సొమ్మొకరిది... సోకొకరిది!
ABN , First Publish Date - 2022-12-26T01:21:09+05:30 IST
‘అత్తసొమ్ముతో అల్లుడు సోకులు’ అన్న చందంగా మారింది రాష్ట్రంలోని పరిస్థితి.
కేంద్రం డబ్బుతో పేరు కోసం సీఎం పాకులాట
పేదోడి కాలనీల ఎదుట స్వాగత ద్వారాల నిర్మాణం
ఒక్కో ద్వారానికి రూ.నాలుగు లక్షలు ఖర్చు
జిల్లాలో 15 కాలనీలకు రూ.60 లక్షలు విడుదల
నిర్మాణాలపై హౌసింగ్ అధికారుల తర్జనభర్జన
విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
‘అత్తసొమ్ముతో అల్లుడు సోకులు’ అన్న చందంగా మారింది రాష్ట్రంలోని పరిస్థితి. ప్రధానమంత్రి ఆవాస్‌యోజన కింద మంజూరైన ఇళ్ల కాలనీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేరుతో స్వాగత ద్వారాలు ఏర్పాటుచేసి ప్రచారం చేసుకోవడానికి తాజాగా తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. అయితే ఈ ద్వారాల నిర్మాణానికి నిధులు లేక గృహనిర్మాణశాఖ ఉన్నతాధికారులు తంటాలు పడుతున్నారు.
ప్రతి కాలనీలో ఇంటి నిర్మాణానికి రూ. 1.8లక్షలు చొప్పున కేటాయించగా, అందులో సింహభాగం కేంద్రం నిధులే. కానీ ఆ ఇళ్లకు ఇప్పటికే జగనన్న కాలనీలనే పేరు పెట్టిన ప్రభుత్వం ఒక్కో కాలనీ ఎదుట స్వాగత ద్వారానికి రూ.4 లక్షల చొప్పున వెచ్చించాలని నిర్ణయించింది. అయితే అధికారులు నిర్ణయించిన కొలతల మేరకు స్వాగత ద్వారం నిర్మించడానికి ఈ నిధులు చాలని ఇంజనీర్లు చెబుతున్నారు. అయినప్పటికీ అదిరిపోయేలా స్వాగత ద్వారాలు నిర్మించాలని ఆదేశాలు అందడంతో తలలు పట్టుకుంటున్నారు.
రాష్ట్రంలో గూడులేని పేదలకు నిర్మిస్తున్న ఇళ్లకు రూ.1.8 లక్షలు చొప్పున అందిస్తుండగా, ఇందులో కేంద్రం వాటా రూ.1.5 లక్షలు. కేవలం రూ.30వేలు మాత్రమే రాష్ట్రప్రభుత్వం భరిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు ఆ నిధులను కూడా రాష్ట్రం ఇవ్వడంలేదు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కేంద్రం విడుదల చేస్తున్న నిధులను ఇళ్ల లబ్ధిదారులకు లేబర్ చార్జీలుగా దారి మళ్లిస్తోంది. ఈరకంగా చూస్తే ఇళ్ల నిర్మాణానికి మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తున్నట్టే. ఈ నేపథ్యంలో ఆయా కాలనీలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ సముదాయం అని పేరు పెట్టాల్సి ఉంటుంది. లేదంటే ప్రధాని, సీఎం పేర్లతో నామకరణం చేయాలి. దానికి పూర్తి భిన్నంగా మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నట్టుగా మభ్యపెట్టి, ‘వైఎస్సార్ జగనన్న హౌసింగ్‌కాలనీ’ అని పేరు పెట్టడమేకాకుండా రూ.లక్షలు పోసి భారీ స్వాగత ద్వారాలు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశిం చింది. ప్రతి కాలనీ ముందు నిర్మించనున్న స్వాగత ద్వారానికి రూ.నాలుగు లక్షలతో ప్రతిపాదించింది. విచిత్రమేమిటంటే....
జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లో 138 లేవుట్‌లలో తొలివిడతగా 15 కాలనీల్లో స్వాగత ద్వారాలు నిర్మించాలని గృహనిర్మాణశాఖ ఉన్నతాధికా రులు ఆదేశించారు. అధికారులు నిర్దేశించిన రీతిలో నిర్మించేందుకు ఈ నిధులు చాలవని, రూ.6 నుంచి రూ.7 లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని ఇంజనీర్లు అంచనావేస్తున్నారు. కాగా జిల్లాలో 15 స్వాగత ద్వారాల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.60 లక్షలు కేటాయించినట్టు హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ పి. శ్రీనివాసరావు తెలిపారు. ఆనందపురం, వెల్లంకి, ఎస్‌ఆర్.పురం తదితర ప్రాంతాల్లో తొలివిడతగా వీటిని నిర్మిస్తామన్నారు.