లేఅవుట్!
ABN , First Publish Date - 2022-12-16T01:14:29+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం తీసుకున్న నిర్ణయంతో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఆదాయం గణనీయంగా పడిపోయింది.
ప్రభుత్వ నిబంధనతో కొత్త వెంచర్లు వేసేందుకు
ముందుకురాని రియల్టర్లు
మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమి ప్రభుత్వానికి అప్పగించాలని ఏడాది కిందట ఉత్తర్వులు
అలా కుదరకపోతే లేఅవుట్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలో భూమి సేకరించి ఇవ్వాలని ఆదేశం
....అది కూడా కుదరదంటే గజాల చొప్పున లెక్కగట్టి నగదు చెల్లించాల్సిందే
అప్పటినుంచి వీఎంఆర్‌డీఏకు తగ్గిన దరఖాస్తులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం తీసుకున్న నిర్ణయంతో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఆదాయం గణనీయంగా పడిపోయింది. రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఎవరైనా లేఅవుట్ వేస్తే...మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమి ప్రభుత్వానికి అప్పగించాలని గత ఏడాది డిసెంబరులో పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అందులో ‘వైఎస్‌ఆర్ జగనన్న కాలనీలు’ ఏర్పాటుచేసి పేదలకు ఇస్తామని పేర్కొంది. ఆయా లేఅవుట్లలో తగిన స్థలం లేకపోతే...దానికి కనీసం మూడు కిలోమీటర్ల పరిధిలోనైనా భూమి సేకరించి ఇవ్వాలని సూచించింది. అదీ కుదరకపోతే...ఆ 5 శాతం భూమికి గజాల చొప్పున రిజిస్ర్టేషన్ విలువ ప్రకారం నగదు చెల్లించాలని పేర్కొంది. ఈ నిబంధన ఆర్థిక భారం కావడంతో రియల్టర్లు కొత్త లేఅవుట్లు వేయడానికి ముందుకు రావడం లేదు. అప్పటినుంచి ప్రభుత్వంతో సంప్రతింపులు జరుపుతున్నారు. దీనివల్ల తమకు నష్టాలు వస్తాయని, ఈ నిబంధన ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని వారంతా వేచి చూస్తున్నారు. ఏడాది అయింది. ఎటువంటి నిర్ణయం వెలువడలేదు.
వీఎంఆర్‌డీఏకు అద్దెలు, లీజులు కాకుండా లేఅవుట్లకు ఇచ్చే అనుమతుల ద్వారా (ఫీజు రూపేణా)నే అధిక ఆదాయం వస్తుంది. ఎలా లేదన్నా ప్లానింగ్ విభాగం నెలకు కనీసం ఐదు చొప్పున ఏడాదికి 50 లేఅవుట్లకు తక్కువ లేకుండా అనుమతులు ఇస్తూ వస్తోంది. వీటి వల్ల ఏడాదికి కనీసం రూ.20 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. గత ఏడాది కాలం నుంచి లేఅవుట్ల వల్ల ఎటువంటి ఆదాయం లేదు. అసలు దరఖాస్తులే రావడం లేదు. గతంలోనే దరఖాస్తు చేసి, తప్పనిసరిగా లేఅవుట్ వేయాల్సిన వారు మాత్రమే వీఎంఆర్‌డీఏ గుమ్మం తొక్కుతున్నారు.
గజాల లెక్కన కోర్టులో నగదు జమ
ఎవరైనా ఒప్పందాల గడువు ముగిసిపోతుందనే భయంతో తప్పనిసరిగా లేఅవుట్‌కు దరఖాస్తు చేస్తే...వారు ఆ 5 శాతానికి సరిపడా సొమ్ము కోర్టులో జమ చేయాల్సి వస్తోంది. అది కూడా గజాల లెక్కన కట్టాల్సి వస్తోంది. ఉదాహరణకు ఒక సంస్థ 20 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ వేస్తే అందులో ఎకరా స్థలం ‘వైఎస్‌ఆర్ జగనన్న కాలనీ’కి ఇవ్వాలి. తక్షణమే దానికి అనుమతి కావాలంటే..కోర్టులో ఆ ఎకరా భూమిని గజాల లెక్కన లెక్కించి (4,800 గజాలు) ఆ ప్రాంతంలో ప్రభుత్వ ధర ఎంత వుంటే అంత డబ్బు కట్టాలి. ప్రస్తుతం ఎక్కడా గజం పది వేలకు తక్కువ లేదు. అలా చూసుకుంటే కోర్టులో రూ.4.8 కోట్లు చెల్లించాలి. అదంతా వైట్‌మనీగా లెక్కల్లో చూపించాలి. ఈ తిప్పలన్నీ పడలేక రియల్టర్లు ప్రభుత్వం ఆ నిబంధన ఉపసంహరించుకునేంత వరకు లేఅవుట్లకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారు. దాంతో వీఎంఆర్‌డీఏకి ఆదాయం లేకుండా పోయింది. ఇదే అదనుగా భావించి, చాలామంది ఎటువంటి అనుమతులు లేకుండానే లేఅవుట్లు వేసి, తక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు. ఆ తరువాత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ఎలాగూ ప్రకటిస్తుంది కాబట్టి...అప్పుడు కొనుగోలుదారులే ఆ మొత్తాలు కట్టుకుంటున్నారని గుట్టుగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ విధంగాను వీఎంఆర్‌డీఏకి ఆదాయం లేకుండా పోతోంది.