TDP: అనితపై ఓవరాక్షన్!
ABN , First Publish Date - 2022-10-29T04:50:18+05:30 IST
రుషికొండలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి హాజరవుతారనే అనుమానంతో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితను పోలీసులు వెంబడించి మరీ అరెస్టు చేశారు.
పార్టీ కార్యాలయానికి నడిచి వెళ్తుండగా వెంబడించి మరీ వ్యాన్‌లో పడేసిన పోలీసులు
జాతీయ మహిళా కమిషన్‌కు అనిత ఫిర్యాదు
మానవ హక్కుల కమిషన్‌కు కూడా
విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రుషికొండలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి హాజరవుతారనే అనుమానంతో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితను పోలీసులు వెంబడించి మరీ అరెస్టు చేశారు. ఆమె నగరంలోని పెదవాల్తేరు డాక్టర్స్ కాలనీలో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సంధ్యారాణితో కలిసి పార్టీ కార్యాలయానికి బయలుదేరేందుకు సన్నద్ధమవుతుండగా.. ఎంవీపీ స్టేషన్ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో అక్కడకు వచ్చారు. ఇంటినుంచి బయటకు రావద్దంటూ నోటీసివ్వడానికి యత్నించగా తీసుకునేందుకు ఆమె నిరాకరించారు. తాము పార్టీ కార్యాలయానికి వెళ్తున్నామం టూ కారెక్కారు. పోలీసులు అడ్డుకోవడంతో అనిత, సంధ్యారాణి కారు దిగి నడుచుకుంటూ బయల్దేరారు. పోలీసులు వారిని అనుసరించి.. వ్యానెక్కాలని పదేపదే హెచ్చరించారు. ఏయూ ప్రధాన ద్వారం వద్ద వచ్చేసరికి పోలీసులు అనితను చుట్టుముట్టి వ్యాన్‌లోకి బలవంతంగా నెట్టేశారు. దీనిపై ఆమె అక్కడే నిరసన తెలిపారు. సంధ్యారాణి తప్పించుకుని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తర్వాత అనితను కైలాసగిరిలో పోలీస్ బ్యారెక్స్ కల్యాణమండపానికి తరలించారు.
సాయంత్రం 4 గంటల సమయంలో అనితతో పాటు మిగిలిన నాయకులు కల్యాణ మండపం ఎదురుగా ఆందోళనకు దిగడంతో వారిని పోలీస్ కమిషనరేట్‌లోని స్టేడియం వద్ద ఉన్న కల్యాణ మండపానికి తీసుకొచ్చి రాత్రి 7గంటల సమయంలో విడిచిపెట్టారు. పోలీసుల తీరును అనిత తీవ్రంగా ఖండించారు. కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తుంటే వెంబడించి బలవంతంగా వ్యాన్ ఎక్కించిన తీరుపై జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశానన్నారు. పోలీసులపై ప్రైవేటు కేసు వేస్తున్నట్లు తెలిపారు.