పెరిగిన గంజాయి ఘాటు!

ABN , First Publish Date - 2022-12-29T00:51:21+05:30 IST

జిల్లాలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు, హత్య కేసులు స్వల్పంగా తగ్గడం ఊరటనిచ్చిన అంశమైనా, గంజాయి కేసులు, సైబర్‌ నేరాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. జిల్లాలో పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో హత్యలు, హత్యాయత్నం, బ్యాంకు దోపిడీలు, పిల్లలపై అఘాయిత్యాలు, ఇళ్లల్లో దొంగతనాలు, వాహనాల చోరీలు జరిగాయి. కొన్ని కేసులు ఏడాది పొడవునా దర్యాప్తు స్థాయిలోనే ఉండిపోయాయి. పలు కేసుల్లో ఇప్పటికీ పురోగతి లేదు. జిల్లా పోలీసులు బుధవారం మీడియాకు విడుదల చేసిన వార్షిక నివేదికలోని వివరాలను పరిశీలిస్తే...

పెరిగిన గంజాయి ఘాటు!
అనకాపల్లి మండలం కోడూరులో గంజాయి దహనం చేస్తున్న దృశ్యం (ఫైల్‌ ఫొటో)

- ఈ ఏడాది అధికంగా కేసులు నమోదు

- సైబర్‌ నేరాలు, డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు కూడా...

- స్వల్పంగా తగ్గిన హత్య కేసులు, రోడ్డు ప్రమాదాలు

- పలు కేసుల దర్యాప్తులో కానరాని పురోగతి

అనకాపల్లి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు, హత్య కేసులు స్వల్పంగా తగ్గడం ఊరటనిచ్చిన అంశమైనా, గంజాయి కేసులు, సైబర్‌ నేరాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. జిల్లాలో పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో హత్యలు, హత్యాయత్నం, బ్యాంకు దోపిడీలు, పిల్లలపై అఘాయిత్యాలు, ఇళ్లల్లో దొంగతనాలు, వాహనాల చోరీలు జరిగాయి. కొన్ని కేసులు ఏడాది పొడవునా దర్యాప్తు స్థాయిలోనే ఉండిపోయాయి. పలు కేసుల్లో ఇప్పటికీ పురోగతి లేదు. జిల్లా పోలీసులు బుధవారం మీడియాకు విడుదల చేసిన వార్షిక నివేదికలోని వివరాలను పరిశీలిస్తే...

ఆగని గంజాయి రవాణా

జిల్లాలో 2022లో గంజాయి అక్రమ రవాణా కేసులు 273 నమోదయ్యాయి. సుమారు 24,312 కిలోల గంజాయి, 15 లీటర్ల ద్రవపు గంజాయి, చరస్‌ 12.5 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో 597 మందిని అరెస్టు చేశారు. గంజాయి రవాణాకు వినియోగించిన 157 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోతో కలిసి 2022లో గంజాయి రవాణా కేసులు 24 నమోదు చేసి, 5,605 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో 60 మందిని అరెస్టుచేసి రవాణాకు వినియోగించిన 28 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా నిర్మూలనలో భాగంగా 2022లో 697 కేసులు నమోదు చేశారు. సుమారు 3,821 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఉమ్మడి ఆధ్వర్యంలో 1974 నాటుసారా కేసులు నమోదు చేసి, సుమారు 9,546 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 5,24,330 లీటర్ల బెల్లం పులుసును ధ్వంసం చేశారు.

పెరిగిన సైబర్‌ నేరాలు

అనకాపల్లి జిల్లాలో నేరాల సంఖ్యను పరిశీలిస్తే 2022లో సైబర్‌ నేరాలు ఎక్కువగానే నమోదయ్యాయి. 2021 సంవత్సరంలో వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 39 సైబర్‌ నేరాలు జరిగినట్టు కేసులు నమోదు కాగా, 2022లో ఆ సంఖ్య 59కి చేరింది. ఎక్కువగా లోన్‌ యాప్‌లతో రుణాలు చెల్లిస్తామని, ఫేస్‌బుక్‌, ఆన్‌లైన్‌ వెబ్‌పోర్టల్‌ ద్వారా మోసపోయిన నేరాల కేసులు నమోదయ్యాయి. సైబర్‌ నేరాల నియంత్రణకు మహిళా పోలీసులతో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నా తగ్గుముఖం పట్టలేదు.

స్వల్పంగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గతేడాదితో పోల్చి చూస్తే తగ్గాయి. 2021లో రోడ్డు ప్రమాదాలు 341 జరగ్గా, 347 మంది మృతి చెందారు. 2022లో రోడ్డు ప్రమాదాలు 314 జరిగాయి. 333 మంది మృతి చెందారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా పోలీసులు 37 బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించి స్టాప్‌ బోర్డులు, సైన్‌ బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. పోలీసుల భద్రతా చర్యల వల్ల రోడ్డు ప్రమాదాల కేసులు గతేడాది కంటే తగ్గాయి.

హత్యలు, హత్యాయత్నం కేసులు తగ్గుదల

గతేడాదితో పోలిస్తే 2022 సంవత్సరంలో హత్యలు, లాభాపేక్ష హత్యలు, హత్యాయత్నాలు, తీవ్రమైన గాయాలు, సాధారణ గాయాల కేసుల నమోదు తక్కువే. 2021లో జిల్లాలో 16 హత్యలు జరగ్గా, 2022లో 13 హత్య కేసులు నమోదయ్యాయి. చాలా వరకు కుటుంబ తగాదాలు, వివాహేతర సంబంధాల కారణంగానే హత్యలు జరిగాయి. కుట్రపూరితంగా 2021లో రెడు హత్యలు జరిగినట్టు కేసులు నమోదు కాగా, 2022లో ఈ తరహా కేసులు రెండు నమోదయ్యాయి. 2021లో హత్యాయత్నం కేసులు 45 నమోదు కాగా, 2022లో వివిధ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 30 నమోదయ్యాయి. కొట్లాటలు, ఇరువర్గాల ఘర్షణల కారణంగా తీవ్ర గాయాలపాలైన కేసులు 2021లో 478 నమోదు కాగా, 2022లో 453 నమోదయ్యాయి. స్వల్ప గాయాల కేసులు 2021లో 76 కాగా, 2022లో 54 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొత్తమ్మీద హత్య, హత్యాయత్నం నేరాలు గతేడాదితో పోలిస్తే తగ్గుదల కనిపించింది.

భారీగా పెరిగిన డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు

జిల్లాలో వివిధ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో గతేడాదితో పోలిస్తే డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు భారీగా పెరిగాయి. జిల్లాలో 2021లో ఈ కేసులు 74కే పరిమితం కాగా, 2022లో 2,645 కేసులు నమోదయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై 2021లో 2321 కేసులు నమోదు కాగా, 2022లో ఏకంగా 7,597 కేసులు నమోదయ్యాయి.

చోరీ కేసుల్లో కానరాని పురోగతి

జిల్లాలో 2022లో దొంగతనాల కేసులు భారీగానే నమోదయ్యాయి. అనకాపల్లి మండలం తుమ్మపాలలో ఆరు నెలల కిందట ఒకేరోజు ఆరు ఇళ్లల్లో చోరీ జరిగింది. ఈ కేసులో నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదు. అదే విధంగా 2022 ఏప్రిల్‌ నెలలో కశింకోట మండలం జాతీయ రహదారికి సమీపంలో ఉన్న నర్సింగబిల్లి ఏపీ గ్రామీణ వికాస బ్యాంకులో చోరీ జరిగింది. దుండగుడు బైక్‌మీద దర్జాగా వచ్చి తుపాకీతో బ్యాంకు సిబ్బందిని బెదిరించి రూ.3.31 లక్షలు ఎత్తుకెళ్లాడు. ఈ కేసు విషయంలో పురోగతి లేదు. వివిధ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 389 చోరీ కేసులు నమోదయ్యాయి. 193 కేసులను ఛేదించి రూ.2.26 కోట్లు రికవరీ చేశారు.

మిగతా కేసుల్లోనూ అంతే..

మునగపాక మండలంలో రెండు నెలల కిందట ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అయితే దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా ఆ కేసు దర్యాప్తులో పురోగతి లేదు. అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామానికి చెందిన మైనర్‌ అదృశ్యమైంది. ఈ కేసులో పురోగతి కనిపించకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. రావికమతం మండలంలో మైనర్‌ను తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని స్వయంగా అతని భార్య ఫిర్యాదు చేసింది. దీనిపై కూడా చర్యలు లేవు.

Updated Date - 2022-12-29T00:51:22+05:30 IST