జగనన్న కాల‘నీళ్లు’!
ABN , First Publish Date - 2022-10-11T04:52:44+05:30 IST
జగనన్న కాలనీలు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్ల చుట్టూ నీరు చేరింది. రహదారులు బురదమయమై రాకపోకలు సాగించలేని దుస్థితి నెలకొంది. కాలనీల్లో కనీస వసతులు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
జగనన్న కాల‘నీళ్లు’!
ఇళ్ల చుట్టూ నీరు
అధ్వానంగా రహదారులు
కనీస వసతులు లేక ఇబ్బందులు
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ ఎచ్చెర్ల/ పలాస/ టెక్కలి/ నరసన్నపేట/ ఆమదాలవలస/ జలుమూరు)
జగనన్న కాలనీలు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్ల చుట్టూ నీరు చేరింది. రహదారులు బురదమయమై రాకపోకలు సాగించలేని దుస్థితి నెలకొంది. కాలనీల్లో కనీస వసతులు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు పాత్రునివలస, పొన్నాడ ప్రాంతాల్లో ఇళ్లను కేటాయించారు. పాత్రునివలస 1, 2 ప్రాంతాల్లో ఇళ్ల చుట్టూ నీరు చేరింది. రోడ్లు మరీ అధ్వానంగా మారాయి. దీంతో రాకపోకలు సాగించలేకపోతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండలం బెజ్జిపురం, లోపెంట, గుమడాం తదితర గ్రామాల్లో జగనన్న కాలనీలు నిర్మాణ దశలోనే నీటమునిగాయి. జి.సిగడాం మండలంలో మెట్టవలసలో జగనన్న కాలనీ చుట్టూ నీరు నిలిచిపోయింది. ఎచ్చెర్ల మండలం ధర్మవరంలో రుప్పపేటకు వెళ్లే దారిలో జగనన్న కాలనీకి స్థలం కేటాయించినా.. ఇప్పటివరకు ఎవరూ ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు.
- టెక్కలిలోనూ జగనన్న కాలనీల్లో రహదారులు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. గుంతల్లో నీరు చేరింది. ఇక్కడ రహదారులు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం పునరుద్ధరిస్తామని అధికారులు, పాలకులు చెబుతూనే ఉన్నారు. కానీ, ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఇచ్ఛాపురం మునిసిపాలిటీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. లొద్దపుట్టి వద్ద ఇళ్ల చుట్టూ నీరు నిలిచిపోయింది.
- నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మేజర్ పంచాయతీలో లబ్ధిదారులకు నర్సిపురం వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించారు. లోతట్టు ప్రాంతం కావడంతో ఈ కాలనీ చుట్టూ నీరు చేరింది. రోడ్డు మార్గం లేదు. జలుమూరులో కూడా జగనన్న కాలనీకి వెళ్లేందుకు సరైన రోడ్డు లేదు.
- ఆమదాలవలస మునిసిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గాజులకొల్లివలసలో 1605, తిమ్మాపురంలో 305, చింతాడ సమీపంలో 248 లే అవుట్లు వేశారు. వసతుల్లేక ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గాజులకొల్లివలస సమీపంలోని కొండప్రాంతంలో స్థలాలు కేటాయించగా.. వాటిని చదును చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిమ్మతొర్లాడలో నాగావళి ఒడ్డున లే అవుట్ వేయడం గమనార్హం.
- పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లోని జగనన్న కాలనీలో కనీసం రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ ప్రజల కోసం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోసంగిపురం రోడ్డులో మొత్తం 3వేల గృహాలు నిర్మించడానికి 50 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుత వర్షాలకు అక్కడ ఉన్న కచ్చా రోడ్డు కొట్టుకుపోయింది. అంతా బురదమయంగా మారింది. ఇళ్లన్నీ పూర్తయితేనే.. పూర్తిస్థాయిలో రహదారులు నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. రాకపోకలు సాగించేందుకు కనీసం మట్టి రోడ్లు అయినా వేయాలని స్థానికులు కోరుతున్నారు.