పంట పొలాల్లో చేపల చెరువులు
ABN , First Publish Date - 2022-12-04T00:32:47+05:30 IST
ప్రజలు రోగాలబారిన పడితే మాకేంటి.. మా ఒక్కరి వల్లే భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయా? డబ్బు సంపాదన మాకు ముఖ్యం.. ఇదీ జిల్లాలో అనుమతులు లేకుండా చేపల చెరువులు ఏర్పాటు చేసిన నిర్వాహకుల తీరు. వ్యవసాయ భూముల్లో ఎడాపెడా చేపల చెరువుల తవ్వేస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పంట కాలువల నుంచి అక్రమంగా చేపల చెరువులకు నీరు మళ్లిస్తున్నారు. చేపలకు ఆహారంగా మాంసం వ్యర్థాలను వేస్తున్నారు. చేపలు పట్టిన తరువాత వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా గెడ్డలు, వాగుల్లోకి విడిచిపెడుతున్నారు. ఈ తరహా చేపల చెరువులు మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలో అధికంగా వున్నాయి. కానీ సంబంధిత అధికారులు చేపల చెరువులవైపు కన్నెత్తి అయినా చూడడం లేదని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
నిబంధనలకు పాతరేస్తున్న పెంపకందారులు
అధిక కౌలు పేరుతో రైతుల నుంచి దీర్ఘకాలిక లీజుకు భూములు
పంట పొలాల్లో అక్రమంగా చెరువుల తవ్వకం
రైవాడ పంట కాలువ నుంచి నీరు మళ్లింపు
చేపలకు ఆహారంగా మాంసం వ్యర్థాలు
చుట్టుపక్కల పంట పొలాల్లోకి కలుషిత నీరు
చేపలు పట్టిన తరువాత పంట కాలువలోకి వ్యర్థ జలాలు విడుదల
పర్యావరణానికి తూట్లు... జనం ఆరోగ్యంతో ఆటలు
బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ప్రజలు రోగాలబారిన పడితే మాకేంటి.. మా ఒక్కరి వల్లే భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయా? డబ్బు సంపాదన మాకు ముఖ్యం.. ఇదీ జిల్లాలో అనుమతులు లేకుండా చేపల చెరువులు ఏర్పాటు చేసిన నిర్వాహకుల తీరు. వ్యవసాయ భూముల్లో ఎడాపెడా చేపల చెరువుల తవ్వేస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పంట కాలువల నుంచి అక్రమంగా చేపల చెరువులకు నీరు మళ్లిస్తున్నారు. చేపలకు ఆహారంగా మాంసం వ్యర్థాలను వేస్తున్నారు. చేపలు పట్టిన తరువాత వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా గెడ్డలు, వాగుల్లోకి విడిచిపెడుతున్నారు. ఈ తరహా చేపల చెరువులు మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలో అధికంగా వున్నాయి. కానీ సంబంధిత అధికారులు చేపల చెరువులవైపు కన్నెత్తి అయినా చూడడం లేదని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చాలంటే నిబంధనల ప్రకారం పలు ప్రభుత్వ శాఖలకు దరఖాస్తులు చేసుకోవాలి. తొలుత ఆయా భూములను అధికారులు సందర్శించాలి. నీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు? చేపల పట్టుబడి అనంతరం చెరువును ఖాళీ చేయడానికి వ్యర్థ జలాలను బయటకు ఎలా పంపుతారు? ఆ నీటి వల్ల భూగర్భ జలాలు కలుషితం అయ్యే ప్రమాదం వుందా? తదితర విషయాలను పరిశీలించాలి. అనంతరం పరిసర గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. అందరి ఆమోదం పొందినట్టు తీర్మానం చేయాలి. దీనిని మత్స్యశాఖ ద్వారా జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపాలి. అనంతరం చేపల చెరువుల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి. కానీ దేవరాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎటువంటి నిబంధనలు పాటించకుండా, ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందకుండా పంట భూములను చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. చేపల వ్యాపారానికి విశాఖ నగరం ప్రధాన మార్కెట్ కావడంతో గోదావరి జిల్లాల నుంచి వచ్చిన పలువురు చేపల పెంపకందారులు మండలంలోని కొత్తపేట, ఎం.అలమండ, తారువ, చేనులపాలెం, పెదనందిపల్లి, కొలిగొట్ల, బోయిల కింతాడల్లో రైతుల నుంచి పంట భూములను దీర్ఘకాలం లీజు (కౌలు)కు తీసుకుని చేపల చెరువులు తవ్వారు. ఒక్కో ఎకరాకు ఏటా రూ.50 వేల చొప్పున కౌలు చెల్లిస్తుండడంతో పలువురు రైతులు తమ భూములను చేపల చెరువులకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. చేపల పెంపకందారులు రైవాడ జలాశయం నుంచి పంట పొలాలకు సరఫరా అయ్యే నీటిని చెరువులకు మళ్లిస్తున్నారు.
స్థానికులు వ్యతిరేకిస్తున్నా....
కొలగొట్ల గ్రామంలో వ్యవసాయ భూముల్లో చేపల చెరువులు ఏర్పాటు చేయడాన్ని గతంలో స్థానికులు వ్యతిరేకించారు. చేపల చెరువులకు పరిసరాల్లో వున్న తమ భూములు పాడైపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైవాడ పంట కాలువ నుంచి చేపల చెరువులకు అక్రమంగా నీటిని మళ్లిస్తున్నారని, చేపలు పట్టిన తరువాత వ్యర్థ జలాలను తిరిగి పంట కాలువలోకి వదులుతున్నారని అధికారులకు ఫిర్యాదులు చేశారు. చేపలు త్వరగా పెరగడానికి, మేత ఖర్చు తగ్గించుకోవడానికి మాంసం వ్యర్థాలను ఆహారంగా వేస్తున్నారని ఆరోపించారు. అప్పట్లో విచారణ జరిపిన మత్స్య, రెవెన్యూ శాఖల అధికారులు.. చేపల చెరువుల ఏర్పాటుకు ఎటువంటి అనుమతులు లేవని ఉన్నతాధికారులకు నివేదించారు. కానీ చేపల చెరువుల నిర్వాహకులపై ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
చేపల పెంపకాలకు ఎక్కడా అనుమతులు లేవు...
లక్ష్మణరావు, ఏడీ, మత్స్యశాఖ, అనకాపల్లి జిల్లా
దేవరాపల్లి మండలంలో వ్యవసాయ భూముల్లో చెరువులు తవ్వి, చేపల పెంపకానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ పంట పొలాలను చేపల చెరువులుగా మార్చాలంటే తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆయా శాఖల అధికారులు భూములను పరిశీలించి, గ్రామ సభలు నిర్వహించిన అనంతరం కలెక్టర్‌కు నివేదిక ఇస్తారు. కలెక్టర్ ఆమోదిస్తేనే చేపల చెరువులు ఏర్పాటు చేయాలి. దేవరాపల్లి మండలంలో అనుమతులు లేని చేపల చెరువులపై అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతున్నది. నివేదిక ఆధారంగా చర్యలు వుంటాయి.