పాడేరు ఘాట్‌ రోడ్డుకు కొత్త కళ

ABN , First Publish Date - 2022-04-13T06:04:26+05:30 IST

స్థానిక ఘాట్‌ రోడ్డుకు కొత్త కళ వచ్చింది. ఘాట్‌ రోడ్డు అభివృద్ధిలో భాగంగా ఇటీవల ఘాట్‌లోని ముఖ్యమైన మలుపులున్న ప్రాంతాల్లో కొత్తగా తారురోడ్డు వేశారు.

పాడేరు ఘాట్‌ రోడ్డుకు కొత్త కళ
వంట్లమామిడికి సమీపంలో తారురోడ్డు


పాడేరు, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఘాట్‌ రోడ్డుకు కొత్త కళ వచ్చింది. ఘాట్‌ రోడ్డు అభివృద్ధిలో భాగంగా ఇటీవల ఘాట్‌లోని ముఖ్యమైన మలుపులున్న ప్రాంతాల్లో కొత్తగా తారురోడ్డు వేశారు. దీంతో ఘాట్‌రోడ్డు ప్రయాణం మరింత సుఖమయంగా మారింది. పాడేరుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మినుములూరు నుంచి వి.మాడుగుల మండలం గరికిబంద వరకు 22 కిలోమీటర్ల ఘాట్‌ రోడ్డు ఉంది. దీనిలో అధికంగా మలుపులున్న మార్గం వంట్లమామిడి గ్రామం నుంచి వ్యూపాయింట్‌ వరకు ఉన్న రోడ్డే. దీంతో ఈ రోడ్డును మరింత మెరుగ్గా అభివృద్ధి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు గతేడాది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 

రూ.2.85 కోట్ల తారురోడ్డు నిర్మాణం

స్థానిక ఘాట్‌ మార్గంలో వంట్లమామిడి నుంచి వ్యూపాయింట్‌ వరకు ఉన్న 8.5 కిలోమీటర్ల రోడ్డు కీలకమైంది. చాలా కాలంగా ఈ రోడ్డుకు ఎటువంటి నిర్వహణ చేపట్టకపోడంతో గతుకులతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉండేది. ఆ మార్గంలో గత నెలలో రూ.2.85 కోట్లతో కొత్తగా తారురోడ్డు వేశారు. దీంతో ఘాట్‌ రోడ్డు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉంది. 


Updated Date - 2022-04-13T06:04:26+05:30 IST