‘ఇండో అమెరికన్‌’లో అనకాపల్లి కలెక్టరేట్‌

ABN , First Publish Date - 2022-02-16T06:11:54+05:30 IST

అనకాపల్లి, పాడేరు కేంద్రాలుగా ఏర్పాటుకానున్న జిల్లాల్లో కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాల ఏర్పాటుకు పలు భవనాలు పరిశీలించామని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

‘ఇండో అమెరికన్‌’లో అనకాపల్లి కలెక్టరేట్‌

ఆ ప్రాంగణంలోనే ఎస్పీ కార్యాలయం కూడా...

ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది

జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి

కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి ఐదారుచోట్ల స్థలాల పరిశీలన

ఐటీడీఏ పీవో కార్యాలయంలో పాడేరు కలెక్టరేట్‌


విశాఖపట్నం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి, పాడేరు కేంద్రాలుగా ఏర్పాటుకానున్న జిల్లాల్లో కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాల ఏర్పాటుకు పలు భవనాలు పరిశీలించామని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో విలేఖరులతో మాట్లాడుతూ అనకాపల్లిలో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలకు రేబాకలో కొత్తగా నిర్మించిన పాలిటెక్నిక్‌ కళాశాల భవనాలు, కశింకోటలో ఆర్‌ఈసీఎస్‌ భవనాలతోపాటు శంకరం సమీపంలోని ఇండో అమెరికన్‌ విద్యాసంస్థల సముదాయాలను పరిశీలించామన్నారు. ఆర్‌ఈసీఎస్‌ ప్రాంగణంలో పాలిటెక్నిక్‌ కళాశాల నడుస్తున్నందున మిగిలిన భవనాలు సరిపోవన్నారు. ఇండో అమెరికన్‌ విద్యాసంస్థల పరిధిలో రెండు సముదాయాలు వున్నందున కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలకు అనుకూలంగా ఉందన్నారు. అయితే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి పాడేరులో ఐటీడీఏ పీవో కార్యాలయంలో కలెక్టరేట్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారన్నారు. పీవో కార్యాలయం అక్కడకు సమీపంలోని శిక్షణ సంస్థ భవనంలోకి వెళుతుందని, ఇంకా వైటీసీ, ఇంకో శిక్షణ కార్యాలయ భవనాల్లో ఒకచోట ఎస్పీ కార్యాలయం ఏర్పాటుచేసే అవకాశం ఉందన్నారు. తొలుత కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటైన తరువాత మిగిలిన శాఖలు విశాఖ నుంచి తరలి వెళ్లాల్సి ఉంటుందన్నారు. కాగా అనకాపల్లిలో సమగ్ర కలెక్టరేట్‌కు 15 ఎకరాల స్థలం అవసరం కాగా ఇందుకు ఐదారుచోట్ల స్థలాలను పరిశీలించామన్నారు.  

ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించినట్టు జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. ధాన్యం తరలింపునకు సంచుల కొరత ఏమీ లేదన్నారు. ధాన్యాన్ని రైతులు నేరుగా మిల్లుకు తరలిస్తే చార్జీలు ఇస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులున్నట్టు ఫిర్యాదులు రావడంతో మూడు మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టామన్నారు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులుంటే తక్షణమే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని జేసీ సూచించారు. స్వర్ణ రకం ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదనే ఫిర్యాదుపై ఆయన స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. 



Updated Date - 2022-02-16T06:11:54+05:30 IST