టన్నుకు వెయ్యి!

ABN , First Publish Date - 2022-11-23T03:02:07+05:30 IST

ఇసుక, మద్యం, మైనింగ్‌, రీటెండరింగ్‌ వగైరా వగైరా అన్ని రకాల ‘వనరుల’ నుంచీ వాటాలు వస్తున్నాయి కాబోలు...

టన్నుకు వెయ్యి!

‘కప్పం’ కడితేనే లేటరైట్‌ అమ్మకం

విశాఖ ఏజెన్సీలోని వ్యాపారులకు అల్టిమేటం

ఖర్చు టన్నుకు 800.. అమ్మితే వచ్చేది 1,700

వెయ్యి కడితే టన్నుకు రూ.100 నష్టం

దిక్కుతోచక హైదరాబాద్‌లో బేరసారాలు

మరో మాట చెప్పాలని వేడుకున్న వ్యాపారులు

అదేం కుదరదు.. వెయ్యి కట్టాల్సిందే!

లేదా టన్ను రూ.700కు మాకే ఇచ్చేయండి

తేల్చిచెప్పిన పార్టీ నాయకుడి కుమారుడు

‘టన్ను లేటరైట్‌కు వెయ్యి చొప్పున కప్పం కట్టండి. లేదంటే... టన్ను రూ.700కు మాకే ఇచ్చేయండి!’... విశాఖ ఏజెన్సీలోని లేటరైట్‌ మైనింగ్‌ వ్యాపారులకు అధికార పార్టీ పెద్దలు ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌ ఇది! విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం దీని వెనుక నడిచిన తతంగమేమిటో మీరూ చూడండి!

‘‘లేటరైట్‌ నుంచి మనకు రూపాయి కూడా ఆదాయం రావడం లేదని అన్న అంటున్నాడు. ఆయన వాటా, మా వాటా కలిపి టన్నుకు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందే!’’

- మైనింగ్‌ వ్యాపారులకు అధికార పార్టీ నేత అల్టిమేటం

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): ఇసుక, మద్యం, మైనింగ్‌, రీటెండరింగ్‌ వగైరా వగైరా అన్ని రకాల ‘వనరుల’ నుంచీ వాటాలు వస్తున్నాయి కాబోలు! లేటరైట్‌ నుంచి మాత్రం ఎందుకు రావడం లేదు? అనే ప్రశ్న తలెత్తింది. అంతే... అధికార పార్టీ పెద్దల నుంచి లేటరైట్‌ వ్యాపారులకు ‘సందేశాలు’ వెళ్లాయి. ‘సరే... పెద్దలు పిలిచాక వెళ్లక తప్పదు. ఎంతోకొంత ఇచ్చుకుంటే మన తవ్వకాలకు, తరలింపులకు అడ్డంకులు ఉండవు కదా!’ అని వ్యాపారులు చర్చలకు వెళ్లారు. తీరా... లేటరైట్‌ నుంచి వాళ్లు ఆశిస్తున్న ‘మొత్తం’ చూసి కళ్లు బైర్లు కమ్మాయి. టన్నుకు వెయ్యి రూపాయలు తమకు కప్పం కట్టాలని హుకుం జారీ చేయడంతో విస్తుపోయారు. బయట మార్కెట్‌లో టన్ను లేటరైట్‌ రూ.1,600కు మించి అమ్ముడుపోవడం లేదని, వెయ్యి రూపాయలు పెద్దలకే కడితే తమకేం మిగులుతుందని వారంతా వాపోతున్నారు. దీనిపై మధ్యేమార్గంగా మరో మాట చెప్పాలని రాయ‘బేరాలు’ నడుపుతున్నారు.

తవ్వింది తరలించుకునేందుకు...

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో లేటరైట్‌ నిల్వలు భారీగా ఉన్నాయి. చింతపల్లి మండలం సిరిపురం, పెదజడుమూరు, చినరాజుపాకలు, బారికదొర పాకలు, గూడెం కొత్తవీధి మండలం చాపరాతిపాలెం, లక్కవరపాలెం, నాతవరం మండలాల్లో లేటరైట్‌ తవ్వకాలకు గతంలోనే అనుమతులు ఇచ్చారు. అవన్నీ కాగితాలపై గిరిజనుల పేరున ఉన్నా... నిర్వహణ అంతా బయటి నుంచి వచ్చిన గిరిజనేతర వ్యాపారులే చూస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘అన్నీ మాకే, అన్నీ మేమే’ అనే పాలసీ అమలు చేస్తున్న నేపథ్యంలో... ఏజెన్సీలో తమ నాయకుల వద్ద గనుల్లోనే లేటరైట్‌ తవ్వకాలు సాగేలా మంత్రాంగం నడిపించారు. మిగిలినచోట్ల తవ్వకాలను నిలిపి వేయించారు. అయితే... కొంతమంది వ్యాపారులు అధికార పార్టీ నేతలను, అధికారులను మచ్చిక చేసుకొని గుట్టుగా తవ్వకాలు సాగించారు. లేటరైట్‌ను కొండ ప్రాంతాల నుంచి కిందకు తీసుకువచ్చి, అనుకూలంగా ఉన్నచోట నిల్వ చేసుకున్నారు. అయితే, దానిని అమ్ముకునే అవకాశం మాత్రం లభించలేదు. లేటరైట్‌ను ఎక్కువగా సిమెంట్‌ పరిశ్రమల్లోనే ఉపయోగిస్తారు. అధికార పార్టీ పెద్దలకు సిమెంట్‌ పరిశ్రమలు ఉన్న సంగతి తెలిసిందే. ఏ కంపెనీకి ఎక్కడి నుంచి లేటరైట్‌ వస్తోందనే పూర్తి సమాచారం వారి దగ్గర ఉంది. దీంతో వ్యాపారులు వారి నిల్వలను అమ్ముకోవడం కుదరలేదు. ఇలా దాదాపు మూడేళ్ల నుంచి ఇతరులకు సంబంధించిన లేటరైట్‌ లావాదేవీలు నిలిచిపోయాయి. పెట్టుబడుల మీద రూపాయి కూడా రాకపోవడంతో వారంతా నష్టాల పాలయ్యారు.

వారం కిందట బేరం...

తవ్విపోసుకున్న లేటరైట్‌ను అమ్ముకోలేక సతమతమవుతున్న వ్యాపారులకు వారం కిందట అధికార పార్టీ పెద్దల నుంచి ఓ సమాచారం అందింది. ‘‘మీ దగ్గరున్న లేటరైట్‌ను ఎంచక్కా అమ్ముకోవచ్చు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కాకపోతే... టన్నుకు వెయ్యి రూపాయలు మాకు ఇవ్వాలి’’ అని మ్యాటర్‌ సూటిగా చెప్పేశారు. దీంతో లేటరైట్‌ వ్యాపారులకు షాక్‌ కొట్టినంత పనైంది. వారు చెబుతున్న ప్రకారం... తవ్విన ప్రతి టన్నుకు రూ.300 ప్రభుత్వానికి రాయల్టీగా చెల్లించాలి. లేటరైట్‌ను తవ్వి, మైదాన ప్రాంతానికి తరలించేందుకు టన్నుకు రూ.500 వరకు ఖర్చవుతుంది. అంటే... టన్నుకు రూ.800 ఖర్చు. ఇక్కడి ఏజెన్సీలో తవ్విన లేటరైట్‌కు సిమెంట్‌ కంపెనీలు టన్నుకు రూ.1600 నుంచి రూ.1,700 వరకు చెల్లిస్తున్నాయి. టన్నుకు ఖర్చు రూ.800, పెద్దలకు కప్పం వెయ్యి కడితే... టన్ను మీద రూ.వంద నష్టమొస్తుందని, ఇలాగైతే ఎలా వ్యాపారం చేస్తామని వాపోతున్నారు. దీనిపై వారంతా విశాఖ ప్రాంతంలో అధికార పార్టీ వ్యవహారాలు చూస్తున్న ఒక కీలక నేత కుమారుడిని హైదరాబాద్‌లో కలిశారు. తమ కష్టాలన్నీ వివరించారు. ‘అంత ఇచ్చుకోలేం. ఇంకో మాట చెప్పండి’ అని వేడుకున్నారు. ‘‘లేటరైట్‌ నుంచి ఆదాయం రావడం లేదని అన్న అంటున్నాడు. ఆయన వాటా, మా వాటా కలిపి టన్నుకు వెయ్యి ఇవ్వాల్సిందే’ అని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. అది కుదరకపోతే... టన్నుకు రూ.700 చొప్పున తామే ఇస్తామని, ఎవరి దగ్గర ఎంత లేటరైట్‌ ఉందో అంతా తమకే ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం!

Updated Date - 2022-11-23T03:02:08+05:30 IST