జిల్లాను పంచుకున్న వైసీపీ నేతలు
ABN , First Publish Date - 2022-09-08T05:29:52+05:30 IST
నెల్లూరు జిల్లాను వైసీపీ నాయకులు వాటాలు వేసుకుని పంచుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.
పోలీసుల హింస వెనుక అధికార పార్టీ నేతల హస్తం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
యువనేత రాకతో శ్రేణుల్లో పెరిగిన జోష్
కావలి, సెప్టెంబరు 7 : నెల్లూరు జిల్లాను వైసీపీ నాయకులు వాటాలు వేసుకుని పంచుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం ఆయన కావలికి వచ్చారు. పట్టణంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు కావలి, ఉదయగిరి నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. మద్దూరుపాడు నుంచి ముసునూరు వరకు పసుపు మయంగా ర్యాలీ సాగడంతో క్యాడర్‌లో జోష్ పెరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన జనాదరణ చూస్తే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమన్న నమ్మకం కలుగుతుంది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ హత్యలు, మానభంగాలు, భూకబ్జాలు పోలీసుల హింసలతో నెల్లూరు క్రైం రాజధానిగా మారిందన్నారు. వీటి వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన నిధులను పక్కదారి పట్టించి ఎస్సీ కార్పొరేషనను నిర్వీర్యం చేశారన్నారు. దళితుల అభివృద్ధి కోసం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేశారన్నారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు, పోలీసుల చేతుల్లో దళితులు, మైనార్టీలు, బీసీలు బలైపోతున్నారన్నారు. ఎంతో భవిష్యత ఉన్న దళిత యువకుడు కరుణాకర్ వైసీపీ నేతల వేధింపులకు బలయ్యాడని పేర్కొన్నారు. దళితులను చంపేవారికి వైసీపీలో పదవులు ఇస్తున్నారని, కరుణాకర్ కేసులో నిందితుడైన జగదీశ్వర్‌రెడ్డికి శ్రీశైలం బోర్డు డైరెక్టర్ పదవి ఇచ్చారన్నారు. కరుణాకర్ కేసులో అసలు సూత్రధారులైన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్‌రెడ్డి, సుకుమార్ రెడ్డిలను వదిలేసి జగదీశ్వర్‌రెడ్డి, సుకుమార్‌రెడ్డిలను అరెస్ట్ చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారన్నారు. ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి, షాడో ఎమ్మెల్యే సుకుమార్‌రెడ్డిలు కలసి కరుణాకర్ ఇంటి పక్కన ఓ మల్టీ ప్లెక్స్ థియేటర్ కట్టేందుకు కరుణాకర్ ఇల్లు కూడా అవసరం కావటంతో దాన్ని లాక్కునేందుకు వేధించారన్నారు. కావలి ఎమ్మెల్యే అక్రమాలు అన్నీ ఇన్నీ కావని విమర్శించారు. గ్రావెల్ దందా లో కోట్లు కొట్టేస్తున్నారని, వారి అనుమతులు లేకుండా ఎవరూ ఆస్తులు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కరుణాకర్ ఆత్మహత్య విషయాన్ని టీడీపీ నాయకులు జాతీయ ఎస్సీ కమిషన దృష్టికి తీసుకువెళ్లడంతో ఆ చట్ట ప్రకారం ప్రభుత్వం నుంచి రాయతీలు వచ్చాయే తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. పోర్జరీ సంతకాల కేసు, కల్తీ మద్యం కేసులకు మంత్రి కాకాణి బ్రాండ్ అంబాజిడర్‌గా మారారని లోకేష్ విమర్శించారు. ప్రభగిరిపట్నం మైనింగ్ అంతా కాకాణి ఆధ్వర్యంలోనే నడుస్తుందన్నారు. టీడీపీ కావలి ఇనచార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, పరసా వెంకటరత్నం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి రాష్ట్ర దళిత నేతలు ఎంఎస్ రాజు, అనిత మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని రామారావు, దివి శివరామ్, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, జిల్లా నేతలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, ఆనం వెంకటరమణారెడ్డి, తాళ్లపాక అనూరాధ, మాలేపాటి రవీంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.