గందరగోళం మధ్య ఏఎన్‌ఎంల కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2022-12-01T01:04:23+05:30 IST
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏఎన్‌ఎంల నియామకం కోసం చేపట్టిన కౌన్సెలింగ్ గందరగోళం మధ్య ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో 194 సచివాలయాల్లో ఏఎన్‌ఎంలను నియమించాల్సి ఉంది. అందుకోసం ఇప్పటికే మ్యాపింగ్ చేశారు. అయితే ఒంగోలు సమీప ప్రాంతంలో పనిచేసే ఏఎన్‌ఎంలు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన
మద్దతుగా నిలిచిన ఎన్‌జీవో సంఘ నేతలు
ఒంగోలు(కలెక్టరేట్), నవంబరు 30 : గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏఎన్‌ఎంల నియామకం కోసం చేపట్టిన కౌన్సెలింగ్ గందరగోళం మధ్య ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో 194 సచివాలయాల్లో ఏఎన్‌ఎంలను నియమించాల్సి ఉంది. అందుకోసం ఇప్పటికే మ్యాపింగ్ చేశారు. అయితే ఒంగోలు సమీప ప్రాంతంలో పనిచేసే ఏఎన్‌ఎంలు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. కొంతమంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం జరగాల్సిన కౌన్సెలింగ్ వాయిదా పడింది. తాజాగా బుధవారం స్థానిక రిమ్స్‌లోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఏఎన్‌ఎంల కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి ఏఎన్‌ఎంలు తరలివచ్చారు. తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ఏపీఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్‌బాబు నేతృత్వంలో వారు ఆందోళన చేపట్టారు. దీంతో ఉదయం జరగాల్సిన కౌన్సెలింగ్ వాయిదాపడింది. పలు పర్యాయాలు వైద్యారోగ్యశాఖ అధికారులతో ఎన్‌జీవో సంఘ నాయకులు చర్చలు జరిపారు. ఏ మండలంలో పనిచేసే ఏఎన్‌ఎంలను ఆ మండల పరిధిలోనే నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు శరత్‌బాబు డిమాండ్ చేశారు. ఏఎన్‌ఎంలు కూడా ఆ విధానాన్ని అమలు చేయాలని కోరారు. సాయంత్రం ఎట్టకేలకు ఆ విధంగానే కౌన్సెలింగ్ ప్రారంభమైంది.