చేసుకున్న చర్చిలో క్రిస్మస్‌ను వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. చర్చిని విద్యుద్దీపాలతో అలంకరించారు. పాస్టర్లు క్రీస్తు బోధనల్ని విన్పించనున్నారు. క్రీస్తును స్తుతిస్తూ గేయాలు ఆలపించనున్నారు. తెలుగు బాప్టిస్టు చర్చి. పరిశిపోగు వందనం చర్చిల్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు
రాపూరు, డిసెంబరు 24: రాపూరులో శనివారం రాత్రి నుంచి క్రిస్మస్ సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ సారి పెద్ద ఎత్తున చర్చిలను విద్యుత్తుదీపాలతో శోభాయమానంగా అలంకరించారు. చర్చిల్లో క్ర్మిస్మస్ ట్రీని ఏర్పాటుచేసి విద్యుత్తుదీపాలంకరణ చేశారు. చర్చిల్లో రాత్రి ప్రత్యేక ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహి ంచారు.
బుచ్చిరెడ్డిపాళెం : మండలంలోని పలు గ్రామాలు, పాఠశాలలు, చర్చిల్లో శనివారం ప్రీ క్రిస్మస్ వేడుకులు జరిగాయి. ఈ సందర్భంగా క్రెస్తవులు చిన్నా పెద్ద తేడా లేకుండా చర్చిల్లో ప్రార్థనలు చేశారు. బుచ్చిలోని గ్లోబల్ స్కూలు, గోపాలకృష్ణయ్య తదితర స్కూళ్లలో చిన్నారుల ధరించిన వేషధారణలు అందరినీ అలరించాయి. విద్యార్థులకు క్రిస్మస్ పర్వదినం ప్రత్యేకతను గురించి వివరించారు. చర్చిలు, క్రైస్తవుల నివాసాలు, స్టార్లు విద్యుద్దీపాలంకరణతో ముస్తాబయ్యాయి. బుచ్చి, వవ్వేరు, రేబాల, పెనుబల్లి, కాళయకాగొల్లు, దామరమడుగు తదితర గ్రామాల్లో పలు వీధుల్లో స్టార్స్ అలరించాయి. చిన్నారులు ఏస్తుక్రీస్తు, క్రిస్‌మస్ తాత, గొర్రెలపాకలో క్రీస్తు జననం వేషధారణలు, చిత్ర ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. క్రిస్మస్ సందర్భంగా బుచ్చి, మండలంలోని పలు చర్చిలలో రాత్రి 12 గంటల వరకు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.