అయ్యప్ప దీక్షలో ఉండి ముస్లిం టోపీ ధరిస్తారా?
ABN , First Publish Date - 2022-11-26T02:50:15+05:30 IST
అయ్య ప్ప దీక్షలో ఉండి ముస్లిం టోపీ ధరిస్తారా? వెంటనే హిందువులకు, అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెప్పాలి’ అని బీజేవైఎం నాయకులు మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి అనిల్ క్షమాపణ చెప్పాలి
ఇంటి ఎదుట బీజేవైఎం కార్యకర్తల నిరసన
వారిపై ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం
పోలీసుల సమక్షంలోనే రాళ్లదాడి.. స్టేషన్‌కు బీజేవైఎం నేతల తరలింపు
నెల్లూరు (స్టోన్‌హౌ్‌సపేట), నవంబరు 25: ‘అయ్య ప్ప దీక్షలో ఉండి ముస్లిం టోపీ ధరిస్తారా? వెంటనే హిందువులకు, అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెప్పాలి’ అని బీజేవైఎం నాయకులు మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాల ధరించిన ఆయన.. ముస్లింలు ధరించే టోపీని తలపై పెట్టుకుని.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ నెల 17వ తేదీన నగరంలోని బట్వాడిపాలెం ప్రాంతంలో ఇస్తిమా ప్రార్థనల్లోనూ పాల్గొన్నారు. దీనిపై శుక్రవారం బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్‌సింగ్ ఆధ్వర్యంలో నాయకులు ఆయన ఇంటి ముందు బైఠాయించారు. ఎమ్మెల్యే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని, వెంటనే ఆయన హిందువులకు, అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని ప్రధాన నాయకులను పోలీసు స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా...
ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు శ్రావణ్‌కుమార్ అక్కడకు చేరుకున్నారు. బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే బీజేవైఎం నాయకులపైన, అయ్యప్ప భక్తులపైనా రాళ్ల దాడికి దిగారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని నెట్టుకుని ముందుకు దూకారు. వినలేని భాషలో అసభ్యంగా బూతులు తిట్టారు. కర్ర చేతబట్టుకుని కొట్టడానికి పరుగులు తీశారు. పోలీసులు ఆయన్ను అడ్డుకుని బీజేవైఎం నాయకులను దర్గామిట్ట స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు జి.భరత్‌కుమార్ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. దీంతో కొద్దిసేపటికి బీజేవైఎం నాయకులను పోలీసులు విడుదల చేశారు. తమ కార్యకర్తలపై రాళ్ల దాడిని ఖండిస్తున్నామని, రాకులను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.