28న మూడు రాజధానుల కేసు విచారణ

ABN , First Publish Date - 2022-11-15T03:43:08+05:30 IST

మూడు రాజధానుల కేసుపై ఈ నెల 28న విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

28న మూడు రాజధానుల కేసు విచారణ

విభజన పిటిషన్లనువిడిగా విచారిస్తాం: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల కేసుపై ఈ నెల 28న విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లతో సంబంధం లేకుండా మూడు రాజధానుల పిటిషన్లపై విచారణ జరుపుతామని తెలిపింది. ఈ రెండు అంశాల పిటిషన్లను వేరు చేసింది. అమరావతియే ఏకైక రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం... తీర్పును అమలు చేయించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి... మూడు రాజధానులను సమర్థిస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మాజీ సీఎం ఎన్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి, వైసీపీ ఎంపీ రఘురామరాజు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు... మొత్తం కలిపి 36 పిటిషన్లు సోమవారం నాడు న్యాయమూర్తులు జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చాయి. విచారణ సందర్భంగా ఈ కేసులో ఏమేమి అంశాలు ఉన్నాయి?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ స్పందిస్తూ... ‘‘చట్టం చేయకుండా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీని హైకోర్టు ఇచ్చిన తీర్పు నిరోధించింది.

శాసన వ్యవస్థ చట్టాలు చేయకుండా కోర్టులు నిషేధం విధించరాదన్నదే మా ప్రధాన ఫిర్యాదు’’ అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ వాదిస్తూ... మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ చట్టం చేయడాన్ని హైకోర్టు నిరోధించిందని తెలిపారు. ఈ దశలో హైకోర్టు ఇచ్చిన తీర్పులోని పలు అంశాలను చదివి వినిపించారు. కాగా, ‘ఈ కేసులో ఇంకా నోటీసులు జారీ కా లేదు కదా?’ అని ధర్మాసనం ప్రశ్నించగా.... ఇంకా నోటీసులు జారీ కాలేదని న్యా యవాదులు సమాధానమిచ్చారు. నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ అన్నారు. నోటీసులు జారీ చేసి విచారణకు తేదీని ఖరారు చేయాలని కేకే వేణుగోపాల్‌ కోరారు. రాష్ట్ర విభజన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను అమరావతి పిటిషన్ల నుంచి వేరు చేయాలని రైతుల తరఫున అభిషేక్‌ మనుసంఘ్వీ విజ్ఞప్తి చేశారు. ‘‘మూడు రాజధానుల కేసులో మేము నోటీసులు జారీ చేయలేదు కాబట్టి వచ్చే సోమవారం మొదటి కేసుగా తీసుకొని విచారణ జరుపుతాం. అలాగే, రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన పిటిషన్లను ఆ రోజు విచారించబోము. వాటిని వేరుగా విచారిస్తాం. అమరావతి కేసు వివరాలను చదువుతాం. ఎందుకంటే అవి మూడు నాలుగు వందల పేజీలు సుధీర్ఘంగా ఉన్నాయి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణ తేదీలపై వచ్చిన భిన్నాభిప్రాయాలను విన్న ధర్మాసనం 28న విచారణ చేపడుతామని తేల్చి చెప్పింది. అదే రోజు రాష్ట్ర విభజన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లు కూడా విచారణకు వస్తాయని, వాటిని వేరేగా విచారిస్తామని తెలిపింది.

తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో విభజన పిటిషన్లు

కాగా, రాష్ట్ర విభజన పిటిషన్లకు సంబంధించిన ఓ న్యాయవాది వాదిస్తూ... రాష్ట్ర విభజనపై పిటిషన్లు 9 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6, 8, 9 రాజధానికి సంబంధించినవని, కాబట్టి విభజన చట్టం కోర్టులో పెండింగ్‌లో ఉన్న రీత్యా మూడు రాజధానుల పిటిషన్‌కు కాలం చెల్లినట్లేనని అన్నారు. జోక్యం చేసుకున్న ధర్మాసనం.... ‘‘అలా అని ఎవరు నిర్ణయించారు?’’ అని ప్రశ్నించింది. దీనిపై సీఎస్‌ వైద్యనాథన్‌ వాదిస్తూ... ‘‘రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు నేరుగా సుప్రీం కోర్టులో దాఖలు చేసినవి. మూడు రాజధానుల కేసు ఏమో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వచ్చింది. సుప్రీం కోర్టులో విభజన చట్టం కేసులు పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టులో వాదించకుండా ఇక్కడ వాటి గురించి ప్రస్తావించడం సరికాదు’’ అని సూచించారు.

ధిక్కరణ పిటిషన్లు ముందుకెళ్లకుండా చూడండి

‘‘తీర్పును ఇంకా అమలు చేయని కారణంగా హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఈ నెల 28న విచారణకు వస్తున్నాయి. వాటిపై ముందుకెళ్లకుండా చూడాలి. అందుకుగానూ రైతుల నుంచి హామీ తీసుకోవాలి’’ అని సీఎస్‌ వైద్యనాథన్‌ విజ్ఞప్తి చేశారు. రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు కాబట్టి ఇక కోర్టు ధిక్కరణ పిటిషన్ల విచారణపై గట్టిగా పట్టుపట్టకపోవచ్చునని ధర్మాసనం అభిప్రాయపడింది. కేసు విచారణకు రాజధాని పరిరక్షణ సమితి తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఫాలి ఎస్‌ నారిమన్‌, అభిషేక్‌ మనుసంఘ్వీ, శ్యామ్‌ దివాన్‌, నీరజ్‌ కిషన్‌ కౌల్‌, రంజిత్‌ కుమార్‌, బీ ఆదినారాయణ రావు, న్యాయవాది సంజయ్‌, ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు కేకే వేణుగోపాల్‌, సీఎస్‌ వైద్యనాథన్‌, మణీందర్‌ సింగ్‌, శేఖర్‌ నాఫడే, ఎస్‌ నిరంజన్‌ రెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం సుబ్రమణ్యం హాజరయ్యారు.

Updated Date - 2022-11-15T03:43:09+05:30 IST