రెండు కిలోలు కట్‌!

ABN , First Publish Date - 2022-12-01T00:01:42+05:30 IST

ఇది ఒక మందస మండలంలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా బ్రాండెడ్‌ బియ్యం పేరిట దోపిడీ సాగుతోంది. 25కిలోల బియ్యం బస్తా కొనుగోలు చేస్తే.. 23 కిలోలే ఉంటున్నాయి. అటు కొనుగోలుదారులు కూడా అంతే ఉంటాయని నిశ్చయానికి వచ్చేశారు.

రెండు కిలోలు కట్‌!
25 కిలోలకు బదులుగా 23.50 కిలోలు ఉన్న బియ్యం బ్యాగు

రెండు కిలోలు కట్‌!

బస్తాపై ముద్రణకు, తూకానికి తేడా

25 కిలోల బ్యాగులో ఉండేది 23 కిలోలే

బియ్యం వ్యాపారుల మోసం ఇది

రేషన్‌ బియ్యం తెచ్చి రీ సైక్లింగ్‌

బ్రాండెడ్‌ పేరిట మార్కెట్‌లోకి..

అయినా పట్టని యంత్రాంగం

అది పేరొందిన దుకాణం కావొచ్చు.. రైస్‌ మిల్లు కావొచ్చు. బియ్యం తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. బ్యాగును అక్కడే తూకం వేయమని అడగండి. వాళ్లెంత నచ్చజెప్పినా వినకండి. తూకం చెక్‌ చేసుకున్నాకే ఇంటికి తీసుకెళ్లండి. ఎందుకంటే చాలాచోట్ల 25 కిలోల బ్యాగుల్లో 2 కిలోల తక్కువ ఉంటున్నాయి. అలాగే బ్రాండెడ్‌ బియ్యమే అని తీసుకుంటున్నారా? అయితే వీటినీ ఒకసారి చెక్‌ చేసుకోండి. బ్రాండెడ్‌ పేరిట రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ చేసి మీకు అంటగట్టే ప్రమాదం ఉంది. దుకాణదారుడ్ని రశీదు కూడా అడగడం మర్చిపోకండి.

(హరిపురం)

- మందస మండలం హరిపురంలోని ఓ దుకాణంలో ఉద్యోగి ఒకరు బ్రాండెడ్‌ బియ్యం ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. 25 కిలోల కంటే బరువు తక్కువగా ఉండడంతో అనుమానంతో తూకం వేశారు. 23 కిలోలే ఉండడంతో కంగుతున్నాడు. సదరు దుకాణ నిర్వాహకుడ్ని అడగ్గా ‘బియ్యం ప్యాకెట్లు ఇలాగే ఉంటాయి.. ఇష్టముంటే కొనండి.. లేకపోతే మానేయ్యండి’ అంటూ విసుగ్గా సమాధానం చెప్పాడు.

- మందసలో ఒక రైస్‌మిల్లులో వల్లభరావు అనే వ్యక్తి బియ్యం ప్యాకెట్‌ కొనుగోలు చేశాడు. తూకం వేయగా తక్కువగా వచ్చింది. మిల్లు యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. రశీదు అడిగినా ససేమిరా అన్నాడు. వివాదానికి దారితీయగా రశీదు ఇచ్చాడు. బాధితుడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.

ఇది ఒక మందస మండలంలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా బ్రాండెడ్‌ బియ్యం పేరిట దోపిడీ సాగుతోంది. 25కిలోల బియ్యం బస్తా కొనుగోలు చేస్తే.. 23 కిలోలే ఉంటున్నాయి. అటు కొనుగోలుదారులు కూడా అంతే ఉంటాయని నిశ్చయానికి వచ్చేశారు. అంతలా విక్రయదారులు, మిల్లర్లు ప్రభావితం చేశారు. అయితే రెండు కిలోలే కదా అని తేలిగ్గా తీసుకుంటుండగా.. కోట్లాది రూపాయల దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. కనీస నిబంధనలు పాటించకుండా బ్రాండెడ్‌ పేరిట ఆకర్షవంతమైన ప్యాకెట్‌లో అందుబాటులోకి తెచ్చి విక్రయిస్తున్నారు. జిల్లాలో 406 రైస్‌ మిల్లులు ఉన్నాయి. బియ్యం హోల్‌సేల్‌ దుకాణాలు సైతం 150కి పైగా ఉంటే.. రిటైల్‌ దుకాణాలు 1,000కి పైనే ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల బియ్యం విక్రయాలు జరుగుతున్నాయి. బస్తాపై ముద్రించిన బరువుకు.. తుకానికి కేజీన్నర నుంచి రెండు కిలోల వరకూ తేడా ఉంటోంది.

కానరాని నిబంధనలు

రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించి పాలిష్‌ చేసి మరీ బస్తాల్లోకి ఎక్కించి దుకాణాల్లో విక్రయిస్తున్నారు.సూపర్‌ ఫైన్‌ రకం రూ.51 నుంచి 55 వరకూ.. ఫైన్‌ రకం రూ.45 నుంచి రూ.49 వరకూ.. సాధారణ రకం రూ.34 నుంచి 38 వరకూ విక్రయిస్తున్నారు చిరునామా, బ్యాచ్‌ నెంబర్లు, బరువు, ధరలు ఇలాంటివేవీ ముద్రించకుండా కొందరు బియ్యం విక్రయాలకు పాల్పడుతున్నారు. తూకాల్లోనూ భారీగా తేడాలుంటున్నాయి జిల్లాలో సుమారు 500 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇటు గృహాల యజమానులు, హోటళ్ల నిర్వాహకులు వినియోగిస్తున్నారని అంచనా. ఈ లెక్కన రోజుకు రూ.2.5 కోట్లు చొప్పున అక్రమాలు జరుగుతున్నాయని గణాంకాలు తెలియజేస్తున్నారు. దీనిలో 25కిలోల బస్తాకు ఒక కిలో చొప్పున తగ్గితే కిలో రూ. 50లు చొప్పున రోజుకు రూ.10 లక్షలు, నెలకు రూ. 3 కోట్లు, ఏడాదికి రూ.36 కోట్లు వ్యాపారులకు మిగులుతున్నట్లు అంచనా. ఇలా బియ్యం వ్యాపారం ముసుగులో ఘరానా మోసం జరుగుతోంది. పర్యవేక్షణ లోపంతో అక్రమాలకు అడ్డేలేకుండా పోతోంది. ఒకవేళ వినియోగదారుడు తూకంలో తేడా ఉందని దుకాణాదారుడ్ని, రైస్‌మిల్లుల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే ఇవన్నీ బ్రాండెడ్‌ కంపెనీల బియ్యం.. ఇష్టముంటేనే తీసుకెళ్లండి.. లేకపోతే లేదు. అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు.

అవేవీ లేకుండానే..

తూనికలు కొలతలు శాఖ నిబంధనల ప్రకారం ప్రతీబస్తాపై తయారీదారుని చిరునామా, తయారుచేసిన తేదీ, నికర బరువు, బియ్యం ఏ రకానివో వివరంగా ముద్రించాలి. గుర్తింపు పొందిన కొన్ని బ్రాండ్‌ల మినహా 90శాతం వరకు రకాలపై ఎలాంటి వివరాలు ఉండడంలేదు. స్థానిక వ్యాపారులు మిల్లర్లుకు 23 నుంచి 24 కిలోల చొప్పున సంచులు ఇవ్వాలని పురమాయిస్తుండడంతో వారి అభిష్టానికి తగ్గట్లుగా చిన్న సైజ్‌ సంచులు తయారీ చేసి ఇస్తున్నారు. ఆయా బస్తాలపై 25 కిలోలుగా ముద్ర ఉన్నా లోపల మాత్రం 23 కిలోలు, 24 కిలోలు మాత్రమే ఉంటోంది. దీనికి తోడు రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. గ్రామాల్లో చిరు వ్యాపారులు రేషన్‌ బియ్యాన్ని సేకరించి మిల్లర్లకు అందిస్తున్నారు. ఇందుకుగాను వారికి కమీషన్‌ రూపంలో కొంత మొత్తం ముట్టజెబుతున్నారు. అవే బియ్యాన్ని రీ పాలిష్‌ చేసి బ్రాండెడ్‌ బియ్యంతో కలిపి విక్రయిస్తున్నారు. దీనిపై యంత్రాంగం నిఘా కరువవుతోంది. రెవెన్యూ, తూనికలు కొలతలు శాఖ, పౌరసరఫరాల శాఖ పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

దృష్టిపెడతాం

బ్రాండెడ్‌ బియ్యం పేరుతో జరుగుతున్న దోపిడీపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం. పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పటివరకూ ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. ఎక్కడైనా తూకంలో మోసాలకు పాల్పడితే నేరుగా తెలియజేయాలి. పరిశీలించి తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

- పాపారావు, తహసీల్దారు, మందస

Updated Date - 2022-12-01T00:01:44+05:30 IST