వికటించిన ఐరన్‌ మాత్రలు

ABN , First Publish Date - 2022-12-23T00:23:26+05:30 IST

పీహెచ్‌సీ సిబ్బంది పంపిణీ చేసిన ఐరన్‌ మాత్రలు వేసుకుని 10 మంది విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురయ్యారు.

వికటించిన ఐరన్‌ మాత్రలు
చికిత్స పొందుతున్న విద్యార్థినులు

- నందిగాంలో 10 మంది విద్యార్థులకు అస్వస్థత

- ఆసుపత్రిలో చికిత్స

నందిగాం(పోలాకి): పీహెచ్‌సీ సిబ్బంది పంపిణీ చేసిన ఐరన్‌ మాత్రలు వేసుకుని 10 మంది విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి. పోలాకి మండల పరిఽధిలోని అంపలాం పంచాయతీ నందిగాం ప్రాథమిక పాఠశాలలో 27 మంది విద్యార్థులు చదువుతున్నారు. గురువారం వీరితో వైద్య సిబ్బంది ఐరన్‌ మాత్రలు వేయించారు. మాత్రలు వేసుకున్న 10 నిమిషాల్లోనే 10 మంది విద్యార్థులు కడుపునొప్పి, తల తిరగడం, వాంతులు వస్తున్నాయంటూ ఉపాధ్యాయులకు తెలిపారు. దీంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. హెచ్‌ఎం కిల్లి సింహాచలం పోలాకి పీహెచ్‌సీకి విద్యార్థులను ఆటోలో తరలించారు. వారికి వైద్య పరీక్షలు చేసి పది మందిలో ముగ్గురు బాలికలకు సిలైన్‌ బాటిల్స్‌ ఎక్కించారు. మిగతా విద్యార్థులకు వైద్యకేంద్ర విస్తరణాధికారి నల్లి రవికుమార్‌ మాత్రలిచ్చి చికిత్స చేశారు. ఆసుపత్రికి తమ పిల్లలను తరలించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై తరలివచ్చారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత విద్యార్థులు కుదుటపడడంతో ఇంటికి పంపించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఐరన్‌ మాత్రలు వేసుకున్న తరువాత అధిక మోతాదులో నీరు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Updated Date - 2022-12-23T00:23:27+05:30 IST