ఆలిండియా రైల్వే చెస్ చాంపియన్‌షిప్ టోర్నీ ప్రారంభం
ABN , First Publish Date - 2022-11-08T01:22:00+05:30 IST
తూర్పుకోస్తా రైల్వే స్పోర్ట్సు అసోసియేషన్ వాల్తేరు డివిజన్ నిర్వహిస్తున్న అఖిల భారత అంతర్ రైల్వే జోన్‌ల చెస్ చాంపియన్‌షిప్ టోర్నీ సోమవారం ప్రారంభమైంది
విశాఖపట్నం(స్పోర్ట్సు), నవంబరు 7: తూర్పుకోస్తా రైల్వే స్పోర్ట్సు అసోసియేషన్ వాల్తేరు డివిజన్ నిర్వహిస్తున్న అఖిల భారత అంతర్ రైల్వే జోన్‌ల చెస్ చాంపియన్‌షిప్ టోర్నీ సోమవారం ప్రారంభమైంది. రైల్వే ఇండోర్ స్పోర్ట్సు ఎన్‌క్లేవ్‌లో జరుగుతున్న ఈ పోటీలకు డీఆర్‌ఎం అనూప్‌కుమార్ శెత్పతీ ముఖ్య అతిఽథిగా హాజరై చెస్ బోర్డుపై తొలి ఎత్తు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుధీర్‌కుమార్ గుప్తా, సీసీఎం లువాంగ్, స్పోర్ట్సు ఆఫీసర్ ప్రవీణ్ భాటి, సీనియర్ డీఈ(కోఆర్డినేషన్) ఏకే మహారాణ, సహాయ క్రీడాధికారులు హరినాథ్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. కాగా వారం రోజులపాటు జరిగే ఈ టోర్నీలో భారతీయ రైల్వేలోని ఆతిథ్య తూర్పుకోస్తా రైల్వేతోపాటు ఉత్తర రైల్వే, దక్షిణ రైల్వే, పశ్చిమ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, సౌత్ ఈస్ట్రన్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, సౌత్ వెస్ట్రన్ రైల్వే, మెట్రో రైల్వే, నార్త్ వెస్ట్రన్ రైల్వే, రైల్వే వీల్ ఫ్యాక్టరీలకు చెందిన ఆటగాళ్లు 14 జట్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీపన్ చక్రవర్తి, ఆర్‌ఆర్ లక్ష్మణ్, ఎన్‌ఆర్ విశాఖ్, పి.కార్తికేయన్ వంటి గ్రాండ్ మాస్టర్లతోపాటు పి.శ్యామ్‌నిఖిల్ ఇంటర్నేషనల్ మాస్టర్లు పోటీ పడుతున్నారు. తొలిరోజు జరిగిన తొలి రౌండ్ పోటీల్లో ఆతిథ్య తూర్పుకోస్తా రైల్వే ఆటగాళ్లు నిరాశపరిచారు. సౌత్ సెంట్రల్ రైల్వేతో జరిగిన రౌండ్‌లో ఒక బోర్డు డ్రా చేయగా మిగిలిన మూడు బోర్డుల ఆటగాళ్లు ఓటమి చెంది కేవలం 0.5 పాయింట్లు మాత్రమే సాధించారు.
తొలి రౌండ్ ఫలితాలు:
సదరన్ రైల్వే, మెట్రో రైల్వే, వెస్ట్రన్ రైల్వే, నార్తన్ రైల్వే వరుస విజయాలతో తలో నాలుగు పాయింట్లు సాధించారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్), ఈస్ట్రన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే ఆటగాళ్లు తలో 3.5 పాయింట్స్ సాధించారు. సౌత్ వెస్ట్రన్ రైల్వే, సౌత్ ఈస్ట్రన్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే తలో 0.5 పాయింట్లతో సరిపెట్టుకోగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే, నార్త్ వెస్ట్ రైల్వే, రైల్ వీల్ ఫ్యాక్టరీ ఆటగాళ్లు ఓటమి చెంది జీరో పాయింట్‌కు పరిమితమయ్యారు.