నోవాటెల్‌లో గంటా ప్రత్యక్షం.. అక్కడే పవన్‌కల్యాణ్... రాజకీయ వర్గాల్లో చర్చ
ABN , First Publish Date - 2022-11-12T21:09:32+05:30 IST
విశాఖపట్నం (Visakhapatnam)లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటనకు రావడంతో వైసీపీ, బీజేపీ (YCP BJP) శ్రేణులు కొద్దిరోజులుగా ఇక్కడే మకాం వేసి ఉన్నాయి.
విశాఖపట్నం: విశాఖపట్నం (Visakhapatnam)లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటనకు రావడంతో వైసీపీ, బీజేపీ (YCP BJP) శ్రేణులు కొద్దిరోజులుగా ఇక్కడే మకాం వేసి ఉన్నాయి. ప్రధాని కార్యాలయం నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan)కు ఫోన్ రావడంతో ఆయన శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం వచ్చి నేవీ గెస్ట్‌హౌస్‌లో ప్రధాని మోదీని కలిశారు. బీజేపీకి వ్యక్తులు ముఖ్యం కాదని, రాష్ట్ర అభివృద్ధే ప్రధానమని ఆయన చెప్పారని, ఆ విధంగా తాము ముందుకు వెళతామని పవన్‌కల్యాణ్ వెల్లడించారు. ఆయన నోవాటెల్‌లో బస చేశారు. రెండు రోజులు ఇక్కడే ఉండాలని వచ్చారు.
ఇదిలావుండగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) శనివారం మధ్యాహ్నం నోవాటెల్‌లో కనిపించారు. పవన్‌కల్యాణ్ బస చేసిన ఐదో అంతస్థులోకి ఆయన వెళ్లారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇద్దరూ సమావేశమైనట్టు ప్రచారం జరిగింది. దీనిపై గంటా వర్గాన్ని సంప్రతిస్తే...బీజేపీ నాయకులు టీజీ వెంకటేశ్ లంచ్‌కు పిలిచారని, అందుకే నోవాటెల్‌కు వెళ్లారని సమాధానమిచ్చారు. గంటా శ్రీనివాసరావు శనివారం ఉదయం బీజేపీ నాయకులు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లతో హోటల్ రాడీసన్‌లో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు వెళ్లారు. ఆ తరువాత లంచ్ మీటింగ్‌కు నోవాటెల్‌కు వెళ్లారు. ఇందులో ఏమైనా రాజకీయాలు ఉన్నాయా? అని అంతా ఆరా తీస్తున్నారు.